తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెన్నిస్​ రాకెట్​తో అదరగొడుతున్న యువతరం.. భవిష్యత్​ ఆ కుర్రాళ్లదే!

ఫెదరర్‌, నాదల్‌, జకోవిచ్‌.. దాదాపు రెండు దశాబ్దాల పాటు పురుషుల టెన్నిస్‌లో వీరిదే హవా! మధ్య మధ్యలో ముర్రే, వావ్రింకా, డెల్‌పొట్రో లాంటి యువ ఆటగాళ్లు దూకుడు చూపించినా అది కొంత కాలమే! ఇటీవల ఫెదరర్‌ జోరు తగ్గినా.. జకోవిచ్‌, నాదల్‌ మాత్రం ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. మెద్వెదెవ్‌, జ్వెరెవ్‌ లాంటి తర్వాతి తరం కుర్రాళ్లు వీరికి సవాలు విసిరేట్లు కనిపించినా.. వారిలోనూ నిలకడ లోపించింది. కానీ ఇప్పుడు టెన్నిస్‌ యవనిక పైకి దూసుకొస్తున్న యువతరం ఆషామాషీగా కనిపించట్లేదు. భవిష్యత్‌ మాదే అని రాకెట్‌ గుద్ది చెబుతున్న ఆ కుర్రాళ్ల కథేంటో చూద్దాం.

youth youth players tennis
youth players tennis

By

Published : Sep 14, 2022, 7:07 AM IST

అల్కరాస్‌.. ఇప్పుడు టెన్నిస్‌ ప్రపంచంలో మార్మోగుతున్న పేరిది. ఇందుకు అతను యుఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలవడమొక్కటే కారణం కాదు. ఈ టోర్నీలో అతనాడిన తీరు చూస్తే ఇలాంటి టైటిళ్లు మరెన్నో తన ఖాతాలో చేరబోతున్నాయని అందరికీ అర్థమైపోయింది. యుఎస్‌ ఓపెన్‌ చరిత్రలోనే ఒక సీజన్లో అత్యధిక సమయం మైదానంలో గడిపిన ఆటగాడతను. టైటిల్‌ గెలిచే క్రమంలో అతను దాదాపు 24 గంటలు ప్రత్యర్థులతో తలపడ్డాడు. క్వార్టర్స్‌, సెమీస్‌లో అయిదు సెట్ల పోరాటాల్లో తలపడ్డాడు. సిన్నర్‌తో అతడి క్వార్టర్స్‌ పోరు యుఎస్‌ ఓపెన్‌ చరిత్రలోనే రెండో సుదీర్ఘ మ్యాచ్‌ (5 గంటల 15 నిమిషాలు)గా రికార్డులకెక్కింది.

.

19 ఏళ్ల కుర్రాడు వరుసగా ఇలాంటి సుదీర్ఘ మ్యాచ్‌లు ఆడి అనుభవజ్ఞులు, తనకంటే బలంగా కనిపించిన ఆటగాళ్లను ఓడించి టైటిల్‌ గెలవడం మామూలు విషయం కాదు. అల్కరాస్‌ది మామూలు ఫిట్‌నెస్‌ కాదని, గొప్ప నైపుణ్యం కూడా ఉన్న అతను అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదగడం పక్కా అని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ మాత్రమే కాక, అయిదు ఏటీపీ టైటిళ్లు కూడా నెగ్గి ప్రపంచ నంబర్‌వన్‌గా ఎదిగిన అల్కరాస్‌.. జకోవిచ్‌, నాదల్‌ లాంటి దిగ్గజాలకు కూడా చెక్‌ పెట్టడం ఖాయమని అంచనా.

జకోవిచ్‌ లేడు. ఫెదరర్‌ ఆడట్లేదు. ఇంకేముంది.. ఈసారి యుఎస్‌ ఓపెన్‌ రఫెల్‌ నాదల్‌దే అని అతడి అభిమానులు ధీమాతో ఉన్నారు. కానీ టైటిల్‌ గెలవడం కాదు కదా.. కనీసం క్వార్టర్స్‌ కూడా చేరలేకపోయాడు స్పెయిన్‌ యోధుడు. ప్రిక్వార్టర్స్‌లో అతడికి చెక్‌ పెట్టి పెను సంచలనం సృష్టించాడు అమెరికా కుర్రాడు తియాఫో. "నేను నా పిల్లలకు, వారి పిల్లలకు భవిష్యత్తులో చెప్పుకోవడానికి ఇది చాలు. నేను నాదల్‌పై గెలిచాను" అంటూ ఆ మ్యాచ్‌ అనంతరం ఉద్వేగానికి గురయ్యాడతను.

.

అయితే తియాఫో తన సామర్థ్యాన్ని నమ్మితే ఇలాంటి విజయాలు మరిన్ని సాధించగలడని మాజీలు అంటున్నారు. 2018లో తొలి ఏటీపీ టైటిల్‌ సాధించి, ఆండీ రాడిక్‌ తర్వాత ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన అమెరికన్‌ ప్లేయర్‌గా ఘనత సాధించిన తియాఫో.. తర్వాత అడపా దడపా విజయాలు సాధిస్తున్నాడు. కానీ ఇటీవల అతడి ప్రదర్శన ఎంతో మెరుగైంది. యుఎస్‌ ఓపెన్‌లో నాదల్‌పై గెలవడమే కాక.. అల్కరాస్‌తో అయిదు సెట్ల సెమీస్‌ పోరులో హోరాహోరీగా తలపడ్డాడు. తాజాగా అతను కెరీర్లోనే ఉత్తమంగా 19వ ర్యాంకు సాధించాడు.

జాన్‌ సిన్నర్‌.. ఈ ఇటలీ కుర్రాడి ర్యాంకు మూడేళ్ల ముందు 300 పైచిలుకే. కానీ ఇప్పుడతను ప్రపంచ 11వ ర్యాంకులో ఉన్నాడు. ఇప్పటికే కెరీర్లో ఉత్తమంగా 9వ ర్యాంకు కూడా సాధించాడు. అతను టాప్‌-5లోకి అడుగు పెట్టే రోజులు ఎంతో దూరంలో లేవన్నది టెన్నిస్‌ నిపుణుల మాట. కోర్టులో అతడి దూకుడు అలా ఉంది మరి. ఇటీవల యుఎస్‌ ఓపెన్‌లో అల్కరాస్‌తో క్వార్టర్స్‌లో అతను మామూలుగా తలపడలేదు. అత్యుత్తమ ఆటతో చెలరేగిన అల్కరాస్‌ను తీవ్రంగా ప్రతిఘటించాడు.

.

అతడి పోరాట పటిమ దిగ్గజ ఆటగాళ్లను మెప్పించింది. ఇటలీ తరఫున ఎప్పుడో 1959, 60ల్లో పీట్రంగెలి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లు గెలిచాడు. ఆ తర్వాత ఆ దేశం నుంచి ఎవ్వరూ పురుషుల సింగిల్స్‌లో గ్రాండ్‌స్లామ్‌ గెలవలేదు. సిన్నర్‌ ఆ నిరీక్షణకు త్వరలోనే తెరదించే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయి. ఈ ఏడాది అతను ఫ్రెంచ్‌ ఓపెన్‌ మినహా మూడు గ్రాండ్‌స్లామ్స్‌లోనూ క్వార్టర్స్‌ చేరాడు. ఇప్పటికే ఆరు ఏటీపీ టైటిళ్లు సాధించిన సిన్నర్‌.. త్వరలోనే గ్రాండ్‌స్లామ్‌ ఖాతా తెరిస్తే ఆశ్చర్యమేమీ లేదు.

పురుషుల టెన్నిస్‌లో నార్వే పేరు పెద్దగా వినిపించేది కాదు ఒకప్పుడు. కానీ కాస్పర్‌ రూడ్‌ తన దేశానికి టెన్నిస్‌లో గొప్ప గుర్తింపే తెచ్చి పెట్టాడు. ఆ దేశం నుంచి తొలి ఏటీపీ టైటిల్‌ గెలిచింది రూడ్‌యే. ఇప్పటికే అతను తొమ్మిది ఏటీపీ టైటిళ్లు సాధించడం విశేషం. అతను ఈ ఏడాది దేశానికి తొలి గ్రాండ్‌స్లామ్‌ కూడా సాధించి పెడతాడని అభిమానులు ఆశించారు. అయితే ఫ్రెంచ్‌ ఓపెన్‌తో పాటు యుఎస్‌ ఓపెన్‌లోనూ ఫైనల్‌ చేరిన అతడికి నిరాశ తప్పలేదు.

.

రోలాండ్‌ గారోస్‌లో నాదల్‌కు తలవంచిన అతడికి.. న్యూయార్క్‌లో అల్కరాస్‌ చెక్‌ పెట్టాడు. యుఎస్‌ ఓపెన్‌ గెలిస్తే అతను నంబర్‌వన్‌ అయ్యేవాడు. ఫైనల్‌ ఓటమితో రెండో ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. అయితే గత రెండేళ్ల ప్రదర్శన, యుఎస్‌ ఓపెన్‌లో ఆట చూశాక రూడ్‌ గ్రాండ్‌స్లామ్‌ విజయానికి అత్యంత చేరువగా ఉన్నాడన్నది స్పష్టం. మట్టి కోర్టులో మంచి రికార్డున్న రూడ్‌.. నాదల్‌ తర్వాత ఇక్కడ ఆధిపత్యం చలాయిస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి:ఆసియా కప్​లో భారత్​ ఓటమిపై బీసీసీఐ సమీక్ష.. కారణాలివే

సత్తా చాటిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్.. వరల్డ్​ ర్యాంకింగ్స్​లో టాప్​

ABOUT THE AUTHOR

...view details