తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచ బ్లిట్జ్ చెస్​​ ఛాంపియన్​షిప్​లో హంపి@12 - World Women's Blitz Chess Championship 2019: Koneru Humpy Finishes 12th position

మాస్కో వేదికగా ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తెలుగమ్మాయి కోనేరు హంపి.. బ్లిట్జ్‌ విభాగంలో 12వ స్థానంతో సరిపెట్టుకుంది. అగ్రస్థానంలో నిలిచిన రష్యా మహిళా గ్రాండ్​మాస్టర్​ లాగ్​నో కేథరినా టైటిల్​ గెలిచింది. పురుషుల్లో నార్వేకు చెందిన మాగ్నస్​ కార్ల్​సన్​ విజేతగా నిలిచాడు.

World Women's Blitz Chess Championship 2019
ప్రపంచ బ్లిట్జ్ చెస్​​ ఛాంపియన్​షిప్​లో హంపి@12

By

Published : Dec 31, 2019, 7:27 PM IST

పెళ్లయిన రెండేళ్ల తర్వాత పునరాగమనం చేసిన చదరంగ ధ్రువతార, తెలుగమ్మాయి కోనేరు హంపి... ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శనతో రాణించింది. ఇటీవలే భారత్​కు ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం అందించింది. తాజాగా బ్లిట్జ్‌ విభాగంలో మరో పతకం ఆశించినా, అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇందులో 12వ స్థానానికే పరిమితమైంది హంపి.

రేసులో నిలబడి.. తర్వాత వెనుకబడి

బ్లిట్జ్​లో 14వ రౌండ్‌ వరకు రెండో స్థానంలో కొనసాగింది హంపి. కచ్చితంగా ఏదో ఒక పతకం తెస్తుందని అంతా భావించారు. అయితే వరుసగా 15, 16, 17వ రౌండ్‌ల్లో ఓడిపోయిన ఆమె... పతక అవకాశాలను చేజార్చుకుంది. చివరికి 17 రౌండ్ల తర్వాత 10.5 పాయింట్లతో నిలిచింది. టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా ఈ సీనియర్​ క్రీడాకారిణికి 12వ స్థానం దక్కింది.

రష్యాలోని మాస్కో వేదికగా ముగిసిన బ్లిట్జ్​ విభాగంలో 12.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది అదే దేశానికి చెందిన మహిళా గ్రాండ్​మాస్టర్​ లాగ్​నో కేథరినా. ఆ తర్వాత టైటిల్​ గెలుచుకుంది. పురుషుల్లో నార్వేకు చెందిన మాగ్నస్​ కార్ల్​సన్​ విజేతగా నిలిచాడు. మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక (10 పాయింట్లు) 25వ ర్యాంకు సొంతం చేసుకుంది.

పురుషుల్లో మాగ్నస్‌ కార్ల్‌సన్‌ హ్యాట్రిక్‌ కొట్టాడు. ఇప్పటికే ప్రపంచ క్లాసిక్‌ విజేతగా నిలిచిన అతడు.. తాజాగా ముగిసిన ర్యాపిడ్‌తో పాటు బ్లిట్జ్‌ టోర్నీల్లోనూ టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. బ్లిట్జ్‌లో 21 రౌండ్లలో 14.5 పాయింట్లతో కార్ల్‌సన్‌ అగ్రస్థానంలో నిలిచాడు.

ర్యాపిడ్​లో చరిత్ర

భారత మహిళల చెస్​ నంబర్​ వన్​గా ఉన్న కోనేరు హంపి.. ఇటీవలే ముగిసిన ప్రపంచ టోర్నీలో తొలిసారి ప్రపంచ ర్యాపిడ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ప్లేఆఫ్స్‌లో చైనా గ్రాండ్‌మాస్టర్‌ లీ టింగ్‌జీని ఓడించి టైటిల్‌ అందుకుంది. 2015లో మహిళల ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, ఈ ఏడాది ఫిడే మహిళల గ్రాండ్‌ప్రిలో స్వర్ణం సాధించిన హంపికి.. ఇదే తొలి ప్రపంచ టైటిల్‌. భారత్‌ తరఫున మహిళల విభాగంలోనూ మొదటి ప్రపంచ టైటిల్‌ సాధించి, చరిత్ర సృష్టించింది.

ABOUT THE AUTHOR

...view details