తెలంగాణ

telangana

ETV Bharat / sports

టోక్యో ఒలింపిక్స్​ వాయిదా.. సెప్టెంబర్​ లేదా అక్టోబర్​లో!

ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్​, కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్నే ప్రపంచ అథ్లెటిక్స్​ సంఘం అధ్యక్షుడు సెబాస్టియన్​ పరోక్షంగా వెల్లడించాడు. జపాన్​ ప్రభుత్వం మాత్రం షెడ్యూల్​ ప్రకారమే మెగా ఈవెంట్​ను నిర్వహిస్తామని ఇటీవలే స్పష్టం చేసింది.

World Athletics Chief Lord Sebastian Said 2020 Olympics be Changed Due to Corona Virus Pandemic!
టోక్యో ఒలింపిక్స్​ వాయిదా.. సెప్టెంబర్​ లేదా అక్టోబర్​లో!

By

Published : Mar 21, 2020, 6:26 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్రీడలన్నీ వాయిదా పడుతుంటే... ఒలింపిక్స్​ సన్నాహాల్లో ఉన్న ఆటగాళ్లు మాత్రం సందిగ్ధంలో ఉన్నారు. ఓవైపు దేశాలన్నీ కొన్ని రోజులు షట్​డౌన్​ ప్రకటిస్తుండగా, జపాన్​ మాత్రం షెడ్యూల్​ ప్రకారమే (జులై 24 నుంచి ఆగస్టు 9) ఈ మెగా ఈవెంట్​ను నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ​ అథ్లెటిక్స్​ ఫెడరేషన్​(ఐఏఏఎఫ్​) అధ్యక్షుడు లార్డ్​ సెబాస్టియన్​ కో.. పరోక్షంగా చేసిన ఓ సూచన చర్చనీయాంశమైంది. ఒలింపిక్స్​ తేదీలు మారే అవకాశముందని ఇందులో చెప్పడం సంచలనంగా మారింది. ఓ ప్రముఖ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ప్రపంచ అథ్లెటిక్స్​ చీఫ్​ లార్డ్​ సెబాస్టియన్​ కో

ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా తప్ప, ఒలింపిక్స్ నిర్వహకుల చేతుల్లో మరో అవకాశం లేదని సెబాస్టియన్ చెప్పినట్లు తెలుస్తోంది​. వీలైతే సెప్టెంబర్​ లేదా అక్టోబర్​లో ఈ పోటీలు జరగొచ్చని అభిప్రాయపడ్డాడట. అయితే తుది నిర్ణయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని, అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలని అన్నారని సమాచారం. 2012 లండన్​ ఒలింపిక్స్ ఆర్గనైజింగ్​ కమిటీకి ఇతడు ఛైర్మన్​గానూ పనిచేశాడు.

టోక్యో ఒలింపిక్స్​ వేదిక

అథ్లెట్ల నుంచి నిరసన

ఒలింపిక్స్​ నిర్వహిస్తామని ఐఓసీ, టోక్యో ప్రభుత్వం ప్రకటిస్తుంటే.. ఆ నిర్ణయాలపై కొంతమంది టాప్​ అథ్లెట్లు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఒలింపిక్స్​ ఛాంపియన్​ కేథరినా స్టెఫానిడీ.. అథ్లెట్ల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

కరోనా నేపథ్యంలో క్రీడా సంబరంపై కీలక నిర్ణయం తీసుకోవాలని ఆయా దేశాల నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి. శుక్రవారం.. రోమ్​ వేదికగా అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ సమావేశం జరిగింది. దాదాపు 100 మంది అధికారులు హాజరయ్యారు. ఈ వేదికపై ఇటలీకి చెందిన ఒలింపిక్​ పసిడి పతక విజేత సోఫియా, మిచెల్.. కరోనా వల్ల తమ దేశంలోని ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలో వీరంతా కలిసి ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.

కరోనా దెబ్బకు బోసిపోయిన టోక్యోలోని ఓ ప్రాంతం

ఈ మెగాఈవెంట్​ కోసం జపాన్ దాదాపు లక్షల కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. అనుకున్న సమయంలో టోర్నీ నిర్వహించకపోతే అది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో ఐఓసీ అధికారులు, టోక్యో నిర్వాహకులు కచ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.

జపాన్​లోనూ కొవిడ్​-19 ప్రభావం ఎక్కువగానే ఉంది. మొత్తం 1007 కేసులు నమోదవగా, ఇందులో 35 మంది మరణించారు. ఇటీవలే జపాన్​ ఒలింపిక్​ కమిటీ ఉపాధ్యక్షుడు కోజో తాషిమా ఈ వైరస్​ బారిన పడటం చర్చనీయాంశమైంది.

ABOUT THE AUTHOR

...view details