WFI President Controversy :ఇటీవలే జరిగిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు క్రీడా ప్రపంచంలో అనక మార్పులు తెచ్చిపెచ్చింది. ముఖ్యంగా కొత్త అధ్యక్షుడి కోసం ఎదురుచూస్తున్న రెజ్లర్లకు నిరాశే మిగిలింది. బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్‌ను కొత్త అధ్యక్షుడిగా నియమించిన తర్వాత రెజ్లింగ్ హిస్టరీలో మరింత అలజడి నెలకొంది. దీంతో ఆందోళన చెందిన స్టార్ రెజ్లర్లు మరోసారి ఆందోళనను మొదలెట్టారు. అయితే తాజాగా రెజ్లింగ్ సమాఖ్య నూతన ప్యానెల్‌ను కేంద్రం సస్పెండ్ చేసిన వేళ మరో కీలక పరిణామం జరిగింది. ఇకపై రెజ్లింగ్ వ్యవహారాల నుంచి తాను రిటైర్మెంట్ తీసుకున్నట్లు డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు, భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చెప్పారు. కొత్తగా ఎన్నికైన ప్యానెల్ దీన్ని చూసుకుంటుందంటూ ఆయన వెల్లడించారు.
"నేను 12 ఏళ్ల పాటు రెజ్లింగ్‌కు సేవలందించాను. అది మంచో, చెడో కాలమే సమాధానం చెప్తుంది. ప్రస్తుతం నేను రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాను. క్రీడలతో నా సంబంధాన్ని తెంచుకుంటున్నాను. డబ్ల్యూఎఫ్‌ఐ వ్యవహారాలను కొత్తగా ఎన్నికైన సంఘమే చూసుకుంటుంది. నాపై ఇతర బాధ్యతలున్నాయి. లోక్‌సభ ఎన్నికలు కూడా మరి కొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ సమయంలో నేను క్రీడా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. "అంటూ బ్రిజ్‌భూషణ్ చెప్పుకొచ్చారు.
మరోవైపు పాలక వర్గం సస్పెన్షన్‌పై ప్రస్తుత అధ్యక్షుడు సంజయ్ సింగ్ స్పందించారు. తమ సభ్యులు కొంత మంది ప్రధాన మంత్రితో పాటు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో ఈ విషయంపై చర్చలు జరిపేందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా బ్రిజ్ భూషణ్ సింగ్‌తో తనకున్న సంబంధం గురించి ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.
"కొత్త ఫెడరేషన్ ఏర్పడ్డాక బ్రిజ్‌భూషణ్ సింగ్ ఈ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ రోజు ఆయన రెజ్లింగ్ వ్యవహారాల నుంచి రిటైరైనట్లు ప్రకటించారు. అలాగే సాక్షి మాలిక్ కూడా రిటైరయ్యానంటూ చెప్పారు. ఈ ఇద్దరూ ఇక ఫెడరేషన్‌ను శాంతియుతంగా నడిచేందుకు స్పెస్ ఇవ్వాలి. బ్రిజ్ భూషణ్, నేను వేర్వేరు వర్గాలకు చెందిన వాళ్లం. మేమిద్దరం ఎలా బంధువులమవుతాం. ఆయన ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను, మా మధ్య అప్పటి నుంచే సంబంధాలు మొదలయ్యాయి" అంటూ సంజయ్ సింగ్ వివరించారు.