టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) ప్రారంభానికి ముందువరకు అందరి ఫేవరెట్ జట్టు టీమ్ఇండియానే. టైటిల్ గెలిచే సామర్థ్యం ఉన్న జట్టు అంటే.. అందరూ చెప్పిన మాట టీమ్ఇండియా. కానీ, ఒక్కసారిగా ఈ ఊహాగానాలకు చెక్ పెట్టింది పాకిస్థాన్(IND vs PAK T20 clash). తొలి మ్యాచ్‌లోనే భారత్‌ను చిత్తుగా ఓడించింది. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్‌పై తొలి విజయం నమోదు చేసింది. టీ20 టోర్నీల్లో ఎప్పుడెలా జరుగుతుందో ఎవరూ ఊహించలేరు అనే మాటను నిజం చేసి చూపించింది.
ఈ టోర్నీలోని తమ రెండో మ్యాచ్‌లో టీమ్ఇండియాపై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్(IND vs NZ T20 clash). అంతే.. టీ20 వరల్డ్ కప్ సెమీస్ చేరుకునే అవకాశాలను కూడా దాదాపుగా కోల్పోయింది ఇండియా. దీంతో కోహ్లీసేనపై తీవ్ర విమర్శల పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. గత కొన్నేళ్లుగా టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు చేస్తున్న పొరపాట్లు ఏంటి?
2021 టీ20 ప్రపంచకప్:
టీమ్ఇండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్ షహీన్ షా అఫ్రిది(Shaheen Afridi vs India).. టీమ్ఇండియా టాప్ ఆర్డర్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే ఇద్దరు ఓపెనర్లను పెవిలియన్‌కు పంపాడు. అయితే.. సారథి కోహ్లీ, పంత్ నిలకడగా రాణించడం వల్ల టీమ్ఇండియాకు 151 పరుగుల గౌరవప్రదమైన స్కోరు లభించింది.
అనంతరం ఛేదనలో ఒక్క వికెట్ కోల్పోకుండా భారత్‌పై గెలిచింది పాక్. అయితే.. ఆరంభంలో భువనేశ్వర్ కుమార్, షమిలకు బౌలింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఇచ్చాడు విరాట్. దీంతో పాక్ బ్యాటర్లు మరింత రెచ్చిపోయారు. కోహ్లీ.. జస్ప్రీత్ బుమ్రాను ముందే బరిలోకి దింపి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఓపెనర్‌గా ఇషాన్..
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు బదులుగా ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకుంది టీమ్ఇండియా మేనేజ్మెంట్. అయితే.. అతడిని కేఎల్ రాహుల్‌తో ఓపెనర్‌గా(Ishan Kishan Opener) బరిలోకి దింపింది. ఈ నిర్ణయం టీమ్ఇండియా కొంపముంచింది. ఓపెనర్లు సహా.. తర్వాత బ్యాటింగ్ బరిలోకి దిగిన రోహిత్ శర్మ కూడా విఫలమయ్యాడు. దీంతో మిడిలార్డర్‌పైనా ఒత్తిడి పెరిగింది.
ఈ నిర్ణయం భారత జట్టు చేసిన పెద్ద పొరపాటు అని రోహిత్- రాహుల్‌నే ఓపెనర్లుగా పంపించి ఉంటే బాగుండేదని ముంబయి ఇండియన్స్ జట్టు హెడ్ కోచ్ జయవర్ధనే అభిప్రాయపడ్డాడు.
మేటి జట్టుతో పోరుకు సిద్ధమైనా.. టీమ్ఇండియా ఈ టోర్నీలో ఘోరంగా విఫలమైంది. అయితే.. వరుసగా బయోబబుల్‌లో ఉండటం వల్ల కూడా ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగిందని కొందరు సీనియర్ క్రికెటర్లు చెబుతున్నారు.
2009 టీ20 ప్రపంచకప్:
2007లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్(Dhoni in t20 world cup 2007) గెలిచింది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ కూడా ప్రారంభమైంది. ఈ ఐపీఎల్లో భాగంగా యువ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటారు.