what is lawn bowls game: కామన్వెల్త్ క్రీడల మహిళల లాన్‌బౌల్ ఫోర్ విభాగంలో భారత్ మొట్టమొదటి సారి స్వర్ణాన్ని ముద్దాడి చరిత్ర సృష్టించింది. 17-10 తేడాతో విజయం సాధించింది. దీంతో ఇప్పుడందరూ ఈ ఆట గురించే మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఆట ఎలా ఆడతారో తెలుసా..?
లాన్ బౌల్స్ అనేది ఓ ఔట్‌డోర్ క్రీడ. దీన్ని లాన్ బౌలింగ్ అని కూడా పిలుస్తారు. 'జాక్' అని పిలిచే చిన్న బంతి వైపు క్రీడాకారులు బౌల్‌ను విసురుతారు. ఈ ఆటను సాధారణంగా 40–42 గజాల ఫ్లాట్‌గా ఉండే గ్రీన్‌లాన్‌లో ఆడతారు. ఈ గేమ్‌లోని ప్రధాన లక్ష్యం క్రీడాకారులు కొంత దూరంలో నిలుచొని తమ బౌల్‌ను ‘జాక్’కు దగ్గరికి వెళ్లే విధంగా రోల్ చేస్తూ విసరాలి. అది వెళ్లి జాక్‌కు అత్యంత సమీపంలో నిలవాలి. అలా ఒక మ్యాచ్ పూర్తవ్వాలంటే ఇరు జట్లు 18 మూలల నుంచి బౌల్స్‌ను విసరాలి. అయితే, ఇది పూర్తిగా వృత్తాకార పద్ధతిలో నిర్వహిస్తారు. 18 రౌండ్ల తర్వాత ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టే విజేతగా నిలుస్తుంది. ఈ లాన్‌బౌల్స్ ఈవెంట్‌లో మొత్తం నాలుగు ఫార్మాట్‌లు ఉంటాయి. సింగిల్స్, పెయిర్స్, ట్రిపుల్స్, ఫోర్స్. ప్రతి జట్టులోని వ్యక్తుల సంఖ్య ఆధారంగా ఆయా ఫార్మాట్లకు ఆ పేరు పెట్టారు.
లాన్ బౌల్స్ నియమాలు..
ఈ గేమ్ క్రికెట్ మాదిరే టాస్‌తో మొదలవుతుంది. టాస్ గెలిచిన క్రీడాకారులు తొలి అవకాశం తీసుకుంటారు. ఆ సమయంలో ప్రత్యర్థి జట్టు తొలుత జాక్‌ను 23 మీటర్ల కన్నా ఎక్కువ దూరం రోల్ చేయాల్సి ఉంటుంది. ఆ జాక్ ఎక్కడైతే నిలుస్తుందో దాన్నే అంతిమ లక్ష్యంగా నిర్దేశిస్తారు. మరోవైపు ఈ రోల్‌తోనే జాక్, గేమ్ మొదలెట్టాల్సిన పాయింట్ మధ్య ఉన్న దూరాన్ని నిర్ణయిస్తారు. దీంతో క్రీడాకారులు త్రో చేసిన బౌల్స్.. జాక్‌కు దగ్గరగా వెళ్లినప్పుడు పాయింట్లు కేటాయిస్తారు. ఈ క్రమంలోనే ఈ క్రీడలో విజయం సాధించాలంటే ఆయా క్రీడాకారులు లేదా బృందాలు.. తమ బౌల్స్‌ను జాక్‌కి అత్యంత సమీపంలోకి (ప్రత్యర్థుల కన్నా) విసిరేలా చూసుకోవాలి. ఇక్కడ ప్రత్యర్థి బౌల్‌ను పక్కకు పడేయడం ద్వారా కూడా పాయింట్లు సాధించవచ్చు.