టీ20 ప్రపంచకప్‌లో (AUS vs NZ t20 Final) తన అనుభవాన్ని సద్వినియోగం చేసుకొని.. కివీస్‌ను కట్టడి చేయాలని ఆస్ట్రేలియా వ్యూహాలు రచిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలీయంగా కనిపిస్తున్న కంగారూలు.. ఫైనల్ పోరులో (T20 World Cup Final) పూర్తి ఆధిపత్యం కనబర్చాలని యోచిస్తున్నారు. కివీస్‌పై ఆస్ట్రేలియా సారథి, జట్టు ఓపెనర్ ఆరోన్ ఫించ్‌కు మంచి రికార్డే ఉంది. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఫామ్‌లో ఉండటం.. ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ టోర్నీలో స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్ పెద్దగా రాణించలేదు. తుదిపోరులో సత్తా చాటితే కివీస్‌పై విజయం పెద్ద కష్టమేమీ కాదని.. ఆస్ట్రేలియా అంచనా వేస్తోంది.
సెమీస్‌లో పాకిస్థాన్‌పై అద్భుతంగా రాణించిన మార్కస్ స్టోయినిస్, మ్యాథ్యూ వేడ్ కూడా జోరు కొనసాగించాలని ఆసీస్ భావిస్తోంది. బౌలింగ్ విభాగంలోనూ.. ఆస్ట్రేలియా బలంగా కనిపిస్తోంది. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హేజిల్‌వుడ్‌లతో.. పేస్ దళం పటిష్టంగా ఉంది. లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా టోర్నీలో ఇప్పటివరకు 12 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్లను హడలెత్తించాడు. ఫైనల్‌లో ఆఫ్ స్మిన్నర్ మ్యాక్స్‌వెల్ కూడా రాణిస్తే.. న్యూజిలాండ్‌ను సులభంగా కట్టడి చేయవచ్చని ఆసీస్ అంచనా వేస్తోంది.
కివీస్ ఈసారైనా..!
2019 ప్రపంచకప్ నుంచి మెరుగైన ఆటతీరు కనబరుస్తూ వస్తున్న న్యూజిలాండ్.. ఈసారి ఎలాగైనా టీ20 ప్రపంచకప్‌ను ఒడిసిపట్టాలని వ్యూహాలు రచిస్తోంది. బౌలింగ్ విభాగంలో బలీయంగా ఉన్న కివీస్.. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో బ్యాటింగ్‌లోనూ సత్తాచాటింది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్‌కు.. ఆసీస్‌పై మెరుగైన రికార్డు ఉంది. మరో ఓపెనర్ డేరిల్ మిచెల్ కూడా రాణిస్తే.. మంచి ఆరంభాన్ని అందుకోవచ్చని జట్టు అంచనా వేస్తోంది. సారథి కేన్ విలియమ్సన్.. ఇప్పటివరకు టోర్నీలో మెరుగైన ఆటతీరు కనబర్చలేదు. కీలకపోరులో సత్తాచాటితే.. ఆసీస్ జోరుకు కళ్లెం వేయవచ్చని జట్టు భావిస్తోంది. జిమ్మీ నీషమ్ మెరుగ్గా రాణిస్తుండడం కివీస్‌కు కలిసిరానుంది.