Wrestlers Protest Delhi Police Case : బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధించారంటూ మహిళా రెజర్లు చేసిన ఆరోపణలపై దిల్లీ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటన్నర ప్రాంతంలో ఆయన కార్యాలయానికి ఓ మహిళా రెజ్లర్‌ను తీసుకెళ్లిన పోలీసులు అక్కడ సీన్ రీక్రియేట్ చేశారు. ఆమె వెంట మహిళా కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. దాదాపు అరగంట పాటు పోలీసులు అక్కడ ఉన్నారు. ఆ కార్యాలయంలో ఆమె ఎక్కడెక్కడ వేధింపులకు గురైందో గుర్తుకు తెచ్చుకుని ఆ సీన్‌ను రీక్రియేట్ చేయాలని పోలీసులు ఆమెను కోరారు.
పోలీసులు బ్రిజ్ భూషణ్ కార్యాలయంలో సీన్ రీక్రియేట్ చేసి బయటకు వచ్చిన కాసేపటికే రెజ్లర్లు.. రాజీ కుదుర్చుకునేందుకే WFI ప్రధాన కార్యాలయానికి వెళ్లారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ట్విట్టర్ వేదికగా మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఖండించారు.
"WFI చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు ఉన్న శక్తి ఇదే. తన కండబలం, రాజకీయ బలం ఉపయోగించి మీడియాలో తప్పుడు కథనాలు రాయించి మహిళా రెజ్లర్లను వేధిస్తున్నారు. పోలీసులు.. మమ్మల్ని వేధించకుండా బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలి. ఆయనను అరెస్ట్ చేస్తే మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతుంది."
--వినేశ్ ఫోగట్, మహిళా రెజ్లర్
'మహిళా రెజ్లర్ల పట్ల బ్రిజ్ భూషణ్ ప్రవర్తనకు నేను ప్రత్యక్ష సాక్షిని'
Jagbir Singh Referee On Brij Bhushan : భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు అంతర్జాతీయ రిఫరీ జగ్బీర్ సింగ్. మహిళా రెజ్లర్ల పట్ల బ్రిజ్ భూషణ్ అనుచిత ప్రవర్తనను తాను చూశానని జగ్బీర్ సింగ్ తెలిపారు. 2013 నుంచి అనేక సందర్భాల్లో మహిళా రెజ్లర్ల పట్ల బ్రిజ్ భూషణ్ .. అనుచితంగా ప్రవర్తించిన తీరుకు తాను సాక్షినని వెల్లడించారు.
"నేను 2007 నుంచి అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ(UWW) రిఫరీగా ఉన్నాను. నాకు బ్రిజ్ భూషణ్ చాలా కాలంగా తెలుసు. మహిళా రెజ్లర్ల పట్ల ఆయన అనుచిత ప్రవర్తనను చాలా సార్లు చూశాను. 2013లో కజకిస్థాన్‌లో భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్‌గా బ్రిజ్ భూషణ్.. బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు నాకు, జూనియర్ రెజ్లర్లకు హోటల్లో ఇండియన్ ఫుడ్ తినిపిస్తానని పార్టీ ఏర్పాటు చేశారు. అప్పుడు బ్రిజ్ భూషణ్, అతని అనుచరులు మద్యం సేవించి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం నేను చూశాను."
--జగ్బీర్ సింగ్, అంతర్జాతీయ రిఫరీ
WFI Elections : డబ్ల్యూఎఫ్‌ఐకి జూన్ 30 లోపు నిర్వహించేందుకు భారత ఒలింపిక్ అసోసియేషన్(IOA) సిద్ధమవుతోంది. తాత్కాలిక ప్యానెల్ ఓటర్ల జాబితాను సేకరించే పనిలో నిమగ్నమైంది. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు రిటైర్జ్ హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో జరుగుతాయి. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలను జూన్ 30లోగా నిర్వహించాలని ప్రభుత్వం గడువు విధించిన నేపథ్యంలో ఈమేరకు కసరత్తు ముమ్మరమైంది.
Wrestlers Meet Anurag Thakur : రెజ్లర్ల ఫిర్యాదుతో బ్రిజ్ భూషణ్‌పై దిల్లీ పోలీసులు ఇప్పటికే రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వాటిపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. ఇప్పటివరకు 180 మందికిపైగా విచారించారు. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఇటీవల భారత అగ్రశ్రేణి రెజర్లు దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొన్ని రోజుల పాటు దీక్ష చేపట్టారు. వీరి ఆందోళన ఇటీవల ఉద్ధృతమవడం వల్ల స్పందించిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. వారితో చర్చలు జరిపారు. బ్రిజ్ భూషణ్‌పై ఈ నెల 15 లోపు ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని, జూన్ 30 లోపు డబ్ల్యూఎఫ్‌ఐకి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం హామీ ఇవ్వడం వల్ల.. రెజ్లర్లు తమ ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు.