టీ20 ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో పూర్తిగా విఫలమైన టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్ బుధవారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీలే లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (74), కేఎల్ రాహుల్ (69) ధాటిగా ఆడి తొలి వికెట్‌కు 140 పరుగులు జోడించారు. రోహిత్ వెనుదిరగ్గా మరో ఏడు పరుగులకే రాహుల్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఆపై హార్దిక్ పాండ్యా (35 నాటౌట్), రిషబ్ పంత్ (27 నాటౌట్) మరింత దూకుడుగా ఆడి చివరి 21 బంతుల్లో 63 పరుగులు సాధించారు. దీంతో భారత్ ఈ ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా నిలిచింది.
తొలి రెండు మ్యాచ్‌ల్లో పరుగులు చేయడానికి ఇబ్బందులు పడిన ఈ ఆటగాళ్లంతా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా రాణించాలనే కసితో కనిపించారు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీ లైన్ దాటించారు. అనంతరం భారత బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల అఫ్గానిస్థాన్ 147/7కే పరిమితమైంది. దీంతో భారత్ 66 పరుగల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన కీలక ఘట్టాల వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. మన బ్యాట్స్‌మెన్ ఎలా రెచ్చిపోయారో, బౌలర్లు ఎలా రాణించారో మీరూ చూసి ఆస్వాదించండి.