భారత జట్టు ఆసియా స్థాయిలోనే ఉత్తమ ప్రదర్శన చేయలేకపోతున్నప్పుడు ఇక ప్రపంచకప్, ఒలింపిక్స్ గురించి ఏం ఆలోచిస్తాం? ఘనమైన ఫుట్‌బాల్ చరిత్ర కలిగిన మన దేశం.. ఇప్పుడు ప్రపంచకప్ అర్హతకు ఎంతో దూరంలో ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 106వ స్థానంలో ఉంది. ఒకప్పుడు ఆసియా నంబర్‌వన్‌గా ఉన్న జట్టు.. ఇప్పుడు 19వ స్థానంలో కొనసాగుతోంది. ఫుట్‌బాల్‌పై ప్రభుత్వాల అశ్రద్ధ, అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్)లో గతంలో అంతర్గత కుమ్ములాటలతో కొరవడిన పర్యవేక్షణ.. తగ్గిన ఆదరణ.. ప్రణాళిక-కార్యాచరణ లోపాలు. ఇలా జట్టు దిగజారడానికి ఎన్నో కారణాలు. ఇప్పుడు దేశంలో చాలా మంది మెస్సి, రొనాల్డో లాంటి ఆటగాళ్లను తలుస్తున్నారు. కానీ భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి పేరు ఎంతమందికి తెలుసు? మన దగ్గర ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లనే గుర్తించకపోతే.. ఆటకు ఆదరణ ఎలా దక్కుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
క్రమంగా పడిపోతూ..
1950, 1960వ దశకాల్లో భారత ఫుట్‌బాల్ ఓ వెలుగు వెలిగింది. 1951, 1962 ఆసియా క్రీడల్లో పసిడి ముద్దాడింది. 1956 ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. 1964 ఆసియా కప్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. 1970 ఆసియా క్రీడల్లో కాంస్యం సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత జట్టు ప్రదర్శన క్రమంగా పడిపోయింది. అగ్రశ్రేణి ఆటగాళ్లు రిటైరవడం, 1963లో చనిపోయిన దిగ్గజ కోచ్ రహీమ్ స్థానాన్ని భర్తీ చేసే మరో కోచ్ దొరకకపోవడంతో ఫుట్‌బాల్ ప్రభ కోల్పోయింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) సరైన చర్యలు తీసుకోకపోవడంతో జట్టు ప్రదర్శనతో పాటు ఆదరణ కూడా తగ్గింది. జట్టు ప్రమాణాలు పడిపోయాయి.
1930లో ప్రపంచకప్ ఆరంభమవగా.. ఇప్పటివరకూ భారత్ ఒక్కసారి కూడా ఈ మెగాటోర్నీలో ఆడలేకపోయింది. 1950లో తమ క్వాలిఫికేషన్ గ్రూప్‌లోని కొన్ని దేశాలు తప్పుకోవడంతో భారత్‌కు ఆడే అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల బ్రెజిల్‌కు వెళ్లలేకపోయింది. ఆ తర్వాత ఎప్పుడూ కనీసం అర్హతకు దగ్గరగా కూడా రాలేకపోయింది. ఇక ఏఐఎఫ్‌ఎఫ్‌లో అంతర్గత విభేధాలు, వర్గ పోరు, రాజకీయ ప్రమేయం కారణంగా ఆటను పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. దీంతో ఈ ఏడాది ఏఐఎఫ్‌ఎఫ్‌పై ఫిఫా నిషేధం విధించి, ఆ తర్వాత ఎత్తేసింది.
ఆ లీగ్‌ల వల్ల..
యూఈఎఫ్‌ఏ ఛాంపియన్స్ లీగ్, ఇంగ్లిష్ ప్రిమియర్ లీగ్, స్పానిష్ లాలిగా, జర్మన్ బుండెస్‌లిగ, ఇటాలియన్ సిరీస్ 'ఏ', 'బి', ఫ్రెంచ్ లీగ్ 1.. ఇలా అంతర్జాతీయ ఫుట్‌బాల్ లీగ్‌లు ఎన్నో ఉన్నాయి. వీటిల్లో అత్యుత్తమ క్రీడాకారులతో పోటీపడుతూ ఇతర దేశాల ఆటగాళ్లు లబ్ధి పొందుతున్నారు. ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శనతో మొరాకో సెమీస్ వరకూ వచ్చిందంటే.. ఆ జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఇలాంటి లీగ్‌ల్లో ఆడి, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం ప్రధాన కారణం. కానీ మన ఆటగాళ్లు ఈ విదేశీ లీగ్‌ల్లో ఆడే స్థాయికి ఇంకా చేరుకోలేదు. ఆ దిశగా మన ప్రమాణాలు ఎంతో మెరుగుపడాలి. అందుకు నిరంతర కసరత్తు కావాలి.
''మన దేశంలో టోర్నీలు, లీగ్‌ల నిర్వహణలో పరిస్థితి భిన్నంగా ఉంది. గతంతో పోలిస్తే టోర్నీల సంఖ్య తగ్గిపోయింది. తెలంగాణలో నిజాం గోల్డ్ కప్ చరిత్రలో కలిసిపోయింది. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో టోర్నీలు కనమరుగయ్యాయి. ఐరోపా తరహాలో లీగ్‌ల ద్వారా మార్పు తేవాలని చూస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఇండియన్ సూపర్ లీగ్, ఐ- లీగ్ నిర్వహిస్తున్నారు. ఈ లీగ్‌లు భారత ఫుట్‌బాల్‌కు మేలే చేస్తాయి. కానీ అందుకు సమయం పడుతుంది. ముందుగా వీటిని అందరికీ చేరువ చేయాలి. ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్లను ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేయాలి'' అని భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ విక్టర్ అమల్‌రాజ్ తెలిపాడు. ఓ రేడియో ఛానెల్‌లో ప్రపంచకప్ వ్యాఖ్యానం కోసం ఆయన ఖతార్ కూడా వెళ్లొచ్చాడు.