ఓ వైపు క్రికెట్.. మరోవైపు హాకీ.. ఇంకోవైపు ఫుట్‌బాల్.. ఇలా 2023లో ప్రపంచకప్‌ల సందడే సందడి. క్రికెట్లో భారత పురుషులు, మహిళల జట్లు విభిన్న ఫార్మాట్ల ప్రపంచకప్‌ల్లో పోరాటానికి సై అంటున్నాయి. భారత్ వేదికగా హాకీ ప్రపంచకప్‌తో క్రీడా సీజన్‌కు ఘనమైన ఆరంభం దక్కనుంది. ఇక పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచకప్ జోరును కొనసాగించేందుకు.. అమ్మాయిల విశ్వ సమరం వచ్చేస్తోంది. అటు ఆసియా క్రీడలు.. ఇటు వివిధ క్రీడాంశాల్లో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్.. ఇక ఏడాదంతా క్రీడా సంబరమే. గతేడాది అద్భుత ప్రదర్శనలను కొనసాగిస్తూ.. పరాభవాలను మరిపిస్తూ నూతన సంవత్సరంలో సత్తాచాటేందుకు భారత క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారు.
హాకీ విశ్వ సంబరం..
ఏడాది ఆరంభంలోనే హాకీ సంబరం మొదలు కానుంది. భారత్ వేదికగా పురుషుల హాకీ ప్రపంచకప్ సమరానికి జనవరి 13న తెరలేస్తుంది. 29 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు తలపడుతున్నాయి. ఒడిషాలోని భువనేశ్వర్, రూర్కెలాలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. సొంతగడ్డపై ప్రపంచకప్‌లో భారత్ సత్తాచాటాలని చూస్తోంది. 1975లో విశ్వ విజేతగా నిలిచిన భారత్.. అంతకంటే ముందు 1973లో రన్నరప్ ట్రోఫీ దక్కించుకుంది. ఆ తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది.
అమ్మాయిలు ఏం చేస్తారో?
ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ప్రపంచకప్‌ను ముద్దాడని భారత మహిళల క్రికెట్ జట్టు మరోసారి కప్పు వేటకు సిద్ధమైంది. ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు దక్షిణాఫ్రికాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో విజయమే లక్ష్యంగా బరిలో దిగనుంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం అమ్మాయిల జట్టును బీసీసీఐ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్‌కౌర్ నేతృత్వంలోని జట్టు కప్పు దిశగా ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్నది ఆసక్తి రేపుతోంది. 2020 పొట్టి ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి.. చివరి మెట్టుపై ఆసీస్ చేతిలో భారత్ ఓడింది. ఈ సారి మాత్రం విశ్వవిజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది. అంతకంటే ముందు జనవరి 14 నుంచి 29 వరకు దక్షిణాఫ్రికాలోనే జరిగే మొట్టమొదటి అండర్-19 అమ్మాయిల టీ20 ప్రపంచకప్‌లో భారత్ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరోవైపు తొలిసారి మహిళల ఐపీఎల్‌కు ఈ ఏడాదే తెరలేవనుంది.
నీరజ్, నిఖత్‌పై కళ్లు
గతేడాది ప్రపంచ వేదికపై అద్భుత విజయాలు సాధించిన భారత అథ్లెట్లలో నిఖత్ జరీన్, నీరజ్ చోప్రా ముందు వరుసలో ఉంటారు. 2022లో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ (52 కేజీలు)గా నిలిచిన నిఖత్.. ఈ ఏడాది కూడా టైటిల్ దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌పై కన్నేసి 50 కేజీల విభాగానికి మారిన ఆమెకు మార్చి 15న దిల్లీలో ఆరంభమయ్యే ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో మరోసారి సవాలు ఎదురు కానుంది. మరోవైపు నిరుడు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం, డైమండ్ లీగ్ టైటిల్ సాధించిన నీరజ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో అతను పసిడి సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు.
నిరీక్షణ ముగిసేనా..
2011.. చివరగా టీమ్‌ఇండియా క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన ఏడాది. అప్పుడు ధోని సేన వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఏళ్లు గడుస్తున్నాయి.. ప్రపంచకప్‌లూ వచ్చి పోతున్నాయి.. కానీ భారత్ మరోసారి ఏ ఫార్మాట్లోనూ విశ్వవిజేతగా నిలవలేకపోయింది. రెండు వన్డే, అయిదు టీ20 ప్రపంచకప్‌ల్లోనూ నిరాశ తప్పలేదు. దశాబ్ద కాలానికి పైగా సాగుతున్న ఈ నిరీక్షణకు ముగింపు పలికేందుకు టీమ్‌ఇండియాకు ఈ ఏడాదే మంచి అవకాశం. 2023లో భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరుగుతుంది. సొంతగడ్డపై మనవాళ్లు మరోసారి చెలరేగి కప్పు ముద్దాడాలన్నది అభిమానుల కోరిక. అక్టోబర్‌లో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది.
రోహిత్ శర్మ, రాహుల్ డ్రావిడ్ స్వదేశంలో శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ (జనవరి 3 నుంచి)తో ఈ ఏడాదిని టీమ్‌ఇండియా ప్రారంభిస్తుంది. ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో సొంతగడ్డపై తలపడుతుంది. అనంతరం ఐపీఎల్‌లో 10 జట్ల సమరం ఎప్పటిలాగే కిక్కు అందించనుంది. జూన్‌లో కీలకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఉంది. వరుసగా రెండో సారి ఈ ఫైనల్లో తలపడాలనే పట్టుదలతో టీమ్‌ఇండియా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత్.. స్వదేశంలో ఆసీస్‌తో టెస్టుల్లో ఉత్తమ ప్రదర్శన చేస్తే ఫైనల్ బెర్తు కొట్టేసినట్లే! ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు జట్టు వెళ్తుంది. అనంతరం ఆసియా కప్ జరుగుతుంది. అక్టోబర్‌లో మరోసారి ఆస్ట్రేలియా ఇక్కడికి రానుంది. వన్డే ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పర్యటనలతో భారత్ ఏడాదిని ముగిస్తుంది. మరోవైపు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక టెస్టు సమరం ‘యాషెస్’ తిరిగి రానుంది. ఇంగ్లాండ్ వేదికగా జూన్ 16న ఈ సిరీస్ ఆరంభమవుతుంది.
సింధు మళ్లీ..
2019లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. మరోసారి ఆ ఘనత పునరావృతం చేస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. అంతకుముందు రెండేసి కాంస్యాలు (2013, 2014), రజతాలు (2017, 2018) గెలిచిన ఆమె.. 2022లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌కు దూరమైంది. కామన్వెల్త్ క్రీడల సందర్భంగా ఆమె ఎడమ పాదానికి గాయమైంది. దీంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్, ప్రపంచ టూర్ ఫైనల్స్ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న ఆమె.. ఈ ఏడాది మరోసారి ప్రపంచ వేదికపై సత్తాచాటాలనే లక్ష్యంతో ఉంది. ఇక నిరుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ పురుషుల డబుల్స్‌లో కాంస్యంతో చరిత్ర సృష్టించిన సాత్విక్- చిరాగ్ పైనా మంచి అంచనాలే ఉన్నాయి. వీళ్లతో పాటు శ్రీకాంత్, లక్ష్యసేన్ ఎలాంటి ప్రదర్శన చేస్తారన్నది చూడాలి.
జోరు కొనసాగేనా?
నిరుడు కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఇప్పుడదే జోరును ఆసియా క్రీడల్లోనూ కొనసాగించాల్సిన అవసరం ఉంది. 2022లోనే జరగాల్సిన ఆసియా క్రీడలు ఈ ఏడాదికి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. చైనాలోని హంగ్‌జౌలో సెప్టెంబర్ 23న ఈ క్రీడలు ఆరంభమవుతాయి. 2024 పారిస్ ఒలింపిక్స్‌కు ముందు భారత అథ్లెట్లకు ఈ క్రీడలు మంచి సన్నాహకంగా ఉపయోగపడనున్నాయి. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, చెస్, హాకీ, షూటింగ్, టీటీ, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ తదితర క్రీడల్లో మనవాళ్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2018 జకార్తా క్రీడల్లో 70 పతకాల ప్రదర్శనను ఈ సారి మెరుగుపర్చుకోవాలన్నదే భారత లక్ష్యం.
జకోవిచ్ × నాదల్
అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రేసులో నాదల్‌కు జకోవిచ్ నుంచి ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం 22 టైటిళ్లతో నాదల్ అగ్రస్థానంలో.. 21 విజయాలతో జకో రెండో స్థానంలో ఉన్నాడు. ఫెదరర్ (20) గతేడాది ఆటకు వీడ్కోలు పలకడంతో ఇప్పుడు పురుషుల సింగిల్స్‌లో నాదల్, జకో మధ్యే ప్రధాన పోటీ. మరి ఈ ఏడాది నాదల్‌ను దాటి జకో ముందుకు వెళ్తాడా? లేదా నాదల్ ఆధిపత్యం కొనసాగిస్తాడా? అన్నది చూడాలి. నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల్లో ఎవరిది పైచేయి అవుతుందో మరి. ఆస్ట్రేలియన్ ఓపెన్ (జనవరి 16-29), ఫ్రెంచ్ ఓపెన్ (మే 28- జూన్ 11), వింబుల్డన్ (జులై 3-16), యుఎస్ ఓపెన్ (ఆగస్టు 28- సెప్టెంబర్ 10) అభిమానులకు అలరించేందుకు మరోసారి వచ్చేస్తున్నాయి.
మహిళల సాకర్ సమరం
2022 పురుషుల ఫిఫా ప్రపంచకప్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు మంచి కిక్కునిచ్చింది. ఈ ఏడాది ఆ జోష్‌ను కొనసాగించేందుకు అమ్మాయిల ఫుట్‌బాల్ ప్రపంచకప్ వచ్చేస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీ జులై 20న ఆరంభమవుతుంది. 32 జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి.
పురుషుల హాకీ ప్రపంచకప్ (జనవరి 13-29, ఒడిషా)
- అండర్-19 అమ్మాయిల టీ20 ప్రపంచకప్ (జనవరి 14-29, దక్షిణాఫ్రికా)
- మహిళల టీ20 ప్రపంచకప్ (ఫిబ్రవరి 10-26, దక్షిణాఫ్రికా)
- మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ (మార్చి 15-31, దిల్లీ)
- పురుషుల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ (మే 1-14, ఉజ్బెకిస్థాన్)
- మహిళల ఫిఫా ప్రపంచకప్ (జులై 20-ఆగస్టు 20, ఆస్ట్రేలియా/న్యూజిలాండ్)
- ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ (ఆగస్టు 19-27, హంగేరీ)
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ (ఆగస్టు 21-27, డెన్మార్క్)
- ఆసియా క్రీడలు (సెప్టెంబర్ 23-అక్టోబర్ 8, చైనా)
- పురుషుల వన్డే ప్రపంచకప్ (అక్టోబర్-నవంబర్, భారత్)