బలమైన జట్టుతో బరిలో దిగి రెండోసారి టీ20 ప్రపంచకప్పును అందుకుంటుందనుకున్న టీమ్‌ఇండియా ఉసూరుమనిపించింది. పేలవ ఆటతీరుతో అభిమానులకు తీవ్ర ఆవేదన మిగిల్చింది. తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్ చేతితో చావుదెబ్బ తిన్న జట్టు.. కివీస్‌తో మ్యాచ్‌లోనైనా పుంజుకుంటుందని అంతా ఆశించారు. కానీ ఓటమి నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోని కోహ్లీసేన మరోసారి అవే తప్పులు చేసి మూల్యం చెల్లించుకుంది. ఈ ప్రపంచకప్‌లో రాత్రిపూట మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ కఠినంగా ఉంటోంది. అప్పటికే పాక్‌తో మ్యాచ్‌లో ఆ విషయం టీమ్‌ఇండియాకూ అర్థమైంది. కానీ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ మరోసారి బ్యాటింగ్‌లో జట్టు పూర్తిగా విఫలమైంది. గాల్లోకి బంతి లేపకుండా కింది నుంచి ఆడుతూ ఒక్కో పరుగు తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయకుండా లాఫ్టెడ్ షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. కుర్రాళ్లు.. సీనియర్లు అనే తేడా లేకుండా అందరిదీ అదే దారి. ఆడితే డాట్ బాల్స్ లేదంటే షాట్లు అన్నట్లు బ్యాటింగ్ చేశారు. ఈ విధమైన ఆటతీరుకు ప్రధాన కారణం ఐపీఎల్ అంటూ ఇప్పుడందరూ ఆ లీగ్‌ను విమర్శిస్తున్నారు.
తప్పు లేకపోలేదు..
ఈ ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా పేలవ ప్రదర్శనకు కొంతమేర ఐపీఎల్ కారణం కాకుండా ఏమీ లేదు. వచ్చామా.. పిచ్, పరిస్థితులు, బౌలర్ల గురించి ఆలోచించకుండా బాదామా అన్నట్లు ఆడే తీరు ఐపీఎల్‌తోనే అలవాటైంది మన వాళ్లకు. ఈ లీగ్ వల్ల బ్యాటింగ్ విధానమే పూర్తిగా మారిపోయింది. కేవలం ధనాధన్ బ్యాటింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. పరిస్థితులకు తగ్గట్లు ఆచితూచి జాగ్రత్తగా ఆడాలనే ఉద్దేశమే వాళ్లకు లేదు. షాట్లు కొట్టాలనే తొందరపాటు కనిపిస్తోంది. ఐపీఎల్ ప్రదర్శనతో టీమ్‌ఇండియాలోకి వచ్చిన ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ అదే వైఖరి అనుసరిస్తున్నారు. కొన్నిసార్లు దూకుడుగా ఆడడం మేలు చేస్తుందేమో కానీ అన్ని సార్లూ పరిస్థితులకు తగ్గట్లు ఆడడం ముఖ్యం. బంతిని గాల్లోకి లేపడం కంటే.. గ్రౌండ్ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును కదిలించడం కీలకం. కానీ అలా చేయడంలో భారత ఆటగాళ్లు విఫలమయ్యారు. మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకోలేకపోయారు. అందుకు తగినట్లు తమ ఆటను అన్వయించుకోలేకపోయారు. సోమవారం శ్రీలంకతో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కూడా మొదట బ్యాటింగ్ చేసి ఇబ్బంది పడింది. కానీ ప్రతికూల పరిస్థితుల్లో బట్లర్ ఆచితూచి ఆడాడు. ఓ భాగస్వామ్యం నెలకొల్పాక చెలరేగాడు. అతను విధ్వంసక బ్యాట్స్‌మనే అయినా పరిస్థితులకు తగ్గట్లు అన్వయించుకున్న తీరు అమోఘం. భారత ఆటగాళ్లు ఇక్కడే విఫలమయ్యారు. కేవలం భారీ షాట్లు మాత్రమే ఆడాలన్న వాళ్ల ఆలోచనకు కారణం కొంతమేర ఐపీఎల్ అనడంలో సందేహం లేదు. ఇక ఈ ప్రపంచకప్‌లో పిచ్‌లు ఇలా స్లోగా మారడంలోనూ ఐపీఎల్ పాత్ర ఉంది. ఈ కప్పుకు ముందు ఇదే వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. దీంతో జీవం కోల్పోయిన పిచ్‌లు ఇప్పుడు నెమ్మదిగా స్పందిస్తూ.. మ్యాచ్‌లను ఏకపక్షంగా మార్చేస్తున్నాయి. టాస్ గెలిస్తే మ్యాచ్ సొంతమవుతుందనే పరిస్థితికి ఇదే కారణం. ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లు నిర్వహించిన సమయం, వేదిక సరికాదనే వాదన ఉంది.