WFI Election Date 2023 : భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నాయి. వాయిదా పడుతూ వస్తున్న ఈ ఎలక్షన్స్ ఎప్పుడు నిర్వహించనున్నారో ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు. దీంతో ఇప్పుడు ప్రపంచ వేదికపై ఎదురుదెబ్బ తగిలింది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్‌కు (WFI) షాకిచ్చింది యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW). డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సమాఖ్య ఎన్నికలను నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్ఐ వైఫలమైన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ వెల్లడించింది. దీంతో ఇకపై భారత రెజ్లర్లు.. సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభంకానున్న ఒలింపిక్ క్వాలిఫైయింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ పోటీల్లో న్యూట్రల్ అథ్లెట్లుగా బరిలోకి దిగాల్సి వస్తుంది. భారత్ ట్యాగ్‌లైన్ లేకుండానే వారు ఆడాల్సి వస్తుంది.
WFI Elections Postpone : కాగా, ఇటీవలే డబ్ల్యూఎఫ్ఐ వివాదాల్లో చిక్కుకున సంగతి తెలిసిందే. భారతీయ రెజ్లర్ల నిరసనలు, వివిధ రాష్ట్ర విభాగాల నుంచి న్యాయపరమైన పిటిషన్‌ల దాఖలు అయిన కారణంగా ఈ ఎలెక్షన్స్ పదేపదే వాయిదా పడుతూ వస్తున్నాయి. అసలీ భారత రెజ్లింగ్ ఫెడరేషన్ గవర్నింగ్ బాడీ ఎలక్షన్స్ మే 2023లో నిర్వహించాల్సి ఉంది. మొదట మే 7న జరగాల్సిన ఎలక్షన్స్‌ను క్రీడా మంత్రిత్వ శాఖ నిలిపి వేసింది. జూన్ 30 ఎన్నికలు ఉంటాయని అప్పుడు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆ తర్వాత జులై 4న ఎన్నికలు నిర్వహిస్తామని ఐఓఏ పేర్కొంది. కానీ జులై 6న ఎలక్షన్స్ నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి నిర్ణయించారు. కానీ తమకూ ఓటు హక్కుందని, గుర్తింపు కోల్పోయిన అయిదు సంఘాలు కోర్టుకు ఎక్కడంతో జులై 11కు ఎన్నికలను పోస్ట్ పోన్ వేశారు. ఇప్పటికే ఆ తేదీ దాటిపోయింది. ఆగస్ట్ కూడా వచ్చేసింది. ఇక ఈ ఎన్నికలు ఈ నెలలోనూ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో భారత రెజ్లింగ్ ఫెడరేషన్ సభ్యత్వాన్ని సస్పండ్ చేస్తూ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిర్ణయం తీసుకుంది.