టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా దుమ్మురేపింది. తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కివీస్ సారథి కేన్ విలియమ్సన్(85) చెలరేగాడు. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్(77), డేవిడ్ వార్నర్(53) వీరవిహారం చేశారు. ట్రెంట్ బౌల్ట్ (2/18) మినహా మిగతా బౌలర్లు విఫలమయ్యారు.
కీలకమైన టాస్..
మరోసారి ఈ మ్యాచ్‌లో టాస్ కీలకంగా మారింది. టాస్ నెగ్గిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుని కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే మొదటి పది ఓవర్లపాటు ఆచితూచి ఆడిన న్యూజిలాండ్.. ఆఖర్లో మాత్రం దుమ్మురేపింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ మంచి ఇన్నింగ్స్‌తో కివీస్‌ను పోటీలో నిలబెట్టాడు. మిగతా బ్యాటర్లలో గప్తిల్ 28, మిచెల్ 11, ఫిలిప్స్ 18, నీషమ్ 13 నాటౌట్, సీఫర్ట్ 8* పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 3, జంపా ఒక వికెట్ పడగొట్టారు. స్టార్క్ (4-0-60-0) తేలిపోయాడు.
కసిగా బ్యాటింగ్ చేసిన ఆసీస్
173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (5) త్వరగానే పెవిలియన్‌కు చేరాడు. అయితే ఆ ఆనందం కివీస్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. డేవిడ్ వార్నర్‌తో కలిసి మిచెల్ మార్ష్ స్వైరవిహారం చేశారు. జట్టుకు కప్ అందించాలనే కసితో ఉన్న వీరిద్దరూ కివీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో అర్ధశతకాలు నమోదు చేసుకున్నారు. విజయం ఖాయమైన సమయానికి వార్నర్ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మ్యాక్స్‌వెల్ (28*)తో కలిసి మరో వికెట్ పడనీయకుండా మార్ష్ జట్టును విజయతీరాలను చేర్చాడు. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టాడు.
- టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్ రికార్డును సమం చేశాడు కివీస్ కెప్టెన్. 48 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు కేన్. దీంతో టీ20 ప్రపంచకప్ 2016లో 66 బంతుల్లో 85 పరుగులు చేసిన మార్లన్ శామ్యూల్స్ సరసన చేరాడు.
- హేజిల్‌వుడ్ ప్రస్తుత ప్రపంచకప్‌లో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్. ఈ టోర్నీ పవర్‌ప్లేలలో మొత్తంగా అతడు 7 వికెట్లు పడగొట్టాడు.
ఇదీ చదవండి:
T20 World Cup: గత టీ20 వరల్డ్‌కప్ విన్నర్స్ వీళ్లే.. ఈసారి ఎవరో?