World Archery Championships : వరల్డ్ ఆర్చరీఛాంపియన్ షిప్‌లో భారత్ తొలి స్వర్ణ పతకం సాధించింది. బెర్లిన్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో భారత ప్లేయర్లు జ్యోతి సురేఖ, ప్రణీత్ కౌర్, అదితి గోపీచంద్.. మహిళల కాంపౌండ్ విభాగంలో బంగారు పతకాన్ని ముద్దాడారు. ఈ ముగ్గురు పోటీల్లో ఎదురైన ప్రత్యర్థులను ఓడిస్తూ.. ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఫైనల్స్‌లో మెక్సికోకు చెందిన డఫ్నే క్విన్‌టెరో, అనా సోఫా హెర్నాండెజ్, అండ్రే బెసెర్రాతో భారత త్రయం తలపడింది. తుదిపోరులోనూ జోరు ప్రదర్శిస్తూ.. రెండో సీడ్ భారత జట్టు 235-229 తేడాతో టాప్ సీడ్ మెక్సికోపై గెలిచి జయకేతనం ఎగురవేసింది.
కాగా ఫైనల్స్‌లో పటిష్ఠమైన మెక్సికో ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చలాయించారు భారత క్రీడాకారిణులు. మొదటి రౌండ్లో 60కి 59 స్కోర్‌తో తుదిపోరును ఘనంగా ఆరంభించారు. ఈ రౌండ్లో మెక్సికో జట్టు 57 పాయింట్లు సాధించింది. ఇక వరుసగా రెండు, మూడు రౌండ్లలోనూ 59 పాయింట్లు సాధించి.. ఆఖరి రౌండ్‌కు ముందు 177-172తో భారత ప్లేయర్లు లీడ్‌లో ఉన్నారు.
ఇక చివరి రౌండ్.. ఆఖరి సెట్లో 207 - 199 ఉన్న దశలో ప్రత్యర్థి ప్లేయర్లు 30 పాయింట్లు సాధించి 229 వద్ద నిలిచారు. ఆ దశలో భారత త్రయంలో మొదట పర్ణీత్ 10 పాయింట్లు గెలిచింది. తర్వాత అదితి 9 పాయింట్లు సాధించింది. విజయానికి మరో ఐదు పాయింట్లు అవసరమైన దశలో సురేఖ.. విల్లు ఎక్కుపెట్టి 9 పాయింట్లు నెగ్గి.. భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపింది.