తెలంగాణ

telangana

ETV Bharat / sports

కంగారూ గూటికి చిట్టి ప్రపంచకప్​.. ప్రైజ్​మనీ ఎంతంటే? - ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లైవ్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో (T20 World Cup 2021) ఆస్ట్రేలియా దుమ్మురేపింది. తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో 8 వికెట్ల తేడాతో (T20 World Cup Winners) గెలుపొందింది. ఈ సందర్భంగా మ్యాచ్​ ఎలా సాగింది? విజేతకు ప్రైజ్​మనీ ఎంత? సహా పలు విశేషాల సమాహారమే ఈ కథనం..

d
ఫైనల్​లో ఆసీస్​ విధ్వంసం

By

Published : Nov 15, 2021, 6:49 AM IST

Updated : Nov 15, 2021, 7:08 AM IST

"టీమ్‌ఇండియా సమతూకంతో ఉంది.. ఈసారి మనోళ్లదే కప్పు"
రెండు మ్యాచ్‌లతోనే ఆశలకు తెరపడిపోయింది!

"వెస్టిండీస్‌ జట్టు నిండా హిట్టర్లే.. వాళ్ల ఖాతాలో ఇంకో కప్పు చేరుతుందేమో"
సూపర్‌-12 దశలోనే ఆ జట్టు పనైపోయింది!

"అమ్మో ఇంగ్లాండ్‌.. వీళ్లు కప్పు వదిలేలా లేరు"
సెమీస్‌లో కథ అడ్డం తిరిగింది!

"పాకిస్థాన్‌కు గ్రూప్‌ దశలో ఓటమే లేదు.. ఇలాగే కప్పూ గెలిచేస్తారేమో"
వాళ్లూ సెమీస్‌ గడప దాటలేదు!

"న్యూజిలాండ్‌ పట్టుదల మామూలుగా లేదు.. కప్పు వదలరేమో"
ఆ జట్టూ ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టేసింది!

చివరికి చూస్తే.. ఎవ్వరూ ఊహించని దృశ్యం.. ఆస్ట్రేలియా చేతిలో పొట్టి కప్పు!

ప్రపంచకప్‌ ముంగిట (T20 World Cup 2021) అయిదు టీ20 సిరీస్‌లు ఓడి.. బంగ్లాదేశ్‌ చేతిలోనూ మట్టికరిచి.. కీలక ఆటగాళ్ల ఫామ్‌ లేమితో, కూర్పు సమస్యలతో.. సూపర్‌-12 దశ దాటడం కూడా కష్టంగా కనిపించి, ఫేవరెట్ల జాబితాలోనే లేని ఆస్ట్రేలియా (T20 World Cup Winners) అద్భుతం చేసింది.

టోర్నీలో అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ.. సూపర్‌-12 దశ ఆఖర్లో గొప్పగా పుంజుకుని.. సెమీస్‌లో (T20 World Cup 2021) సంచలన విజయం సాధించి.. ఫైనల్లో సిసలైన ఛాంపియన్‌లా ఆడిన కంగారూ జట్టు.. టీ20 ప్రపంచకప్‌ను తొలిసారి ముద్దాడింది.

ఆసీస్‌ అదరహో.. శక్తి సామర్థ్యాలనన్నింటినీ (T20 World Cup Winners) అసలు సమరం కోసమే దాచుకున్నట్లు.. ఫైనల్లో సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. లక్ష్యం చిన్నదేమీ కాకున్నా, ప్రత్యర్థికి బలమైన బౌలింగ్‌ దళం ఉన్నా మిచెల్‌ మార్ష్‌, వార్నర్‌ మెరుపులతో కంగారూల జట్టు అలవోకగా ఛేదించింది. పాపం.. విలియమ్సన్‌! కళాత్మక విధ్వంసంతో తన జట్టుకు మంచి స్కోరునే అందించినా ఫలితం లేకపోయింది. ప్రపంచకప్పు కల చెదిరింది. ఎంతో నమ్మకం పెట్టుకున్న బౌలర్లు అతణ్ని నిరాశపరిచారు. 2015, 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనళ్లలోనూ ఓడిన కివీస్‌కు ఈ ఓటమి తీవ్ర వేదన కలిగించేదే.

మిచెల్​ మార్ష్​ విధ్వంసక ఇన్నింగ్స్​

ఆసీస్​ విజయం

ఆస్ట్రేలియా మురిసింది. అదిరే ఆటతో తొలిసారి చిట్టి ప్రపంచకప్‌ను చేజిక్కించుకుంది. మిచెల్‌ మార్ష్‌ (77 నాటౌట్‌; 50 బంతుల్లో 6×4, 4×6), వార్నర్‌ (53; 38 బంతుల్లో 4×4, 3×6) విధ్వంసం సృష్టించడం వల్ల ఆదివారం జరిగిన ఫైనల్లో ఆసీస్‌ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (85; 48 బంతుల్లో 10×4, 3×6) సంచలన బ్యాటింగ్‌తో మొదట కివీస్‌ 4 వికెట్లకు 172 పరుగులు చేసింది. హేజిల్‌వుడ్‌ (3/16) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. జంపా (1/26) రాణించాడు. మార్ష్‌, వార్నర్‌ల జోరుతో లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. మార్ష్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది. వార్నర్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌' అవార్డును అందుకున్నాడు.

ప్లేయర్​ ఆఫ్​ ది టోర్ని : డేవిడ్​ వార్నర్​ (289 పరుగులు)

ధనాధన్‌ ఛేదన: లక్ష్యం సవాలుతో కూడుకున్నదే అయినా, ఫించ్‌ (5) త్వరగానే ఔటైనా.. ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసంతో ఛేదనను సాగించిందంటే కారణం వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌లే. స్పిన్నర్లు గానీ, పేసర్లు గానీ వారిని ఇబ్బంది పెట్టలేకపోయారు. బాధ్యతాయుతంగా ఆడిన ఓపెనర్‌ వార్నర్‌ బ్యాట్‌ ఝుళిపించడానికి కాస్త సమయం తీసుకున్నా.. మార్ష్‌ క్రీజులో అడుగుపెడుతూనే చెలరేగిపోయాడు. తన తొలి మూడు బంతుల్లో వరుసగా 6, 4, 4 దంచేశాడు. క్రమంగా వార్నర్‌ కూడా బ్యాటుకు పనిచెప్పాడు. సౌథీ స్లో బంతిని సిక్స్‌గా మలిచిన అతడు.. స్పిన్నర్‌ సోధి బౌలింగ్‌లో రెండు ఫోర్లు, సిక్స్‌ కొట్టాడు. 10 ఓవర్లకు స్కోరు 82/1. ఆసీస్‌ మెరుగైన స్థితిలో ఉన్నా.. న్యూజిలాండ్‌ అవకాశాలు అప్పటికింకా పూర్తిగా దెబ్బతినలేదు. కానీ దూకుడు కొనసాగించిన వార్నర్‌, మార్ష్‌ ఆసీస్‌ను వడి వడిగా లక్ష్యం దిశగా తీసుకెళ్లారు. అయితే ఇన్నింగ్స్‌ సాఫీగా సాగిపోతున్న దశలో 13వ ఓవర్లో వార్నర్‌ను బౌల్ట్‌ బౌల్డ్‌ చేయడం వల్ల 92 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అయినా కివీస్‌.. ఆసీస్‌పై ఎలాంటి ఒత్తిడీ తేలేకపోయింది. మార్ష్‌, మ్యాక్స్‌వెల్‌ (28 నాటౌట్‌) ఆ జట్టుకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ జట్టును అలవోకగా విజయ తీరాలకు చేర్చారు. అభేద్యమైన మూడో వికెట్‌కు ఈ జంట 66 పరుగులు జోడించింది. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ (2/18) మినహా.. ఎవరూ ప్రభావవంతంగా బౌలింగ్‌ చేయలేదు.

రన్నరప్​గా నిలిచిన కివీస్​

హరి'కేన్‌' బ్యాటింగ్‌:న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ కేన్‌ విలియమ్స్‌ ఆటే హైలైట్‌. లేదంటే ఆ జట్టు తక్కువ స్కోరుతో సరిపెట్టుకోవాల్సి వచ్చేదే. ఎందుకంటే.. 8 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి ఆ జట్టు చేసిన స్కోరు 40 మాత్రమే. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. ఊహించినట్లుగానే ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. పరుగుల కోసం న్యూజిలాండ్‌ ఇబ్బంది పడింది. సెమీఫైనల్‌ హీరో మిచెల్‌ (8 బంతుల్లో 11)ను హేజిల్‌వుడ్‌ ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో ఔట్‌ చేయగా.. మరో ఓపెనర్‌ గప్తిల్‌ బ్యాట్‌ ఝుళిపించలేకపోయాడు. పరుగుల కోసం శ్రమించాడు. ఎదుర్కొన్న తొలి 28 బంతుల్లో అతడు చేసింది 22 పరుగులే. ఆ దశలో విలియమ్సన్‌ అదిరే బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు ఊపునిచ్చాడు. తన తొలి 13 బంతుల్లో 7 పరుగులే చేసిన అతడు ఆ తర్వాత చెలరేగిపోయాడు . మార్ష్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు దంచేశాడు. 11వ ఓవర్లో హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో వరుసగా మూడు కొట్టాడు. గప్తిల్‌ ఔటైనా అది ఇన్నింగ్స్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేదు. దూకుడు కొనసాగించిన విలియమ్సన్‌.. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు సాధించాడు. ఈ క్రమంలో 32 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. 16వ ఓవర్లో విలియమ్సన్‌ విధ్వంసాన్ని చూసి తీరాల్సిందే. స్టార్క్‌ బౌలింగ్‌తో అతడు నాలుగు ఫోర్లు, ఓ సిక్స్‌ కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా 22 పరుగులొచ్చాయి. మరోవైపు ఫిలిప్స్‌ కూడా కాస్త బ్యాట్‌ ఝుళిపించాడు. 16వ ఓవర్లో స్కోరు 132/2. అయితే ఆఖర్లో కివీస్‌ బౌలర్లు కాస్త పుంజుకున్నారు. మెరుగ్గా బౌలింగ్‌ చేశారు. 17వ ఓవర్లో కమిన్స్‌ 8 పరుగులివ్వగా.. తర్వాతి ఓవర్లో హేజిల్‌వుడ్‌ 5 పరుగులే ఇచ్చి ఫిలిప్స్‌ (18), విలియమ్సన్‌లను ఔట్‌ చేశాడు. నీషమ్‌ (13 నాటౌట్‌), సీఫర్ట్‌ (8 నాటౌట్‌) చివరి 2 ఓవర్లలో 23 పరుగులు రాబట్టారు.

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌:గప్తిల్‌ (సి) స్టాయినిస్‌ (బి) జంపా 28; మిచెల్‌ (సి) వేడ్‌ (బి) హేజిల్‌వుడ్‌ 11; విలియమ్సన్‌ (సి) స్మిత్‌ (బి) హేజిల్‌వుడ్‌ 85; ఫిలిప్స్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) హేజిల్‌వుడ్‌ 18; నీషమ్‌ నాటౌట్‌ 13; సీఫర్ట్‌ నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 172; వికెట్ల పతనం: 1-28, 2-76, 3-144, 4-148; బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-60-0; హేజిల్‌వుడ్‌ 4-0-16-3; మ్యాక్స్‌వెల్‌ 3-0-28-0; కమిన్స్‌ 4-0-27-0; జంపా 4-0-26-1; మార్ష్‌ 1-0-11-0

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (బి) బౌల్ట్‌ 53; ఫించ్‌ (సి) మిచెల్‌ (బి) బౌల్ట్‌ 5; మిచెల్‌ మార్ష్‌ నాటౌట్‌ 77; మ్యాక్స్‌వెల్‌ నాటౌట్‌ 28; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (18.5 ఓవర్లలో 2 వికెట్లకు) 173; వికెట్ల పతనం: 1-15, 2-107; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-18-2; సౌథీ 3.5-0-43-0; మిల్నె 4-0-30-0; ఇష్‌ సోధి 3-0-40-0; శాంట్నర్‌ 3-0-23-0; నీషమ్‌ 1-0-15-0

ప్రపంచకప్‌ గెలిచిన ఆరో జట్టు ఆస్ట్రేలియా. ఆ జట్టుకు ఇదే తొలి టీ20 టైటిల్‌. ఇంతకుముందు భారత్‌ (2007), పాకిస్థాన్‌ (2009), ఇంగ్లాండ్‌ (2010), వెస్టిండీస్‌ (2012), శ్రీలంక (2014), వెస్టిండీస్‌ (2016) విజేతలుగా నిలిచాయి.

ప్లేయర్​ ఆఫ్​ ద సిరీస్​.. టాస్​

టాస్​ గెలిస్తే మ్యాచ్​ గెలిచినట్లే.. ఈ ప్రపంచకప్​లో ఇదే గెలుపు సూత్రంగా మారిపోయింది. ముఖ్యంగా దుబాయ్​లో మ్యాచ్​ అంటే చాలు.. టాస్​ దగ్గరే ఫలితం నిర్ణయం అయిపోయే పరిస్థితి వచ్చింది. టాస్​ గెలిచి ప్రతి జట్టూ ఫీల్డింగ్​ ఎంచుకోవడం.. బ్యాటింగ్​ జట్టు తడబడటం.. తర్వాత ప్రత్యర్థి జట్టు సులువుగా లక్ష్యాన్ని ఛేదించడం.. ఒకవేళ మొదట బ్యాటింగ్​ చేసిన జట్టు కష్టపడి పెద్ద స్కోరు చేసినా.. ఛేదనలో ఆ లక్ష్యం నిలవకపోవడం.. ఇదీ వరుస! ఫైనల్లో కూడా ఈ కథ మారలేదు. టాస్​ గెలిస్తే మ్యాచ్​ గెలిచినట్లే అన్న సంప్రదాయం ఎంతో నిలకడగా సాగిన నేపథ్యంలో.. ఈ ప్రపంచకప్​లో 'ప్లేయర్​ ఆఫ్​ ద సిరీస్​' కచ్చితంగా టాస్​కే ఇవ్వాల్సిందే!

  • ప్రైజ్‌మనీ:విజేతకు: రూ.11.89 కోట్లు
  • రన్నరప్‌ జట్టుకు:రూ.5.94 కోట్లు
  • సెమీస్‌లో ఓడిన ఒక్కొక్క జట్టుకు రూ.2.97 కోట్లు
  • అత్యధిక పరుగులు:బాబర్‌ అజామ్‌ (303, పాకిస్థాన్‌)
  • అత్యధిక వికెట్లు:హసరంగ (16, శ్రీలంక)
  • అత్యధిక సిక్స్‌లు:బట్లర్‌ (13, ఇంగ్లాండ్‌).

ఇదీ చూడండి :దాదా మార్క్​ దూకుడు.. ద్రవిడ్, లక్ష్మణ్​తో మాస్టర్​ ప్లాన్

Last Updated : Nov 15, 2021, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details