తెలంగాణ

telangana

ETV Bharat / sports

జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌గా నిఖత్‌

Boxing champion Nikhat
జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌గా నిఖత్‌

By

Published : Dec 26, 2022, 12:39 PM IST

Updated : Dec 27, 2022, 9:59 AM IST

12:35 December 26

Boxing champion Nikhat

భారత బాక్సింగ్‌ యువ సంచలనం.. తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ 2022వ ఏడాదిని ఘనంగా ముగించి.. మరోసారి తానేంటో నిరూపించింది. ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఈమె.. జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మరో ముందడుగు వేసి అదరగొట్టింది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ వేదికగా జరిగిన ఫైనల్లో అద్భుత విజయం సాధించింది మరో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ తుదిపోరులో తన ప్రత్యర్థి రైల్వేస్​కు చెందిన అనామికను మట్టి కరిపించింది. ఫలితంగా 4-1 తేడాతో విజయం సాధించి జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్​ను కైవసం చేసుకుంది. దీంతో ఆమెపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఏ మాత్రం అవకాశం ఇవ్వలే.. ఈ ఫైనల్​లో 50 కేజీల విభాగంలో పోటీ పడిన నిఖత్‌ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. స్వర్ణం మీద తన పేరే రాసిపెట్టినట్లు.. ఓటమిని అంగీకరించేదే లేదన్నట్లు మెరుపు పంచ్‌లతో అనామికపై విరుచుకుపడింది. ఆరంభం నుంచే దూకుడుగా బాక్సింగ్‌ చేసింది. దీంతో అనామిక ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఒక బౌట్‌ను గెలిచినప్పటికీ అనామికకు నిఖత్‌ చేతిలో ఓటమి తప్పలేదు. ఐదు రౌండ్లలో కేవలం చివరిదాంట్లో మాత్రమే జరీన్ కంటే అనామిక ఎక్కువ పాయింట్లను దక్కించుకోగలిగింది.

సెమీఫైనల్​లో సూపర్​.. అంతకుముందు సెమీఫైనల్​ 50 కేజీల విభాగంలో ఏఐపీకు చెందిన శివిందర్ కౌర్​ను చిత్తు చేసిన నిఖత్​.. ఈ పోరులో 5-0 తేడాతో విజయం సాధించింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఈమె.. ఈ బౌట్లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చలాయించి.. ఫైనల్​కు అర్హత సాధించింది.

వీళ్లకి స్వర్ణాలే..ఇక ఇదే టోర్నీ ఫైనల్​లో టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్‌ అంచనాలకు తగ్గట్లుగా రాణించి బంగారు పతకంతో మెరిసింది. 75 కేజీల ఫైనల్లో లవ్లీనా 5-0తో అరుంధతి చౌదరి (ఎస్‌ఎస్‌సీబీ)పై గెలుపొందింది. 48 కేజీల ఫైనల్లో మంజు రాణి (ఆర్‌ఎస్‌పీబీ) 5-0తో కలైవాణి (తమిళనాడు)పై నెగ్గి స్వర్ణం సాధించింది. రైల్వేస్‌కే చెందిన శిక్ష (54 కేజీలు), పూనమ్‌ (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు), నుపుర్‌ (ప్లస్‌ 81 కేజీలు) బంగారు పతకాలతో సత్తాచాటారు. 70 కేజీల ఫైనల్లో సనామచ తోక్‌చోమ్‌ చాను (మణిపూర్‌) 3-2తో శ్రుతి యాదవ్‌ (మధ్యప్రదేశ్‌)పై విజయం సాధించింది. మనీషా (57 కేజీలు- హరియాణా), సవీటీ (81 కేజీలు- హరియాణా), సాక్షి (52 కేజీలు- ఎస్‌ఎస్‌సీబీ), మంజు బాంబోరియా (66 కేజీలు- మధ్యప్రదేశ్‌) స్వర్ణ పతకాలు గెలుపొందారు.

2022 నిఖత్‌దే.. 2022 సంవత్సరంలో నిఖత్‌ జరీన్‌ జోరు మామూలుగా లేదు. ఆమె అసలు సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది ఈ ఏడాదే. 2011లోనే ప్రపంచ జూనియర్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌గా నిలిచిన ఈ నిజామాబాద్‌ అమ్మాయి.. సీనియర్‌ స్థాయిలో తనపై నెలకొన్న అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఈ ఏడాది అంతర్జాతీయ వేదికల్లో అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టింది నిఖత్‌. ముందుగా ప్రతిష్టాత్మక స్టాంజా అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీలో ఛాంపియన్‌గా నిలవడంతో నిఖత్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తర్వాత కెరీర్లోనే అతి పెద్ద విజయాన్నందుకుంది నిఖత్‌. ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 52 కేజీల విభాగంలో విజేతగా నిలిచి తన పేరు మార్మోగేలా చేసుకుంది. ప్రపంచ ఛాంపియన్‌ అయ్యాక ఆమె ఆగిపోలేదు. కామెన్వెల్త్‌ క్రీడల్లో ఛాంపియన్‌ అయింది. ఇంత పెద్ద విజయాలు సాధించాక జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ను తక్కువగా చూడకుండా ఇక్కడా బరిలోకి దిగి విజేతగా నిలిచి 2022 సంవత్సరాన్ని ఘనంగా ముగించింది. ఈ ఏడాది మొత్తంగా భారత క్రీడా రంగంలో అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరిగా నిలిచింది నిఖత్‌.

ఇదీ చూడండి:IND Vs BAN: 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' పుజారాకు ఎందుకిచ్చారబ్బా.. మరి శ్రేయస్​?

Last Updated : Dec 27, 2022, 9:59 AM IST

ABOUT THE AUTHOR

...view details