ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు రెజ్లింగ్ జట్లను ఎంపిక చేసేందుకు సిద్ధమైంది భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ). జులై 26 నుంచి 28 వరకు సోనిపట్, లఖ్‌నవూ వేదికగా ట్రయల్స్ నిర్వహించనుంది. కజకిస్థాన్ వేదికగా జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌నకు ఇప్పటికే బృందాన్ని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ టోర్నీలో సత్తా చాటిన వారికి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత లభిస్తుంది.
ఆరు కేటగిరీలకు మాత్రమే...
ఫురుషుల ఫ్రీ స్టయిల్ జట్టు ఎంపిక బాల్ఘర్లోని శాయ్(భారత క్రీడల ప్రాధికార సంస్థ) కేంద్రం వద్ద శుక్రవారం జరగనుంది. ఆరు రకాల విభాగాల్లో (57, 64, 74, 86, 97, 125 కేజీలు) క్రీడాకారులకు ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. లఖ్‌నవూలోని శాయ్ సెంటర్లో ఆరు రకాల విభాగాల్లో (50, 53, 57, 62, 68, 76 కేజీలు) మహిళా క్రీడాకారిణులను ఎంపిక చేయనున్నారు. ఈ నెలలో చేపట్టనున్న ట్రయిల్స్ ఆరు విభాగాల రెజ్లర్లకు మాత్రమేనని... మిగిలిననాలుగు విభాగాల క్రీడాకారులకు ఆగస్ట్‌లో పరీక్షలు నిర్వహిస్తామని డబ్ల్యూఎఫ్ఐ అధికారులు వెల్లడించారు.