Wrestlers Protest Issue : భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలపై 1983 క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన కపిల్ దేవ్ నేతృత్వంలోని జట్టు స్పందించింది. రెజ్లర్లకు తాము మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించింది. "మా ఛాంపియన్ రెజ్లర్లపై ప్రభుత్వం, పోలీసులు ప్రవర్తిస్తున్న అసభ్య తీరును చూస్తుంటే మాకు చాలా బాధ కలుగుతుంది. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేయాలనే ఆలోచన మమ్మల్ని కలవరపరిచింది. ఎన్నో సంవత్సరాల కష్టపడితే గానీ ఆ పతకాలు మీకు రాలేదు. అవి రావడంలో మీతో పాటు ఎందరో త్యాగం, కృషి, దృఢ విశ్వాసం, సంకల్పం కలిగి ఉన్నాయి. ఈ పతకాలు మీ గెలుపు మాత్రమే కాదు, దేశానికి కూడా ఎంతో గర్వకారణం. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మేము మల్లయోధులను కోరుతున్నాం. అలాగే వారు లేవనెత్తుతున్న అంశాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని త్వరగా సమస్యకు ముగింపు పలకాలని మేము కోరుతున్నాము. చట్టం తన పని తాను చేస్తుంది" అంటూ ప్రకటనను విడుదల చేసింది.
"మల్లయోధులు చేస్తున్న నిరసనలు చాలా బాధకరం. వారు తమ పతకాలను గంగా నదిలో పారవేయాలనే నిర్ణయం నన్ను బాధ కలిగించింది. ఒక పతకం సాధించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. వాటి వెనక ఎందరో కృషి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని మేము సమర్థించటం లేదు. వీలైనంత త్వరగా ప్రభుత్వం కూడా వారి సమస్యలను పరిష్కరించాలి."