World Rapid Chess Championship 2023 Koneru Humpy :భారత స్టార్ చెస్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అదరగొడుతోంది. వయసుతో పాటు అనుభవాన్ని పెంచుకుంటూ ఆటలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ దూసుకెళ్తోంది. యువ ప్లేయర్లకు దీటుగా నిలుస్తూ అగ్రశ్రేణి ప్లేయర్లను ఓడిస్తూ సాగిపోతోంది. 2019లో ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన హంపి, ఇప్పుడు రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది.
కెరీర్‌లో లెక్కకు మిక్కిలి విజయాలు, పతకాలు సాధించిన ఈ 36 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ నిలకడగా రాణిస్తోంది. 2017లో పాపకు జన్మనివ్వడంతో రెండేళ్ల పాటు 64 గళ్ల బోర్డుకు దూరమైనా ఆమె ఆగిపోలేదు. తిరిగి ఎత్తులు వేయడమే కాదు 2019 ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌గా నిలిచి వావ్ అనిపించింది. ఓవైపు కుటుంబాన్ని చూసుకుంటూ, మరోవైపు ఆటలో ఈ 'అమ్మ' నిలకడగా ఆడుతోంది. కొత్త టెక్నిక్‌లతో, వ్యూహాలతో వస్తున్న యువ క్రీడాకారిణులపై గెలిచేందుకు ఎప్పటికప్పుడూ తన వ్యూహాలను మెరుగుపరుచుకుంటోంది.
2023 ఫిడే మహిళల గ్రాండ్ ప్రిలో రన్నరప్‌గా కూడా నిలిచిన హంపి, ఇప్పుడు ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో ఆకట్టుకుంది. 11 రౌండ్లకు గాను కేవలం ఒక్క దాంట్లోనే ఓడిపోయింది. ఏడు విజయాలు సాధించింది. మూడు డ్రాలు చేసుకుంది. టైబ్రేక్‌లో విజయం కోసం గట్టిగానే పోరాడినా గెలవలేకపోయింది.
గురువారం ఆఖరిదైన 11వ రౌండ్లో కేథెరీనా (రష్యా)పై హంపి విజయం సాధించింది. తెల్ల పావులతో ఆడిన ఆమె గొప్ప నైపుణ్యాలు ప్రదర్శించింది. ప్రత్యర్థికి మించి ఎత్తులు వేయడంతో దూకుడుతో సాగింది. 47 ఎత్తుల్లో గేమ్ ముగించింది. దీంతో తన స్కోరు 8.5కు చేరింది. మరోవైపు టింజీతో గేమ్‌ను డ్రా చేసుకున్న అనస్తాసియా బొద్నారుక్ (రష్యా) కూడా 8.5 పాయింట్లతో నిలిచింది.
దీంతో హంపి, అనస్తాసియాలో విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ నిర్వహించారు. ఇందులో తొలి గేమ్‌లో హంపి గెలిచింది. రెండో గేమ్‌లో అనస్తేషియా విజయం సాధించింది. మూడో గేమ్ డ్రాగా ముగియడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. చివరకు నాలుగో గేమ్‌లో హంపి నెగ్గలేకపోయింది. దీంతో టైబ్రేక్‌లో 1.5-2.5తో ఓడి, టైటిల్ కోల్పోవాల్సి వచ్చింది.