తెలంగాణ

telangana

ETV Bharat / sports

అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​లో టాప్​ లేపిన అమెరికా - ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్

ఖతార్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​లో అమెరికా.. పతాకాల పట్టికలో తొలిస్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో భారత అథ్లెట్లు నిరాశపరిచారు.

అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​లో టాప్​ లేపిన అమెరికా

By

Published : Oct 7, 2019, 8:06 AM IST

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో అమెరికా అదరగొట్టింది. 14 స్వర్ణాలు సహా మొత్తం 29 పతకాలతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. 5 స్వర్ణాలు సహా 11 పతకాలతో కెన్యా రెండులో.. 3 పసిడి పతకాలతో జమైకా మూడో స్థానంలో నిలిచింది. పోటీల ఆఖరి రోజైన శనివారం.. 4×400 మీటర్ల పురుషులు, మహిళల రిలే పోటీలో అమెరికా జట్లే విజేతలుగా నిలిచాయి. 4×100మీటర్ల రిలేలో అమెరికా ఎట్టకేలకు స్వర్ణం గెలుచుకోవడం విశేషం.

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్​ పతకాల పట్టిక

శనివారం జరిగిన ఈ పోటీలో గాట్లిన్‌, 100మీ ఛాంపియన్‌ కోల్‌మన్‌, 200మీ విజేత నోవా లైల్స్‌, మిచెల్‌ రోజర్స్‌తో కూడిన బృందం 37.10 సెకన్లలో లక్ష్యాన్ని అందుకుంది. రిలే చరిత్రలో ఇది రెండో అత్యుత్తమ టైమింగ్‌ కావడం విశేషం. ప్రపంచ అథ్లెటిక్స్‌లో అమెరికా చివరగా 2007లో పసిడి నెగ్గింది. ఆ తర్వాత ఉసేన్‌ బోల్ట్‌ హవా మొదలయ్యాక.. అమెరికాకు సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదు. 37 ఏళ్ల గాట్లిన్‌కు ఇదే తొలి రిలే స్వర్ణం.

ఇథియోపియా రన్నర్‌ డెసిసా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పురుషుల మారథాన్‌ స్వర్ణం గెలుచుకున్నాడు. 2 గంటల 10 నిమిషాల 40 సెకన్లలో అతడు లక్ష్యాన్ని పూర్తి చేశాడు. 2001 తర్వాత ఓ ఇథియోపియా అథ్లెట్‌ మారథాన్‌ పసిడి నెగ్గడం ఇదే తొలిసారి. ఆ దేశానికే చెందిన మోసినెట్‌ జెరెమీ రజతం (2 గంటల 10.44ని 44సె) సాధించాడు. అమెరికా అథ్లెట్‌ నియా లీ మహిళల 100మీ హర్డిల్స్‌ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. 12.34 సెకన్లలో ఆమె లక్ష్యాన్ని అందుకుంది.

సిఫాన్‌కు డబుల్‌
ఒకే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో 1500మీ, 10,000మీ టైటిళ్లు గెలిచిన తొలి మహిళా అథ్లెట్‌గా సిఫాన్‌ హసన్‌(నెదర్లాండ్స్‌) ఘనత సాధించింది.

భారత్‌ రిక్తహస్తాలతో..
భారత జట్టు ఖాళీ చేతులతో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ను ముగించింది. ఆదివారం పురుషుల మారథాన్‌లో ఆసియా ఛాంపియన్‌ గోపి తొనకల్‌ 21వ స్థానంలో నిలిచాడు. 27 మంది సభ్యుల భారత జట్టు పతకం గెలవలగలదని ఎవరూ అనుకోలేదు. అయితే మన జట్టు కాస్త మెరుగైన ప్రదర్శనే చేసింది. మూడు విభాగాల్లో మిక్స్‌డ్‌ 4×400మీ, పురుషుల 3000మీ స్టీపుల్‌ చేజ్‌, మహిళల జావెలిన్‌ త్రోలో ఫైనల్‌ చేరుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ చరిత్రలో భారత్‌ ఒకే ఒక్క పతకం గెలిచింది. 2003లో లాంగ్‌ జంపర్‌ అంజు బాబి జార్జ్‌ కాంస్యం సాధించింది.

ABOUT THE AUTHOR

...view details