భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజు- చిరాగ్ శెట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గి.. అంతకుముందు థామస్ కప్‌లో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన సాత్విక్- చిరాగ్ జోడీ మరో ఘనత అందుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం చేసుకుని ఈ ఘనత సాధించిన తొలి భారత పురుషుల జోడీగా రికార్డు నెలకొల్పింది. క్వార్టర్‌ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్- చిరాగ్ జోడీ 24-22, 15-21, 21-14తో ప్రపంచ మాజీ ఛాంపియన్స్, రెండో ర్యాంకర్ తకురొ హొకి- యుగొ కొబయాషి (జపాన్) జంటపై జయభేరి మోగించింది. ప్రతిష్టాత్మక టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. మరో క్వార్టర్స్‌లో అర్జున్- ధ్రువ్ జోడీ 8-21, 14-21తో మూడో సీడ్ మహ్మద్ ఎహసాన్- హెండ్ర సెతియవన్ (ఇండోనేసియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది. అగ్రశ్రేణి ఆటగాడు హెచ్.ఎస్.ప్రణయ్‌కూ చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ప్రణయ్ 21-19, 6-21, 18-21తో జున్ పెంగ్ (చైనా) చేతిలో ఓడాడు. రెండో రౌండ్లో కిదాంబి శ్రీకాంత్‌ను ఓడించిన పెంగ్.. క్వార్టర్స్‌లో ప్రణయ్‌నూ నిలువరించి భారత ఆటగాడికి పతకం దూరం చేశాడు. ఇక ప్రపంచ ఛాంపియన్‌షిప్ డబుల్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం. పురుషుల విభాగంలో మొదటిది. 2011లో గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప జోడీ కాంస్య పతకం సాధించింది. మొత్తంగా ఇది 13వ పతకం. 1983లో దిగ్గజ ఆటగాడు ప్రకాశ్ పదుకొణె కాంస్యం నెగ్గాడు. స్టార్ షట్లర్ పి.వి.సింధు అత్యధికంగా అయిదు పతకాలు గెలుచుకుంది. 2013, 2014లలో రెండు కాంస్యాలు.. 2017, 2018లలో 2 రజతాలు.. 2019లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది. మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 2015లో రజతం, 2017లో కాంస్య పతకాలు గెలుచుకుంది. 2019లో భమిడిపాటి సాయి ప్రణీత్ కాంస్యం, 2021లో కిదాంబి శ్రీకాంత్ రజతం.. లక్ష్యసేన్ కాంస్య పతకాలు సాధించారు.
బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన భారత్ - ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజు చిరాగ్‌శెట్టి చరిత్ర సృష్టించారు. సెమీ ఫైనల్స్‌కి చేరి పతకం ఖాయం చేసుకున్నారు.
ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సాత్విక్- చిరాగ్ జోడీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ జోరు కొనసాగిస్తోంది. ఒక గంటా 15 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన సమరంలో భారత జోడీ అత్యుత్తమ ఆటతీరుతో ప్రత్యర్థి జంటను చిత్తుచేసింది. తకురొ- కొబయాషి జోడీపై తన గెలుపోటముల రికార్డును 2-1తో మరింత మెరుగుపరుచుకుంది. మ్యాచ్‌లో మొదటి గేమ్ హైలైట్. ఆఖరి పాయింటు వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరాటం అభిమానుల్ని మునివేళ్లపై నిలబెట్టింది. రెట్టించిన దూకుడుతో గేమ్‌ను మొదలుపెట్టిన సాత్విక్- చిరాగ్ జోడీ ఆరంభం నుంచే ప్రత్యర్థి జంటపై ఆధిపత్యం కనబరిచింది. 3-0తో ఆటను ఆరంభించి 12-5తో ముందంజ వేసింది. 14-9తో గేమ్ దిశగా పయనిస్తుండగా.. ప్రత్యర్థి జంట ఒక్కసారిగా పుంజకుంది. వరుసగా 7 పాయింట్లు నెగ్గి 16-14తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో ఒత్తిడిని అధిగమించిన సాత్విక్- చిరాగ్ జోడీ వరుసగా రెండు పాయింట్లు గెలిచి 16-16తో స్కోరును సమం చేసింది. ఇరుజోడీలు ఒక్కో పాయింటు నెగ్గడంతో 17-17తో స్కోరు మళ్లీ సమమైంది. ఈ దశలో సాత్విక్- చిరాగ్ జోడీ రెండు పాయింట్లు సాధించి 19-17తో ముందంజ వేసింది. జపాన్ జోడీ మరోసారి చెలరేగి 3 పాయింట్లు గెలిచి 20-17తో ఆధిక్యం సంపాదించింది. మరొక్క పాయింటు గెలిస్తే వాళ్లదే గేమ్. సాత్విక్- చిరాగ్ జోడీ ఒక్క పాయింటు నెగ్గడంతో స్కోరు 20-20తో సమమైంది. అక్కడ్నుంచి రెండు జోడీలు ఒక్కో పాయింటు రాబడుతూ గేమ్‌ను ఉత్కంఠభరితంగా మార్చేశాయి. 22-22తో ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. అందరూ మునివేళ్లపైనే. తీవ్ర ఒత్తిడి నడుమ సాత్విక్- చిరాగ్ జోడీ వరుసగా రెండు పాయింట్లతో ఉత్కంఠకు తెరదించింది. 24-22తో తొలి గేమ్ సొంతం చేసుకుంది. రెండో గేమ్ 9-9 పాయింట్ల వరకు హోరాహోరీగా సాగింది. అక్కడ్నుంచి ప్రత్యర్థి జోడీ వైపు లయ మళ్లింది. వరుసగా పాయింట్లు రాబట్టిన జపాన్ జోడీ 21-15తో రెండో గేమ్ నెగ్గింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆద్యంతం భారత జోడీదే ఆధిపత్యం. 11-5తో ఆధిక్యం సంపాదించిన సాత్విక్- చిరాగ్ జోడీ 20-14తో మరింత ముందుకెళ్లింది. కొబయాషి షటిల్‌ను నెట్‌కు ఆడటంతో సాత్విక్- చిరాగ్ జోడీ సంబరాలు అంబరాన్ని తాకాయి. కేరింతలు, విజయ నాదాలతో బ్యాడ్మింటన్ కోర్టు హోరెత్తింది. శనివారం జరిగే సెమీఫైనల్లో ఆరో ర్యాంకర్ వూయ్ యిక్- ఆరోన్ చియా (మలేసియా) జోడీతో సాత్విక్- చిరాగ్ జంట తలపడనుంది. ఈ జోడీలు ఇప్పటి వరకు 5 సార్లు తలపడగా.. అయిదింట్లోనూ ప్రత్యర్థి జంటదే పైచేయి అయింది.
ఇదీ చూడండి: Asia cup ఏ జట్టు ఎన్ని విజయాలు సాధించిందంటే