టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. గ్రూప్-1 నుంచి ఇంగ్లాండ్.. గ్రూప్-2 నుంచి పాకిస్థాన్ ఇప్పటికే సెమీస్ చేరాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం నాలుగు జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి. నేటి (నవంబర్ 6) మ్యాచ్‌లతో గ్రూప్-1 నుంచి ఏ జట్టు సెమీస్‌కు చేరుతుందో తెలిసిపోనుండగా.. ఆదివారం అఫ్గాన్ - న్యూజిలాండ్ మ్యాచ్‌తో గ్రూప్-2 నుంచి ఏ జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుందో స్పష్టత రానుంది. అయితే, ఈ మ్యాచ్ ద్వారా ఆ రెండు జట్లూ ఒత్తిడికి గురవుతాయని టీమ్‌ఇండియా మాజీ సారథి, బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
తాజాగా టీమ్‌ఇండియా.. స్కాట్లాండ్‌పై 81 బంతులు మిగిలుండగానే ఘన విజయం సాధించడం వల్ల గ్రూప్-2లో మిగతా జట్ల కన్నా మెరుగైన నెట్ రన్‌రేట్ (1.619) సాధించింది. దీంతో సెమీస్ పోరులో అది న్యూజిలాండ్ (1.277), అఫ్గాన్ (1.481) అవకాశాలకు గండికొట్టే ప్రమాదం ఏర్పడింది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే ఇప్పటికే ఆరు పాయింట్లతో ఉన్న విలియమ్సన్ టీమ్ నేరుగా సెమీస్ చేరుతుంది. అదే అఫ్గాన్ గెలిస్తే.. టీమ్‌ఇండియాతో సమానంగా నాలుగు పాయింట్లతో ఉండటం వల్ల రన్‌రేట్ విషయంలో పోటీపడాల్సి ఉంటుంది. అప్పుడు కోహ్లీసేన చివరి మ్యాచ్‌లో నమీబియాను ఎంత తేడాతో ఓడిస్తే సరిపోతుందో లెక్క తేలనుంది.