భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళన రెండో రోజు కొనసాగుతోంది. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా, సాక్షి మలిక్, సంగీత ఫొగాట్ సహా పలువురు క్రీడాకారులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పునియా మాట్లాడుతూ.. "ఈ దేశం కోసం మేం పోరాడుతున్నప్పుడు.. మా హక్కుల కోసం పోరాడుతాం" అని తెలిపాడు. బ్రిజ్ భూషణ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించే వరకు ఈ ఆందోళన విరమించబోమని స్పష్టం చేశాడు.
'WFI రద్దు చేయకపోతే అతడిపై కేసు పెడతాం'
తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని కేంద్రం ప్రభుత్వం హామీ ఇచ్చిందని రెజ్లరు తెలిపారు. అయితే సంతృప్తికరమైన ప్రతిస్పందన మాత్రం లేదని, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను వెంటనే రద్దు చేయకపోతే అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై అనేక కేసులు పెడతామని చెప్పారు. తాము నిజమే చెబుతున్నామని, నమ్మండని అన్నారు. అసలు బ్రిజ్ భూషన్ ఎక్కడ ఉన్నారని రెజ్లర్లు ప్రశ్నించారు
'ప్లీజ్ స్టేజ్ దిగండి బృందా మేడమ్ '
ఈ క్రమంలో వారికి మద్దతు తెలిపేందుకు బృందా కారాట్ నిరసన స్థలానికి వచ్చారు. వేదికపైకి ఎక్కిన ఆమెతో భజరంగ్ పునియా మాట్లాడాడు. 'ప్లీజ్ మేడమ్.. ఈ వేదిక నుంచి దిగి వెళ్లిపోండి. ఇది అథ్లెట్లు చేస్తోన్న పోరాటం. దీనిని రాజకీయం చేయకండి’ అని పునియా ఆమెను వేడుకున్నాడు. కాగా దీనిపై బృందా కారాట్ మీడియాతో మాట్లాడారు. 'మహిళలపై జరిగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసేందుకే ఇక్కడికి వచ్చాం' అని ఆమె మీడియాతో అన్నారు.
మధ్యవర్తిగా బబితా ఫొగాట్..
మరోవైపు, మరో రెజ్లర్ బబితా ఫొగాట్ ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా గురువారం ధర్నా ప్రాంతానికి వచ్చి రెజ్లర్లతో మాట్లాడారు. "అథ్లెట్లకు ప్రభుత్వం మద్దతుగా ఉంది. ఈ సమస్యను ఈ రోజే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా" అని బబిత తెలిపారు. మరోవైపు ఆందోళన చేస్తోన్న రెజ్లర్లకు పలువురు ప్రతిపక్ష రాజకీయ ప్రముఖులు మద్దతు తెలిపారు.