తెలంగాణ

telangana

ETV Bharat / sports

విజేందర్ పంచ్ అదుర్స్- ఖాతాలో 11వ విజయం

భారత స్టార్​ బాక్సర్​ విజేందర్​ సింగ్​ విదేశీ గడ్డపైనా సత్తా చాటాడు. అమెరికాలో తొలిసారి రింగ్​లో అడుగుపెట్టి ఆరంభంలోనే ఆ దేశ వీరుడికి దిమ్మతిరిగే షాకిచ్చాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున జరిగిన పోరులో అగ్రదేశ బాక్సర్​ మైక్​ స్నైడర్​ను ఓడించి భారత దేశ పంచ్​ పవర్​ చూపించాడు.

అదరహో విజేందర్ పంచ్​... ఖాతాలో 11 విజయం

By

Published : Jul 14, 2019, 10:06 AM IST

ఫ్రొఫెషనల్​ బాక్సర్​గా తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్నాడు భారత ఒలింపిక్​ పతక విజేత విజేందర్​ సింగ్​. వరుసగా 11వ విజయాన్ని ఖాతాలో వేసుకొని ఓటమి ఎరుగని వీరుడిగా నిలిచాడు. అమెరికాలో అడుగుపెట్టి ఆరంభ బౌట్​లోనే... ఆ దేశ స్టార్​ యోధుడు మైక్​ స్నైడర్​కు గుర్తుండిపోయే ఓటమినిచ్చాడు.

38 ఏళ్ల స్నైడర్​తో జరిగిన పోరులో నాలుగో రౌండ్​ రెండో నిమిషంలో ప్రత్యర్థిపై పంచ్​ల వర్షం కురిపించాడు సూపర్​ మిడిల్​ వెయిట్​ బాక్సర్​ విజేందర్​. రిఫరీ విజేతగా ప్రకటించేవరకు పిడిగుద్దుల వర్షం ఆగలేదు. ఓ దశలో అగ్రరాజ్య బాక్సర్​ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాడు. ఈ విధంగా 33 ఏళ్ల ఈ హరియాణా బాక్సర్​... ఎనిమిదవ సారి నాకౌట్​లోనే విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

బాక్సర్​ విజేందర్​ సింగ్​

" చాలా రోజుల తర్వాత రింగ్​లో అడుగుపెట్టి మళ్లీ నా సత్తా నిరూపించుకున్నాను. అమెరికా గడ్డపై విజయం సాధించడం చాలా గర్వంగా ఉంది. నాలుగు రౌండ్లలో ఫలితం తేలిపోయింది. నేను రెండు, మూడు రౌండ్లలో కానిచ్చేద్దాం అనుకున్నా. ఫలితం పట్ల సంతోషంగా ఉంది. నా ప్రమోటర్లు తర్వాతి మ్యాచ్​లు ఎవరితో తలపడాలని నిర్ణయిస్తారో.. నేను వారితో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నాను".
-- విజేందర్​, భారత సూపర్​ మిడిల్​ వెయిట్​ బాక్సర్

ఇప్పటివరకు స్నైడర్​ 13 మ్యాచ్​లు ఆడి 8 విజయాలు 5 అపజయాలతో ఉండేవాడు. విజేందర్​ దెబ్బతో మరో ఓటమి ఖాతాలో చేరింది. విజేందర్​ ఇదే ఏడాది మరో రెండు మ్యాచ్​ల్లో తలపడనున్నాడు. ఇందులో ముఖ్యంగా 'హాల్​ ఆఫ్​ ఫేమర్' బాబ్​ ఆరుమ్​తో​ టాప్​ ర్యాంక్​ ప్రచారం​ కోసం ఒప్పందం కుదుర్చుకున్నాడు.

విజేందర్​ ఇటీవల దక్షిణ దిల్లీ ప్రాంతం నుంచి సార్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేశాడు. కానీ ప్రజల తీర్పు వ్యతిరేకంగా రావడం వల్ల ఓటమిపాలయ్యాడీ మాజీ డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్​ ఛాంపియన్​.

ABOUT THE AUTHOR

...view details