తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 World Cup 2021: ఆసీసే అసలైన ఛాంపియన్​

వన్డేల్లో ఆ జట్టు ఐదు సార్లు ఛాంపియన్‌. టెస్టుల్లోనూ చాలా ఏళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. కానీ టీ20లకు వచ్చేసరికి ఆ జట్టు ప్రదర్శన (T20 World Cup 2021) అంతంతమాత్రం. ఒక్కసారీ ప్రపంచకప్‌ గెలిచింది లేదు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనూ రికార్డు ఏమంత గొప్పగా లేదు. అందులోనూ ఈసారి పొట్టి కప్పు ఆరంభానికి ముందు వరుసగా ఐదు టీ20 సిరీస్‌లలో ఓడిపోయి.. తనపై ఎవరికీ అంచనాలు లేకుండా చేసిందా జట్టు. కనీసం టీమ్​ సభ్యులైనా నమ్మారో లేదో తాము బాగా ఆడతామని! కానీ ఈ రోజు ఆ జట్టు టీ20 ప్రపంచ ఛాంపియన్‌!

world t20 cup final
ఆసీసే అసలైన ఛాంపియన్​

By

Published : Nov 15, 2021, 7:18 AM IST

ఆస్ట్రేలియా క్రికెట్లో టీ20 స్పెషలిస్టులకు లోటే లేదు. అంతర్జాతీయ స్థాయిలో రెండు మూడు జట్లను తయారు చేసుకునే స్థాయిలో ప్రతిభావంతులు ఆ జట్టు సొంతం. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో (T20 World Cup 2021) ఆస్ట్రేలియా ఆటగాళ్ల హవా ఎలాంటిదో తెలిసిందే. ఐపీఎల్‌ సహా అన్ని ప్రధాన లీగ్‌ల్లోనూ వారికి అధిక ప్రాధాన్యం లభిస్తుంటుంది. వారికి రికార్డు రేటు పలుకుతుంటుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల పిచ్‌ల మీదా ఆడిన అనుభవం ఆస్ట్రేలియా క్రికెటర్ల సొంతం. అలాంటిది అంతర్జాతీయ టీ20ల్లో ఆస్ట్రేలియా రికార్డు మిగతా ఫార్మాట్లంత గొప్పగా లేదు. ముఖ్యంగా గత రెండేళ్లలో టీ20 క్రికెట్లో పేలవ ప్రదర్శన చేశారు కంగారూలు. వరుసగా అయిదు టీ20 సిరీస్‌లను ఆ జట్టు కోల్పోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టీ20 క్రికెట్‌ చరిత్రలో తొలిసారి (T20 World Cup 2021) బంగ్లాదేశ్‌ చేతిలో కూడా ఓడిపోయింది. దీనికి తోడు బ్యాటింగ్‌లో జట్టుకు అతి పెద్ద బలమైన వార్నర్‌, ఫించ్‌ పేలవ ఫామ్‌లో ఉండటం, బౌలర్ల ప్రదర్శన కూడా గొప్పగా లేకపోవడం వల్ల ఆస్ట్రేలియాను ఈ టీ20 ప్రపంచకప్‌లో ఎవ్వరూ ఫేవరెట్‌గా పరిగణించలేదు. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలోనే ఆస్ట్రేలియా ఇంత తక్కువ అంచనాలతో ఎప్పుడూ టోర్నీలో అడుగు పెట్టలేదు.

కథ మారిందిలా..

ప్రపంచకప్‌ సూపర్‌-12 దశలో కూడా (T20 World Cup 2021) ఆస్ట్రేలియా పట్ల అంచనాలేమీ మారిపోలేదు. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 119 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి కూడా ఆ జట్టు ఆపసోపాలు పడింది. రెండో మ్యాచ్‌లో శ్రీలంకను సులువుగానే ఓడించినా.. ఇంగ్లాండ్‌తో తర్వాతి మ్యాచ్‌లో 125 పరుగులకే కుప్పకూలి, చిత్తుగా ఓడింది. దీంతో టోర్నీలో ఆస్ట్రేలియా పనైపోయిందనే అనుకున్నారు. కానీ బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌లపై భారీ విజయాలతో రన్‌రేట్‌ను (T20 World Cup Winners) బాగా పెంచుకుని సెమీస్‌కు దూసుకొచ్చింది. వార్నర్‌ సరైన సమయంలో ఫామ్‌ అందుకోవడం బ్యాటింగ్‌ పరంగా ఆసీస్‌కు బాగా కలిసొచ్చింది. మిగతా బ్యాట్స్‌మెన్‌ కూడా అడపాదడపా కీలక ఇన్నింగ్స్‌ ఆడటం వల్ల బ్యాటింగ్‌ సమస్యలు తీరిపోయాయి. బౌలింగ్‌లో జట్టును ముందుండి నడిపించింది స్పిన్నర్‌ జంపా కావడం విశేషం. అతను ప్రతి మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. పేసర్లు స్టార్క్‌, హేజిల్‌వుడ్‌ కొన్ని మ్యాచ్‌ల్లో చక్కటి ప్రదర్శన చేశారు. దీంతో క్రమంగా ఆసీస్‌ ప్రమాదకరంగా మారింది. సూపర్‌-12 అయ్యేసరికి కంగారూల ఆత్మవిశ్వాసం పెరిగింది. జట్టులో సమష్టితత్వం వచ్చింది. కూర్పు సరిగ్గా కుదిరింది. కాబట్టే సెమీస్‌లో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆ జట్టు గొప్పగా ఆడి గెలవగలిగింది.

వార్నర్‌ సెమీస్‌లోనూ సత్తా చాటితే.. గ్రూప్‌ దశలో పెద్దగా ప్రభావం చూపని స్టాయినిస్‌, వేడ్‌ సంచలన ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించారు. కొంత అదృష్టం కూడా కలిసొచ్చినప్పటికీ.. నాకౌట్‌ దశలో తీవ్ర ఒత్తిడి మధ్య ఆస్ట్రేలియా ఆటగాళ్లు చూపించిన స్థిరత్వం వారి స్థాయిని చాటిచెప్పింది. ఇక ఫైనల్లో టాస్‌ కివీస్‌కు కలిసి రాకున్నా 170 పైచిలుకు స్కోరు చేసి ఆస్ట్రేలియాకు సవాలు విసిరింది. అయినా సరే.. కంగారూ జట్టు తగ్గలేదు. ఆరంభంలోనే ఫించ్‌ వికెట్‌ పడ్డా స్థైర్యం కోల్పోలేదు. వార్నర్‌ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తే.. మిచెల్‌ మార్ష్‌ సమయోచితంగా చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యమైన మ్యాచ్‌ల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ.. కుంగిపోకుండా నిలబడటం, పుంజుకోవడం ఛాంపియన్‌ జట్ల లక్షణం. ఆసీస్‌ ఆ లక్షణంతోనే ఈసారి ప్రపంచకప్‌ గెలిచింది. ప్రపంచకప్‌ ముంగిట పేలవ ప్రదర్శన, కీలక ఆటగాళ్ల ఫామ్‌ లేమి, తమకంత అనుకూలం కాని యూఏఈలో మ్యాచ్‌లు, టోర్నీ ఆరంభంలో తడబాటు.. కీలక మ్యాచ్‌ల్లో ఎదురుగాలి.. ఇలా ప్రతికూల పరిస్థితులెన్నో దాటి ప్రపంచకప్‌ సాధించడం ఆసీస్‌ విజయం విలువను పెంచేవే.

ఇదీ చూడండి :'వార్నర్​ను విమర్శించడమంటే.. ఎలుగుబంటికి ఎదురెళ్లడమే'

ABOUT THE AUTHOR

...view details