క్రికెట్‌లో ఎప్పుడు ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు బ్యాట్స్‌మన్ ఆడిన షాట్లకు ఏ ఫీల్డరో క్యాచ్ పడితే.. అది కాస్తా నోబాల్‌గా నమోదైతే.. ఆ ఆటగాడు లక్కీగా బతికిపోతాడు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు మనం క్రికెట్ మైదానాల్లో చూస్తూనే ఉంటాం. కానీ, తాజాగా న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో అంతకన్నా ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకొని ఓ బ్యాట్స్‌మన్ ఔటవ్వకుండా తప్పించుకున్నాడు. ఆ వివరాలేంటో తెలిస్తే మీరూ ముక్కున వేలేసుకుంటారు. అందుకు కారణం అంపైర్ అలీందార్.
అంతర్జాతీయ క్రికెట్‌లో అలీందార్ అనే అంపైర్ చాలా బాగా సుపరిచితమే. ఎన్నో మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసి మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఈ సంఘటనతో క్రికెట్ ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేశారు. బుధవారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఐర్లాండ్ బ్యాట్స్‌మన్ సిమి సింగ్ (11) పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా న్యూజిలాండ్ పేసర్ బ్లెయిర్ టిక్నర్ బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో సిమి ఆడిన ఓ బంతిని కీపర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ ఆటగాళ్లంతా వికెట్ దక్కిందని సంబరపడ్డారు. అక్కడున్న అంపైర్ కూడా ఔటిచ్చాడు. కానీ మరో అంపైర్ అలీందార్ దాన్ని నాటౌట్‌గా పేర్కొన్నారు. ఎందుకంటే టిక్నర్ ఆ బంతిని విసిరేముందు తన ప్యాంట్‌కు పెట్టుకున్న కర్చీఫ్ కిందపడిపోయింది. అది బ్యాట్స్‌మన్ దృష్టిని మరల్చే అవకాశం ఉండటంతో అంపైర్ నాటౌటిచ్చాడు.