తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టార్​ రెజ్లర్​కు యాంటీ-డోపింగ్‌ ఏజెన్సీ నోటీసులు.. ఆ విషయంలో వివరణ ఇవ్వాలంటూ.. - వినేశ్​ ఫొగాట్​ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ

Vinesh Phogat Doping Case : భారత స్టార్​ రెజ్లర్​ వినేశ్‌ ఫొగాట్​కు డోపింగ్ నిరోధక సంస్థ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆమె నిబంధనలు ఉల్లంఘించిందని గుర్తించినట్లు ఏజెన్సీ తెలిపింది. ఆమె ఈ విషయంపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది.

Vinesh Phogat Antidoping
Vinesh Phogat Antidoping

By

Published : Jul 14, 2023, 2:07 PM IST

Vinesh Phogat Doping Case : భారత స్టార్​ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్​కు జాతీయ యాంటీ-డోపింగ్‌ ఏజెన్సీ గట్టి షాక్ ఇచ్చింది. డోపింగ్‌ నిరోధక నిబంధనలను పాటించనందుకుగానూ ఆమెకు నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై సమాధానం ఇచ్చేందుకు ఏజెన్సీ ఆమెకు రెండు వారాల సమయానిచ్చినట్లు తెలుస్తోంది.

"డోపింగ్‌ నిరోధక నియమాలను పాటించడంలో మీరు (వినేశ్‌) విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తుంది. మా రిజిస్టర్డ్‌ టెస్టింగ్‌ పూల్‌లో మీ పేరును చేర్చినట్లు 2022 మార్చి, 2022 డిసెంబరులో మీకు ఈ-మెయిల్‌ కూడా చేశాం. దీంతో, యాంటీ డోపింగ్‌ నిబంధనల కింద ప్రతి త్రైమాసికానికి ముందు మీరు ఎక్కడున్నారన్న విషయాన్ని ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. ఆ త్రైమాసికంలో మీరు ఏ రోజు ఎక్కడుంటారన్న స్పష్టమైన సమాచారాన్ని కూడా మాకు అందించాల్సి ఉంటుంది. మీరు చెప్పిన ప్రదేశంలో చెప్పిన సమయానికి డోపింగ్ పరీక్షలకు అందుబాటులో ఉండాలి" అని ఏజెన్సీ ఆ నోటీసుల్లో పేర్కొంది.

"మీరు (వినేశ్‌) ఇటీవల ఇచ్చిన ఫైలింగ్‌లో జూన్‌ 27న ఉదయం 10 గంటలకు హరియాణాలోని సోనిపత్​లో టెస్టింగ్‌కు అందుబాటులో ఉంటారని ప్రకటించారు. మీరు చెప్పిన సమయానికి మేం డోపింగ్‌ కంట్రోల్‌ ఆఫీసర్లను అక్కడకు పంపాం. కానీ, ఆ రోజు చెప్పిన ప్రాంతంలో మీరు లేరు. దీంతో డీసీవో అధికారులు టెస్టింగ్ చేయలేకపోయారు. దీన్ని బట్టి చూస్తే మీరు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఇట్టే స్పష్టమవుతోంది" అని ఆ నోటీసుల్లో తెలిపింది.

ఈ మేరకు ఈ నోటీసులుపై వినేశ్‌ ఫొగాట్‌ 14 రోజుల్లోగా తన స్పందన తెలియజేయాలని ఏజెన్సీ ఆదేశించింది. "మీరు నిబంధనలను ఉల్లంఘించినట్లు అంగీకరించాలి. లేదంటే ఆ ప్రాంతంలో డీసీవో అధికారులు ఎందుకు మిమ్మల్ని గుర్తించలేకపోయారో ఆధారాలివ్వాలి. ఒకవేళ, మీరు ఆ ప్రాంతంలో లేకపోతే అందుకు కారణాలను వివరించాలి" అని ఏజెన్సీ స్పష్టం చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఏజెన్సీ హెచ్చరించింది.

ఇక రెజ్లింగ్‌ సమాఖ్య తాత్కాలిక అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ రెజర్లు చేపట్టిన ఆందోళనలో వినేశ్ ఫొగాట్‌ కీలక పాత్రలో పోషించింది. ఈ సమయంలో ఈ నోటీసులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆందోళనల నేపథ్యంలో ఇటీవల పలు టోర్నమెంట్లకు ఫొగాట్‌ దూరమైంది. మరోవైపు గురువారం నుంచి మొదలైన బుడాపెస్ట్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌ 2023 పోటీల్లో ఫొగాట్‌ పాల్గొననుంది.

ABOUT THE AUTHOR

...view details