తెలంగాణ

telangana

ETV Bharat / sports

వింబుల్డన్‌ కోటలో కొత్తరాజు.. జకోవిచ్‌పై సంచలన విజయం - alcaraz titles

Wimbledon 2023 Men's Singles Final : వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్ కొత్త ఛాంపియన్​గా కార్లోస్‌ అల్కరాస్‌ అవతరించాడు. ఫైనల్‌లో ప్రపంచ నంబర్‌ 2, సెర్బియా దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌పై జయభేరి మోగించాడు.

wimbledon 2023 mens final
వింబుల్డన్‌ కోటలో కొత్తరాజు.. జకోవిచ్‌పై సంచలన విజయం

By

Published : Jul 17, 2023, 6:18 AM IST

Updated : Jul 17, 2023, 8:29 AM IST

Wimbledon 2023 Men's Singles Final : స్పెయిన్‌ యువ కెరటం, ప్రపంచ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్కరాస్‌.. వింబుల్డన్ కొత్త ఛాంపియన్‌గా అవతరించాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో ప్రపంచ నంబర్‌ 2, సెర్బియా దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌పై జయభేరి మోగించాడు. వింబుల్డన్‌ సెంటర్‌ కోర్టులో హోరాహోరీగా సాగిన తుదిపోరులో జకోవిచ్​పై 1-6, 7-6, 6-1, 3-6, 6-4 తేడాతో అల్కరాస్‌ విజయం సాధించాడు.

20 ఏళ్ల అల్కరాస్‌ ఫైనల్‌ చేరిన మొదటి సారే వింబుల్డన్ టైటిల్‌ను గెల్చుకొని.. సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెల్చి మొత్తంగా 24 టైటిళ్లతో.. అగ్రస్థానంలో ఉన్న మార్గరెట్‌ను సమం చేస్తానని భావించిన జకోవిచ్‌ ఆశలు ఫలించలేదు. డిఫెండింగ్ ఛాంపియన్‌ అయిన జకోవిచ్‌.. 2018 నుంచి వరుసగా ఈ వేదికపై గెలుస్తూ వస్తున్నాడు. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో.... 23 టైటిళ్లు నెగ్గి మరో కప్పుపై కన్నెసిన జకోకు ఈ సారి ఊహించని ఓటమి ఎదురైంది.

నాదల్‌, జకోవిచ్‌, జ్వెరెవ్‌పై విజయం.. అల్కరాస్‌ టెన్నిస్‌ జర్నీ సాగిందిలా...

  • స్పెయిన్‌ కుర్రాడు కార్లోస్‌ అల్కరాస్‌ టెన్నిస్‌ జర్నీ ఓ సంచలనం. మాజీ టెన్నిస్‌ ప్లేయర్​ తండ్రి గొంజాలెజ్‌ ప్రోత్సాహంతో.. అల్కరాస్‌ టెన్నిస్​లోకి అడుగుపెట్టాడు. అది కూడా నాలుగేళ్ల వయసులో ఈ రాకెట్‌ పట్టాడు.
  • 2018లో మాజీ నంబర్‌వన్‌ జువాన్‌ కార్లోస్‌ ఫెరీరో అకాడమీలో చేరాడు అల్కరాస్‌. అక్కడే ఆటలో రాటుదేలాడు.
  • 16 ఏళ్లకే ఏటీపీ టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చాడు. 17 ఏళ్లకే గ్రాండ్‌స్లామ్‌లోకి అడుగుపెట్టాడు. వింబుల్డన్‌కు ముందు 2022 యుఎస్‌ ఓపెన్​తో పాటు 11 ఏటీపీ టూర్‌ ట్రోఫీలను ముద్దాడాడు. ఇందులో నాలుగు మాస్టర్స్‌ 1000 ట్రోఫీలు ఉన్నాయి.
  • నిరుడు యుఎస్‌ ఓపెన్‌తో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్​ను అందుకున్నాడు. 1990 పీట్‌ సంప్రాస్‌ తర్వాత.. యుఎస్‌ ఓపెన్​లో విజయం సాధించిన పిన్న వయస్సు ప్లేయర్​గా ఘనతను అందుకున్నాడు. అయితే ఈ ఏడాది తొడ కండరాల గాయంతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌లో జకోవిచ్‌ చేతిలోనే పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.
  • మియామి ఓపెన్‌ సాధించిన పిన్న వయస్సు ఆటగాడిగా నిలిచాడు. అలాగే 2022 మాడ్రిడ్‌ ఓపెన్‌లో మట్టి కోర్టులో నాదల్​పై గెలిచిన తొలి టీనేజర్‌గా ఘనత సాధించాడు. ఈ 2022 మాడ్రిడ్‌ ఓపెన్‌లో వరుసగా నాదల్‌, జకోవిచ్‌, జ్వెరెవ్‌పై విజయం సాధించి టైటిల్​ను అందుకోవడం విశేషం.
  • ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకున్నాడు. నంబర్‌వన్‌గా ఏడాది ముగించిన తొలి టీనేజర్​గా నిలిచాడు.
  • ఆ తర్వాతే అతడిపై అంచనాలు పెరిగాయి. అన్ని కోర్టుల్లోనూ ఆడగల ఆల్‌రౌండర్​గా నిలిచాడు. తిరుగులేని ఫోర్‌హ్యాండ్‌ విన్నర్లు, బేస్‌లైన్‌ దగ్గర దూకుడు, నెట్‌ దగ్గర తెలివిగా వేసే డ్రాప్‌ షాట్లు, బంతి వేగాన్ని తగ్గించి తెలివిగా స్పిన్‌ చేయగల సామర్థ్యం, కాళ్ల కదలికలో తిరుగులేని వేగం.. ఇవన్నీ అల్కరాస్‌ ప్రత్యేకం.
  • ఈ ఘనతలతో ఫెదరర్‌, నాదల్‌, జకోవిచ్‌ తర్వాత పురుషుల సింగిల్స్‌ టెన్నిస్​లో భవిష్యత్​ స్టార్ ప్లేయర్ ఇతడే అవుతాడని టెన్నిస్ క్రీడా నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది యువ ప్లేయర్స్​ ఉన్నారు. కానీ వీరంతా నిలకడగా ఆడలేకపోతున్నారు.
Last Updated : Jul 17, 2023, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details