తెలంగాణ

telangana

ETV Bharat / sports

నేటి నుంచే ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌, సవాల్‌కు సై - ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌

కామన్వెల్త్‌ క్రీడల్లో అదిరే ప్రదర్శనతో జోరు మీదున్న భారత షట్లర్లు.. మరో ప్రతిష్ఠాత్మక సమరానికి సిద్ధమయ్యారు. అత్యుత్తమ ప్లేయర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉండే ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌ సవాలుకు సై అంటున్నారు. సోమవారమే ఈ మెగా టోర్నీకి తెరలేస్తుంది. గాయంతో సింధు దూరమవడం దెబ్బే. మరి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌, ప్రణయ్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి.

world badminton championship 2022
world badminton championship 2022

By

Published : Aug 22, 2022, 7:14 AM IST

గతేడాది ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించిన జపాన్‌ రాజధానిలో మళ్లీ క్రీడా సందడి నెలకొంది. అక్కడ నేడు ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌ ఆరంభమవుతుంది. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకూ భారత ప్రదర్శన మెరుగ్గానే ఉంది. 2011 నుంచి ఈ టోర్నీలో ప్రతిసారి దేశానికి కనీసం ఒక్క పతకమైనా దక్కింది. ఈ సారి కూడా అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో భారత షట్లర్లు ఉన్నారు. కానీ 2019లో స్వర్ణం సహా ఈ టోర్నీ చరిత్రలో మొత్తం అయిదు పతకాలు గెలిచిన పీవీ సింధు పోటీలకు దూరమవడం లోటే. కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి నెగ్గే క్రమంలో ఆమె చీలమండకు గాయమైంది. దీంతో ఆమె దశాబ్ద కాలంలో తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ నుంచి తప్పుకుంది.

ఇప్పుడందరి దృష్టి ప్రధానంగా లక్ష్యసేన్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, కిదాంబి శ్రీకాంత్‌పైనే ఉంది. ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్న ఈ ముగ్గురిపై భారీ అంచనాలున్నాయి. గతేడాది వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచిన శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ మరోసారి పోడియంపై నిలబడాలనే ధ్యేయంతో ఉన్నారు. కానీ ఈ సారి వాళ్లకు అసలైన సవాలు తప్పదు. మరోవైపు ఈ ముగ్గురూ ఒకే పార్శ్వంలో ఉండడం మరో ప్రతికూలత. నిరుడు టోర్నీకి దూరంగా ఉన్న కెంటో మొమొటా, జొనాథన్‌ క్రిస్టీ, ఆంథోనీ ఇప్పుడు పోటీలో దిగుతున్నారు. కామన్వెల్త్‌ క్రీడల అరంగేట్రంలో స్వర్ణంతో దూకుడు మీదున్న 20 ఏళ్ల తొమ్మిదో సీడ్‌ లక్ష్యసేన్‌.. మూడో రౌండ్లో ప్రణయ్‌తో తలపడే అవకాశం ఉంది. ప్రణయ్‌కు రెండో రౌండ్లో మాజీ నంబర్‌వన్‌ మొమొటా ఎదురవొచ్చు. కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం నెగ్గిన 12వ సీడ్‌ శ్రీకాంత్‌ ఈ టోర్నీలో ఆరంభ సవాళ్లను అధిగమిస్తే క్వార్టర్స్‌కు ముందు ప్రపంచ అయిదో ర్యాంకర్‌ లీ జీ రూపంలో అతనికి ప్రమాదం పొంచి ఉంది. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ కాంస్య విజేత సాయి ప్రణీత్‌ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. గాయాలతో, ఫామ్‌ లేమితో సతమతమవుతున్న సైనా నెహ్వాల్‌ మహిళల సింగిల్స్‌ బరిలో ఉంది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఒక్కో రజతం, కాంస్యం నెగ్గిన ఆమె ప్రస్తుత ఆటతీరు మునుపటిలా లేదు. సింగపూర్‌ ఓపెన్‌లో బింగ్జియావోకు షాకిచ్చి 16 నెలల్లో తొలిసారి ఓ టోర్నీలో క్వార్టర్స్‌ చేరిన ఆమె.. ఇప్పుడీ పోటీల్లోనూ ఉత్తమ ప్రదర్శన చేస్తుందేమో చూడాలి. చెంగ్‌ న్యాన్‌తో పోరుతో ఆమె టోర్నీ మొదలెడుతుంది. మాళవిక కూడా సింగిల్స్‌లో ఆడుతుంది.

చరిత్ర సృష్టిస్తారా?: కామన్వెల్త్‌ క్రీడల పురుషుల డబుల్స్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించి రికార్డు నెలకొల్పిన సాత్విక్‌- చిరాగ్‌ జోడీ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లోనూ చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో ఉంది. ఈ సీజన్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఈ జంట ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌లో దేశానికి తొలి పతకం అందిస్తుందేమో చూడాలి. ఈ ప్రపంచ ఏడో ర్యాంకర్‌ ద్వయానికి తొలి రౌండ్లో బై లభించింది. రెండో రౌండ్లో 13వ సీడ్‌ షెమ్‌- కియాంగ్‌తో వీళ్లు తలపడే అవకాశం ఉంది. సంచలన ఆటతీరుతో విజయాలు సాధించడం అలవాటు చేసుకున్న ఈ భారత జోడీ.. మరోసారి అదరగొడితే పతకం నెగ్గడం ఖాయమే. వీళ్లతో పాటు పురుషుల డబుల్స్‌లో మను అత్రి- సుమీత్‌ రెడ్డి, అర్జున్‌- ధ్రువ్‌, కృష్ణ ప్రసాద్‌- విష్ణువర్ధన్‌ కూడా పోటీలో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో అశ్విని- సిక్కిరెడ్డి, గాయత్రి- ట్రీసా జాలీ, పూజ- సంజన, అశ్విని భట్‌- శిఖా గౌతమ్‌ జోడీలు బరిలో దిగుతున్నాయి. కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం గెలిచిన గాయత్రి- ట్రీసా జంట ఈ టోర్నీలో ఒత్తిడి తట్టుకుని ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్నది ఆసక్తికరం. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఇషాన్‌- తనీష, వెంకట్‌- జూహీ జంటలు పోటీకి సై అంటున్నాయి.

12 ఈ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌ ఇప్పటివరకూ గెలిచిన పతకాలు. అత్యధికంగా సింధు అయిదు పతకాలు సాధించింది. సైనా రెండు పతకాలు దక్కించుకుంది. ప్రకాశ్‌ పదుకొనే, సాయి ప్రణీత్‌, శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌, జ్వాలా గుత్తా- అశ్విని పొన్నప్ప ఒక్కో పతకాన్ని ఖాతాలో వేసుకున్నారు.

ఇవీ చదవండి:సింధుకు ఆ వ్యక్తి బెదిరింపు లేఖ, కిడ్నాప్​ చేస్తానంటూ

రాహుల్​ ఫామ్​పై ఆందోళన అవసరం లేదు, ఒక్క ఇన్నింగ్స్ చాలు

ABOUT THE AUTHOR

...view details