ఫిఫా వరల్డ్ కప్ ఫీవర్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఆ ఫీవర్ భారత్‌లోనూ ఎక్కువగానే ఉంది. కేరళలో మెస్సీ, రోనాల్డో కటౌట్లు నదుల్లో ఏర్పాటు చేశారు. అర్జెంటీనా, బ్రెజిల్ దేశాల జెండాల రంగులు ఇళ్లకు వేశారు. అదే కోవకు చెందిన వాడు బంగాల్‌కు చెందిన చాయ్ వాలా శిభా పాత్రా.
1986లో అర్జెంటీనా వరల్డ్ కప్ గెలిచినప్పటి నుంచి ఆ జట్టు అభిమాని అయిపోయానంటున్నాడు శిభా పాత్రా. ఇప్పుడు అతడి రెండు అంతస్తుల భవనానికి అర్జెంటీనా జెండా రంగులు వేశాడు. ఇంట్లోని, కప్‌బోర్డులు, ఫ్యాన్లకు సైతం ఆ రంగులే వేశాడు. టీ షాప్ నుంచి వచ్చిన డబ్బుల్లో కొన్నింటిని దాచుకుని.. తన షాపుకు అర్జెంటీనా జెండాలు, మెస్సీ, మరడోనా ఫొటోలతో ముస్తాబు చేశాడు.
బంగాల్ చాయ్‌వాలా హంగామా.. ఇంటికి అర్జెంటీనా రంగులు.. బయట మెస్సీ విగ్రహం - ఫిపా వరల్డ్ కప్ 2022
ఫిపా వరల్డ్ కప్ ఫీవర్ ప్రపంచంతో పాటు భారత్‌ను ఉర్రూతలూగిస్తోంది. బంగాల్‌కు చెందిన ఓ చాయ్ వాలా.. అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ తన సోదరుడు అంటున్నాడు. ఇంటికి అర్జెంటీనా జెండా రంగులు వేయించుకున్నాడు. అతడి కథేంటంటే..
'మెస్సీ నాకు సోదరుడు'
'అర్జెంటీనా జట్టు ప్లేయర్ మెస్సీ నాకు సోదరుడి లాంటోడు. 1986 నుంచి నేను అర్జెంటీనా జట్టును ఇష్టపడుతున్నా. నేను ఫుట్‌బాల్ కూడా ఆడేవాడిని. మరడోనా అంటే కూడా చాలా ఇష్టం. భారత్ ఎప్పుడు ఫిపా వరల్డ్ కప్ ఆడినా నేను సపోర్ట్ చేస్తా. అయినా మెస్సీ నా సోదరుడు లాంటోడే. నేను ఈ 2022 ఫిపా వరల్డ్ చూడడానికి కొన్ని డబ్బులు దాచుకున్నాను. కానీ వాటితో మెస్సీ విగ్రహం చేయించి నా టీ షాప్ ముందు పెట్టుకున్నాను' అని శిభా పాత్రా చెప్పుకొచ్చాడు.
దీనికి అతడి కుటుంబ సభ్యుల మద్దతు కూడా తోడైంది. దీనిపై స్పందించిన అతడి భార్య సంధ్యా పాత్రా.. 'మేము ఆయన సెంటిమెంట్లను గౌరవిస్తాము. అతడు ఏం చేసినా ఎదురుచెప్పం. ఆయన చేసేదానికి గర్వంగా భావిస్తాం. మా కుమార్తె వివాహంలో కూడా.. దుస్తుల నుంచి ఆహారం వరకు అన్నింటిలో అర్జెంటీనా జెండా రంగులు ఉన్నాయి' అంటూ చెప్పుకొచ్చింది.