ప్రపంచ యూత్ ఆర్చరీ టోర్నమెంట్లో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ సత్తా చాటాడు. రికర్వ్ జూనియర్ బాలుర టీమ్ విభాగంలో అతడు పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ధీరజ్, ఆదిత్య చౌదరి, పార్థ్ సాలుంకెలతో కూడిన భారత బృందం 5-3తో స్పెయిన్ (సాంజెస్, సొలెరా, సాంటోస్)లపై విజయం సాధించింది. ధీరజ్.. విజయవాడకు చెందిన వోల్గా అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. రికర్వ్ పురుషుల టీమ్, అండర్-18 మిక్స్‌డ్ జట్టు, జూనియర్ మహిళలు, జూనియర్ మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో కూడా స్వర్ణ పతకాలు మన సొంతమయ్యాయి. బిశాల్ తంగ్‌మయ్ ఒక్కడే రెండు స్వర్ణాలతో సహా మూడు పతకాలు సాధించడం విశేషం. అండర్-18 పురుషుల టీమ్ ఫైనల్లో బిశాల్ చంగ్‌మయ్, విక్కీ రుహాల్, అమిత్ కుమార్‌లతో కూడిన భారత బృందం 4-2తో ఫ్రాన్స్‌ను ఓడించి స్వర్ణం గెలవగా.. మిక్స్‌డ్ విభాగం తుది సమరంలో బిశాల్-తమన్నా జోడీ.. 4-2తో యెహటా-మివా (జపాన్)ను ఓడించింది.
ప్రపంచ యూత్ ఆర్చరీ టోర్నమెంట్లో మెరిసిన తెలుగు తేజం - అండర్ 18 ఆర్చరీ
ప్రపంచ యూత్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత జట్టు సత్తా చాటింది. మొత్తం 15 పతాలను గెలుచుకోగా అందులో 8 స్వర్ణాలను చేజిక్కించుకుంది. ఈ విజేతల్లో తెలుగు కుర్రాడు ధీరజ్ కూడా ఉన్నాడు. రికర్వ్ జూనియర్ టీమ్‌లో అతను పసిడి గెలుచుకున్నాడు.
రికర్వ్ జూనియర్ మహిళల ఫైనల్లో కోమలిక బారి 7-3తో ఎలీనా కానెల్స్ (స్పెయిన్)పై నెగ్గగా.. జూనియర్ మిక్స్‌డ్ తుది పోరులో పార్థ్ సాలుంకె-కోమలిక జంట 5-3తో కానెల్స్-సాంజెస్ (స్పెయిన్)ను ఓడించింది. మహిళల క్యాడెట్ టీమ్ విభాగంలో భారత్ కాంస్యం నెగ్గింది. కంచు పోరులో భారత్ (మంజరి అలోన్, అవని, తమన్నా).. జర్మనీపై నెగ్గింది. ఈ పోరులో రెండు జట్లు చెరో మూడు సెట్లు గెలుచుకుని సమానంగా నిలవగా.. 54-51తో ఏడో సెట్‌ను సొంతం చేసుకున్న భారత్ విజేతగా నిలిచింది. అండర్-18 మహిళల సింగిల్స్‌లో మంజరి అలోన్ కాంస్యం గెలిచింది. కంచు కోసం జరిగిన పోరులో మంజరి షుటాఫ్‌లో 25-22తో రోఫెన్‌ను ఓడించింది. పురుషుల కాంస్య పతక పోరులో బిశాల్ చంగ్‌మయ్ 5-3తో జాంగ్‌బే (కజకిస్థాన్)పై విజయం సాధించాడు. అయితే అండర్-21 రికర్వ్ మహిళల టీమ్ విభాగంలో భారత జట్టు పతకం సాధించడంలో విఫలమైంది. భారత జట్టు 1-5తో ఉక్రెయిన్ చేతిలో ఓడింది. కాంపౌండ్ విభాగంలో పురుషులు, మహిళలు, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో భారత్ స్వర్ణాలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి :Kohli Dance: కెప్టెన్ కోహ్లీ 'నాగిని' డ్యాన్స్!