Hockey World Cup: గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు మరో కల నెరవేర్చుకునేందుకు సిద్ధమైంది. ఆ ప్రదర్శన ఇచ్చిన స్ఫూర్తితో నిలకడగా అదరగొడుతున్న టీమ్‌ఇండియా.. శుక్రవారం ఆరంభమయ్యే ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్‌లో టైటిల్‌పై కన్నేసింది. ఈ టోర్నీ ఆరంభ సీజన్ (1974)లో నాలుగో స్థానంలో నిలవడమే ఇప్పటివరకూ భారత అత్యుత్తమ ప్రదర్శన. ఇప్పుడు దాన్ని తిరగరాసి ఏకంగా తొలిసారి కప్పును ముద్దాడాలనే లక్ష్యంతో సవిత సేన ఉంది. ఇటీవల ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి అగ్రశ్రేణి జట్లను వెనక్కినెట్టి మరీ మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు విజేతగా నిలిచిన నెదర్లాండ్స్ వరుసగా మూడో సారి కప్పు కొట్టాలనే ధ్వేయంతో ఉంది. తలో రెండు సార్లు ఈ కప్పును సొంతం చేసుకున్న అర్జెంటీనా, ఆస్ట్రేలియా, జర్మనీ కూడా బలంగానే ఉన్నాయి.
- 16 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆదివారం ఇంగ్లాండ్‌తో తలపడుతుంది.
- ఇంగ్లాండ్, చైనా, న్యూజిలాండ్‌తో కలిసి భారత్ పూల్- బి లో ఉంది. పూల్-ఎలో జర్మనీ, చిలీ, ఐర్లాండ్, నెదర్లాండ్స్.. పూల్-సిలో అర్జెంటీనా, కెనడా, కొరియా, స్పెయిన్.. పూల్-డిలో ఆస్ట్రేలియా, బెల్జియం, జపాన్, దక్షిణాఫ్రికా ఉన్నాయి.
- నాలుగు పూల్‌లుగా జట్లను విభజించారు. ప్రతి పూల్‌లోనూ అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్స్ చేరుతుంది. రెండు, మూడు స్థానాలు దక్కించుకున్న జట్లు.. ముందంజ వేయడానికి ఇతర పూల్‌లోని దేశాలతో పోటీపడతాయి.