Wrestling Medals : భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరంతా తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెజ్లర్లు తమ పతకాలను హరిద్వార్(wrestlers haridwar) గంగానదిలో పడేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడా నిర్ణయంపై వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో హరిద్వార్‌లోని గంగానది ఒడ్డున హైడ్రామా కొనసాగింది. రైతు సంఘాల నేత నరేశ్ టికాయత్ హరిద్వార్‌కు చేరుకుని రెజ్లర్లను సముదాయించారు. స్థానికులు, మద్దతుదారులతో కలిసి వారిని వారించారు. వారి వద్ద నుంచి పతకాలను టికాయత్ తీసుకున్నారు. ఐదురోజులు వేచి ఉండాలని రెజ్లర్లకు టికాయత్ సూచించారు. ప్రభుత్వానికి రైతు సంఘాల నేతలు ఐదు రోజులు గడువిచ్చారు. అలా రైతు సంఘ నేతల సూచనలతో రెజర్లు ఆందోళన విరమించారు. నరేశ్ టికాయత్‌తో చర్చల అనంతరం రెజ్లర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అనుమతి ఇవ్వం.. అంతకుముందు గంగానదిలో మెడల్స్‌ను పారవేసిన తర్వాత రెజ్లర్లు ఇండియా గేట్‌కు చేరుకుంటామని ప్రకటించారు. అయితే వారిని అక్కడ నిరసనలు చేసేందుకు అనుమతి ఇవ్వబోమని పోలీసులు స్పష్టం చేశారు. ఇండియా గేట్ వారసత్వ సంపద అనీ .. అక్కడ నిరసనలు చేసేందుకు అనుమతి ఉండదని తెలిపారు.
Wrestlers Protest : కాగా, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు తమను లైంగికంగా వేధించాడంటూ.. దాదాపు నెల రోజులకు పైగా నుంచి దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫోగాట్, సాక్షి మాలిక్, బజ్ రంగ్ పునియా తదితరులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. భూషణ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం(మే 28) ఆందోళనలను తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం వేళ.. అటు వైపు మార్చ్ చేపట్టిన రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసుల నిర్బంధించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తోపు లాటలో పలువురు అథ్లెట్లు కింద పడిపోయిన దృశ్యాలు కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అనంతరం అధికారులు నిరసనకారులందరినీ నిర్బంధించారు. అథ్లెట్లు శాంతి భద్రతలను ఉల్లంఘించినందుకు.. తగిన విచారణ చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే, రెజ్లర్ల దీక్షా శిబిరాన్ని కూడా తొలగించారు. ఆ తర్వాతే రెజర్లు హరిద్వారా వెళ్లి నిరసన చేపట్టారు.