Wrestlers Protest India : భారత రెజ్లర్లు చేపట్టిన కొత్త పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్న రెజ్లర్లపై.. పోలీసులు దురుసుగా వ్యవహరించారు. పోలీసుల తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. జంతర్ మంతర్ నుంచి మార్చ్ నిర్వహించిన క్రీడాకారులు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజ్‌రంగ్ పునియాలను అడ్డుకున్న పోలీసులు.. వారిని నిర్బంధించి అక్కడి నుంచి తరలించారు. దీనిపై దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు రాజకీయ పార్టీల నేతలు, క్రీడాకారులు.. పోలీసుల తీరుపై మండిపడ్డారు. కాగా తమ విధులకు ఆటంకం కలిగించారంటూ నిరసనల్లో పాల్గొన్న రెజ్లర్లపై కేసు నమోదు చేశారు పోలీసులు.
మండిపడ్డ విపక్షాలు
బీజేపీ ప్రభుత్వానికి అహంకారం మరింత ఎక్కువైందన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా. ఆందోళన చేస్తున్న మహిళా క్రీడాకారులపై కనికరం లేకుండా అణచివేస్తున్నారని ఆమె మండిపడ్డారు. దేశ గౌరవాన్ని పెంచే మన క్రీడాకారులతో దురుసుగా ప్రవర్తించడం తప్పని అభిప్రాయపడ్డారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్‌లపై దిల్లీ పోలీసులు చేయిచేసుకోవడంపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వెలుబుచ్చారు. ప్రజాస్వామ్యం సహనంతోనే ఉందని.. కానీ, అణచివేత శక్తులు మాత్రం అసహనంతో ఉన్నాయని ఆమె మండిపడ్డారు.