Wrestler Sakshi Malik Retirement :రెజ్లింగ్ సమఖ్య ఎన్నికల ఫలితాల పట్ల స్టార్ రెజ్లర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు రెజ్లర్లు మీడియా ముందుకొచ్చి తమ బాధను వెళ్లగక్కుతున్నారు. అయితే తాజాగా స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ను ప్రకటించింది. సమాఖ్య ఫలితాల నేపథ్యంలో ఆమె ఈ అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. తాజాగా జరిగిన సమావేశంలో ఆమె భావోద్వేగానికి లోనైంది. దీంతో బ్రిజ్ భూషణ్ అనుచరుల నేతృత్వంలో ఆమె పోటీల్లో పాల్గొననంటూ తేల్చిచెప్పింది.
"మేము మనస్ఫూర్తిగా పోరాడాము. రోడ్లపై 40 రోజులు గడిపాము. దేశ నలుమూలల నుంచి మాకు ఎంతో మంది మద్దతు పలికారు. కానీ బ్రిజ్ భూషణ్ వ్యాపార భాగస్వామి, సన్నిహితుడు డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మేము మహిళా అధ్యక్షురాలిని కోరుకున్నాము కానీ అది జరగలేదు. అందుకే నేను ఈ రెజ్లింగ్‌ను వదిలిపెట్టాను" అంటూ సాక్షి భావోద్వేగానికి లోనైంది. ఆ తర్వాత కంటతడి పెట్టుకుంటూ బయటకి వెళ్లిపోయింది.
మరోవైపు సమాఖ్య ఎన్నికల గురించి మరో స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్రిజ్ భూషణ్ అనుచరులు ఈ పోటీలో పాల్గొనరన్న మాటను ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందంటూ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడాడు. "మేము మహిళల కోసం అలాగే సత్యం కోసం పోరాడుతున్నాము. ఈ వ్యవస్థ పనిచేసిన తీరును చూస్తుంటే ఇక్కడ అమ్మాయిలకు న్యాయం జరిగేలా నాకు అనిపించడం లేదు. అయితే ఇప్పటికీ మాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. " అంటూ బజరంగ్ తన ఆవేదనను ప్రెస్ మీట్లో వ్యక్తం చేశాడు.