పాకిస్థాన్‌ను ఓడించడం సాధ్యమేనా..? అవతల ఆస్ట్రేలియా ఉన్నప్పుడు ఇలాంటి సందేహాలు చాలా తక్కువగా వస్తాయి..! కానీ ఇప్పుడు సీన్ రివర్సయింది. కంగారూల జట్టు జోరుమీదున్నా ఇప్పుడు పాకిస్థానే(aus vs pak head to head) ఫేవరెట్. ఒకప్పుడు అనిశ్చితికి మారుపేరుగా ఉన్న ఆ జట్టు ఇప్పుడు టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో కఠినమైన ప్రత్యర్థిగా మారిపోయింది. మరి రెండోసారి పొట్టి కప్పు కొట్టాలన్న కసితో ఉన్న ఆ జట్టును ఓడించడం కంగారూల జట్టుకు సాధ్యమేనా..? తొలిసారి టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) నెగ్గాలన్న పట్టుదలతో ఉన్న ఆసీస్ ఫైనల్ చేరుతుందా..? కప్పు కోసం న్యూజిలాండ్‌తో ఫైనల్లో పోటీపడే జట్టేదో నేడు (నవంబర్ 11) తేలిపోనుంది.
విజయమిచ్చిన విశ్వాసంతో..
గతంలో కంటే భిన్నంగా కనిపిస్తోన్న పాకిస్థాన్(aus vs pak t20 2021) ఒత్తిడికి తలవంచకుండా సాగుతోంది. యూఏఈలో చాలా సౌకర్యంగా కనపడుతోంది. అక్కడ అనేక పీఎస్‌ఎల్ మ్యాచ్‌లు ఆడడం, సొంతగడ్డపై ఆడాల్సిన అనేక సిరీస్‌లకు అక్కడ ఆతిథ్యమివ్వడమే అందుకు కారణం. తొలి మ్యాచ్‌లో భారత్‌పై విజయం సాధించాక పాకిస్థాన్.. దుర్భేద్యంగా మారిపోయింది. బాబర్ అజామ్ నేతృత్వంలోని ఆ జట్టు టాప్ ఆర్డర్ బలంగా ఉంది. బాబర్ 264 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఓపెనర్లు బాబర్, రిజ్వాన్ విఫలమైనా.. సిక్సర్ల వీరుడు అసిఫ్ అలీ, షోయబ్ మాలిక్, హఫీజ్ రూపంలో పాక్‌కు మిడిల్ ఆర్డర్లో మ్యాచ్ విన్నర్లున్నారు. పాకిస్థాన్ బౌలింగ్ కూడా టోర్నీ ఆరంభం నుంచి ఆకట్టుకుంటోంది. పేసర్లు షహీన్ షా అఫ్రిది, రవూఫ్ బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు సృష్టిస్తున్నారు. ఆస్ట్రేలియా అతణ్ని లక్ష్యంగా ఎంచుకునే అవకాశముంది. ఇక స్పిన్నర్లు ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, షాద్‌బ్ ఖాన్‌లు ఆసీస్‌పై పాక్‌కు ప్రధాన అస్త్రాలు కానున్నారు.