వెస్టిండీస్‌తో మంగళవారం టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021) మ్యాచ్ మొదలు కాబోతుండగా.. దక్షిణాఫ్రికా జట్టులో కీలక ఆటగాడైన క్వింటన్ డికాక్ (Black Lives Matter De Kock) వ్యక్తిగత కారణాలతో పక్కకు తప్పుకోవడం ఆ దేశ క్రికెట్లో దుమారం రేపింది. 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' ఉద్యమానికి మద్దతుగా ఆటగాళ్లందరూ మోకాళ్లపై కూర్చుని సంఘీభావం తెలపాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (South Africa Cricket News) హుకుం జారీ చేయడమే దీనికి కారణం. దక్షిణాఫ్రికా క్రికెట్లో సంక్షోభానికి ఇది హేతువయ్యేలా కనిపిస్తోంది. 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' ఉద్యమ స్ఫూర్తినీ అది ప్రశ్నార్థకం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
వర్ణ వివక్షతో కూడిన విధానం!
గత ఏడాది మేలో అమెరికాలో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్- శ్వేత జాతీయుడైన పోలీసు అధికారి కర్కశత్వానికి బలైన వీడియో అందరినీ కదిలించింది. దాన్నుంచి ఉవ్వెత్తున ఎగసిన 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారుల నుంచి సంఘీభావం వ్యక్తమవుతోంది. క్రికెట్లోనూ అది కొనసాగుతోంది. పాకిస్థాన్‌తో తాజా ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లంతా మోకాళ్లపై కూర్చుని ఆ ఉద్యమానికి మద్దతిచ్చారు. పాక్ ఆటగాళ్లు నిలబడే సంఘీభావం తెలిపారు. దక్షిణాఫ్రికా జట్టు దగ్గరికొచ్చేసరికే ఈ సంఘీభావ ప్రకటన వివాదాస్పదమైంది. దీని వెనక కారణాలు లేకపోలేదు. శ్వేత జాతీయులు ప్రాతినిధ్యం వహించే జట్లతోనే తమ ఆటగాళ్లు మ్యాచ్‌లు ఆడాలన్న విధానాన్ని అక్కడి ప్రభుత్వం గతంలో అమలులోకి తెచ్చింది. దాంతో ఆ జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి(ఐసీసీ) నిషేధం విధించింది. ఇలా 1970 నుంచి 21 ఏళ్లు దక్షిణాఫ్రికా జట్టు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంది. వర్ణ వివక్షతో కూడిన విధానం రద్దు కావడం వల్ల 1991లో నిషేధం తొలగిపోయింది. పునరాగమనం తరవాత మేటి జట్లలో ఒకటిగా దక్షిణాఫ్రికా పేరు తెచ్చుకున్నప్పటికీ.. అప్పుడప్పుడూ వర్ణ వివక్షకు (South Africa Cricket Racism) సంబంధించి అంతర్గత వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. జట్టును శ్వేత జాతీయులతోనే నింపేస్తున్నారని, నల్ల జాతీయులకు ప్రాధాన్యం దక్కట్లేదని విమర్శలు లోగడ ముమ్మరించాయి. ఆ క్రమంలోనే 'కోటా' (South Africa Cricket Racial Quota) విధానం తీసుకొచ్చారు. ఆ మేరకు తుది జట్టులో శ్వేత జాతీయుల సంఖ్య అయిదుగురికి మించకూడదు. మిగతా సభ్యుల్లో కనీసం ఇద్దరు ఆఫ్రికా నల్లజాతీయులుండాలి. వీలైనంత మేర ఆ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇది శ్వేత జాతి క్రికెటర్లలో అభద్రతభావానికి, జట్టులో అంతరాలకు దారి తీస్తోంది. డివిలియర్స్, డుప్లెసిస్ లాంటి మేటి ఆటగాళ్లు జట్టుకు దూరం కావడానికి, ప్రతిభావంతులు విదేశాలకు తరలిపోతుండటానికి, నల్ల జాతీయుల్లోనూ ఆత్మన్యూనతాభావం కలగడానికి కారణమవుతోందనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలోనే జట్టులో ఆటగాళ్ల మధ్య సఖ్యత కొరవడింది. దక్షిణాఫ్రికా ఆడిన గత మ్యాచ్‌లో బవుమా సహా కొందరు ఆటగాళ్లు (South Africa Cricket Team Players) 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' ఉద్యమానికి సంఘీభావంగా మైదానంలో మోకాళ్లపై కూర్చుంటే.. డికాక్ మాత్రం చూస్తూ నిలబడ్డాడు. కొందరు భిన్నమైన సంజ్ఞలు చేశారు. ఆటగాళ్లు ఎవరికి వారన్నట్లు వ్యవహరిస్తే చెడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో విండీస్‌తో మ్యాచ్‌కు ముందు అందరూ ఒకే తరహాలో సంఘీభావం తెలపాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదేశించింది. అయితే ఇప్పటికే కోటా విధానం, ఇతర విషయాల పట్ల అసంతృప్తితో ఉన్న డికాక్... బోర్డు ఆదేశాలను నిరాకరించారు. ఫలితంగా మ్యాచ్‌కు దూరమయ్యారు.