World athletics championships 2022: భారత లాంగ్‌జంప్ స్టార్ మురళీ శ్రీశంకర్ సత్తా చాటాడు. అద్భుత ప్రదర్శన చేస్తూ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అర్హత రౌండ్లో 8 మీటర్లు (రెండో ప్రయత్నం) దూకిన 23 ఏళ్ల మురళీ గ్రూప్-బిలో రెండో స్థానం.. మొత్తం మీద ఏడో స్థానంతో ముందంజ వేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో లాంగ్‌జంప్‌లో పురుషుల విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారత అథ్లెట్‌గా శ్రీశంకర్ ఘనత సాధించాడు. ఈ గ్రూప్‌లో ఒలింపిక్ ఛాంపియన్ మిల్టియాడిస్ (8.03 మీ, గ్రీస్) అగ్రస్థానంలో నిలిచాడు. మిల్టియాడిస్, శ్రీశంకర్ మాత్రమే ఈ గ్రూపులో 8 మీటర్లపైన దూకారు. ఈ ఏప్రిల్‌లో ఫెడరేషన్ కప్‌లో 8.36 మీటర్లు దూకిన శ్రీశంకర్.. ఫైనల్లో ఆ స్థాయి ప్రదర్శన చేసినా పతకం ఆశించొచ్చు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌కు లభించిన ఏకైక పతకం లాంగ్‌జంప్‌లోనే రావడం విశేషం. 2003లో అంజుబాబి జార్జి కాంస్యం నెగ్గింది. మరోవైపు లాంగ్‌జంప్‌లో పోటీపడిన భారత ఇతర అథ్లెట్లు జెస్విన్ అల్డ్రిన్, మహ్మద్ అనీస్ అర్హత రౌండ్లోనే నిష్క్రమించారు. గ్రూప్-ఏలో పోటీపడిన జెస్విన్ (7.79 మీ) ఏడో స్థానం, అనీస్ (7.73 మీ) పదకొండో స్థానంలో నిలిచారు. పురుషుల 3 వేల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్ సాబ్లే ఫైనల్ చేరాడు. హీట్స్-3లో పోటీపడిన అతడు 8 నిమిషాల 18.75 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంతో ముందంజ వేశాడు.
నిరాశపరిచిన ప్రియాంక, సందీప్:20 మీటర్ల నడకలో జాతీయ రికార్డు కలిగి ఉన్న ప్రియాంక గోస్వామి, సందీప్ కుమార్ నిరాశపరిచారు. మహిళల విభాగంలో ప్రియాంక.. 1 గంట 39 నిమిషాల 42 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 36 మంది పోటీపడిన రేసులో 34వ స్థానంలో నిలిచింది. పురుషుల్లో సందీప్ కుమార్ ఇంకా దారుణమైన ప్రదర్శన చేశాడు. గంటా 31 నిమిషాల 58 సెకన్లలో ఫినిషింగ్ లైన్ చేరిన అతడు 43 మంది అథ్లెట్లు పోటీపడిన రేసులో 40వ స్థానంలో నిలిచాడు. షాట్‌పుట్ స్టార్ తజిందర్‌పాల్ తూర్ పోటీకి దిగకుండానే గజ్జల్లో గాయంతో తప్పుకున్నాడు. నాలుగు రోజుల క్రితమే అతడికి ఈ గాయం కాగా.. నొప్పి తగ్గకపోవడంతో పోటీ నుంచి విరమించాడు. ఈ నెల 28న ఆరంభమయ్యే కామన్వెల్త్ క్రీడలకు కూడా అతడు దూరమయ్యాడు.
పతకంతో గుడ్‌బై
Allyson felix:అమెరికా దిగ్గజ అథ్లెట్ అలిసన్ ఫెలిక్స్ తన ఉజ్వల కెరీర్‌కు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకంతో వీడ్కోలు పలికింది. 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో కాంస్యం గెలిచిన అమెరికా జట్టులో 36 ఏళ్ల ఫెలిక్స్ సభ్యురాలిగా ఉంది. ఫైనల్లో ఫెలిక్స్, గాడ్‌విన్, నార్‌వుడ్, సిమోన్‌లతో కూడిన అమెరికా బృందం 3 నిమిషాల 10.16 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ రేసులో గాడ్‌విన్ నుంచి బ్యాటన్ అందుకుని రెండో లెగ్‌లో తన శైలిలో దూసుకుపోయింది ఫెలిక్స్. అప్పుడు అమెరికా పసిడి రేసులో ఉంది. కానీ ఆఖరి లెగ్‌లో సహచర అథ్లెట్ తడబడడంతో అలిసన్ కాంస్యంతో సంతృప్తి పడింది. అమ్మ అయిన తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన ఫెలిక్స్.. తన కెరీర్‌లో చివరి రేసులోనూ సత్తా చాటి పోడియంపై నిలిచింది. ప్రపంచ అథ్లెటిక్స్‌లో ఫెలిక్స్‌కు ఇది 19వ పతకం. వీటిలో 13 స్వర్ణ పతకాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. ఆమె ఖాతాలో రికార్డు స్థాయిలో 11 ఒలింపిక్స్ పతకాలు (7 స్వర్ణ, 3 రజత, 1 కాంస్యం) ఉన్నాయి.