ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అమిత్ పంగాల్ చరిత్ర సృష్టించే అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకున్నాడు. రష్యాలోని ఎక్తెరిన్బర్గ్ వేదికగా జరుగుతున్న ఈ మెగాటోర్నీలో వెండి పతకంతోనే సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన 52 కేజీల విభాగం ఫైనల్స్‌లో షాఖోబిదిన్ జొయిరోవ్(ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓటమిపాలయ్యాడు. ఈ ప్రపంచ వేదికపై వెండి గెలిచిన తొలి భారతీయ బాక్సర్‌గా ఘనత సాధించాడు.
తొలిసారి వెండి పతకం...
బాక్సింగ్‌లో పంగాల్ స్వల్ప కాలంలోనే అద్భుతమైన ప్రగతి సాధించాడు. 2017 ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో 47 కిలోల విభాగంలో కాంస్యం కైవసం చేసుకున్నాడు. అదే ఏడాది జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అరంగేట్రం చేసి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. 2018 ఆసియా క్రీడలు, బల్గేరియాలో జరిగిన స్ట్రాండ్ మెమోరియల్ పోటీల్లో వరుసగా స్వర్ణాలు అందుకున్నాడు. 2020 ఒలింపిక్స్‌లో 49 కిలోల విభాగం రద్దు చేయడం వల్ల 52 కిలోలకు మారాడు.
ప్రపంచ పోటీల్లో భారత్ కాంస్యం కన్నా మెరుగైన పతకం ఇప్పటి వరకు గెలవలేదు.విజేందర్ సింగ్ (2009), వికాస్ కృష్ణన్ (2011), శివ థాప (2015), గౌరవ్ బిధూరి (2017) కాంస్యాలు గెలిచారు.