రష్యాపై ప్రపంచ డోపింగ్ నిరోధ సంస్థ (వాడా) వేటు వేయడంపై అ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. రాజకీయాలతోనే తమ దేశాన్ని తొలగించారని, క్రీడల పట్ల అంకిత భావం ఉంటే వాడా ఇలా చేసేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఒలింపిక్ చార్టర్ ప్రకారం జాతీయ పతాకం కింద పోటీ చేసే హక్కు ప్రతీ దేశానికి ఉంది. ఎలాంటి కారణాలు చూపకుండా రష్యాపై నిషేధం విధించడం సమంజసం కాదు. వాడా నిర్ణయం ఒలింపిక్ చార్టర్ను ఉల్లఘించేలా ఉంది. దీనిపై అప్పీల్ చేసేందుకు మాకు పూర్తి హక్కు ఉంది" -వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు
తప్పు చేసిన వారినే శిక్షించాలి అంతేకానీ అందరిపై వేటు వేయడం సమంజసం కాదని అన్నారు పుతిన్.
"ఎవరైనా తప్పు చేస్తే.. వ్యక్తిగతంగా వారినే శిక్షించాలి. అంతేకానీ అందరినీ శిక్షార్హులను చేయడం సమంజసం కాదు. కేవలం రాజకీయపరమైన ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు తప్పా అంతర్జాతీయ క్రీడల పవిత్రతను కాపాడేందుకు కాదు. ఈ నిర్ణయంతో క్రీడా ప్రయోజనానికి ఒరిగేదేమీలేదు" -వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు
వచ్చే నాలుగేళ్లలో ఒలింపిక్స్‌తోపాటు ఏ మేజర్ అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లో పాల్గొనకుండా రష్యాను వాడా నిషేధించింది. మాస్కో ల్యాబొరేటరీకి సంబంధించి అథ్లెట్ల డోపింగ్ పరీక్షల వివరాలను ప్రభుత్వ అధికారులు మార్చినందుకు రష్యాకు వాడా ఈ శిక్ష విధించింది. రష్యా ఏ ఒలింపిక్ క్రీడలోనూ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ నిర్వహించకూడదని చెప్పింది.
ఇదీ చదవండి: పంజాబీ సాంగ్కు.. ఫ్రెంచ్ ఫుట్బాల్ ప్లేయర్ చిందులు