తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ సమరానికి సై.. అమెరికాతో భారత్‌ ఢీ - ఫుట్​బాల్​ ప్రపంచకప్ లైవ్​ స్కోరు

ఫుట్‌బాల్‌లో మన గతమెంతో ఘనం. అదో స్వర్ణ యుగం. కానీ ప్రస్తుత పరిస్థితి అంతంతమాత్రమే. సీనియర్‌ ప్రపంచకప్‌లో చోటు ఎంతో దూరం. ఈ తరుణంలో.. దేశంలో మరోసారి ఆ ఆటకు ఆదరణ పెంచేలా.. సాకర్‌ మాయలో అభిమానులు పడిపోయేలా చేసేందుకు అండర్‌-17 మహిళల ప్రపంచకప్‌ వచ్చేసింది. ఈ ఫిఫా సంగ్రామానికి మంగళవారమే తెరలేవనుంది. మన సత్తాను ప్రపంచానికి చాటేందుకు.. అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకునేందుకు భారత అమ్మాయిలకు ఇదో సువర్ణావకాశం. మరి 16 జట్ల పోరులో భారత్‌ ఎక్కడి వరకు ప్రయాణిస్తుందో చూడాలి.

Under 17 womens world cup
ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ సమరానికి సై

By

Published : Oct 11, 2022, 8:22 AM IST

కరోనాను దాటుకుని.. నిషేధం అడ్డంకులను అధిగమించి.. అండర్‌-17 అమ్మాయిల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను నిర్వహించేందుకు మన దేశం సిద్ధమైంది. ఈ ప్రపంచకప్‌కు తొలిసారి ఆతిథ్యమిస్తున్న భారత్‌.. టోర్నీపై తనదైన ముద్ర వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఆతిథ్యంతో ఆకట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న భారత్‌ ఆటలోనూ అదరగొట్టాలనే లక్ష్యం పెట్టుకుంది. అమెరికా, బ్రెజిల్‌, మొరాకో లాంటి బలమైన జట్లతో కలిసి గ్రూప్‌- ఎ లో ఉన్న మన జట్టు అంచనాలకు మించి రాణించాలనే ధ్యేయంతో ఉంది. నేడు కళింగ స్టేడియంలో అమెరికాతో భారత్‌ తలపడుతుంది. ఈ నెల 30న ఫైనల్‌ జరుగుతుంది.

ఎదురుగా సవాళ్లు..ఆతిథ్య హోదాలో తొలిసారి ఈ ప్రపంచకప్‌ బరిలో భారత్‌ దిగనుంది. మిగతా జట్లతో పోలిస్తే ఆట ప్రమాణాల పరంగా వెనుకంజలో ఉన్నప్పటికీ ఈ టోర్నీ మన అమ్మాయిలకు గొప్ప అవకాశం. అత్యుత్తమ జట్లతో పోటీపడి మన నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి వేదిక. కానీ భారత్‌కు అడుగడుగునా సవాళ్లు ఎదురు కానున్నాయి. పటిష్ఠమైన బ్రెజిల్‌, అమెరికాతో పాటు మొరాకోతో భారత్‌ గ్రూప్‌- ఎ లో పోటీపడాల్సి ఉంది. ఈ జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్స్‌ చేరతాయి. టోర్నీలో క్వార్టర్స్‌కు అర్హత సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామని భారత కోచ్‌ థామస్‌ ఇప్పటికే స్పష్టం చేశాడు. కానీ అదంత సులభం కాదు. శక్తికి మించిన ప్రదర్శనతో ముందుకు సాగితేనే సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఇప్పటికే అమెరికా, బ్రెజిల్‌ సీనియర్‌ జట్లు సత్తాచాటుతున్నాయి. ఈ జూనియర్‌ జట్లు కూడా వాటికి ఏ మాత్రం తీసిపోకుండా ఆటలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. గ్రూప్‌లో భారత్‌ ఒక్క విజయం సాధించినా గొప్ప విషయమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్‌ ఫుట్‌బాల్‌ సంఘం టోర్నీలో విజేతగా నిలిచిన అమెరికా ప్రపంచకప్‌లో శుభారంభం చేయాలని చూస్తోంది.

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ సమరానికి సై

ఫార్మాట్‌ ఇలా...

  • 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్రతి గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్‌- ఎలో భారత్‌, అమెరికా, మొరాకో, బ్రెజిల్‌ ఉన్నాయి. ‘బి’లో జర్మనీ, నైజీరియా, చిలీ, న్యూజిలాండ్‌, ‘సి’లో స్పెయిన్‌, కొలంబియా, మెక్సికో, చైనా, ‘డి’లో జపాన్‌, టాంజానియా, కెనడా, ఫ్రాన్స్‌ ఉన్నాయి.
  • భారత్‌ నేడు అమెరికాతో, 14న మొరాకోతో, 17న బ్రెజిల్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లన్నీ కళింగ స్టేడియంలోనే జరుగుతాయి. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు ఆరంభమయ్యే మ్యాచ్‌ల్లో మొరాకోతో బ్రెజిల్‌, జర్మనీతో నైజీరియా పోటీపడతాయి. రాత్రి 8 గంటలకు జర్మనీతో నైజీరియా, అమెరికాతో భారత్‌ మ్యాచ్‌లు ఆరంభమవుతాయి.
  • 2018లో స్పెయిన్‌ విజేతగా నిలిచింది. ఈ ప్రపంచకప్‌ను అత్యధికంగా ఉత్తర కొరియా (2008, 2016) రెండు సార్లు దక్కించుకుంది. దక్షిణ కొరియా (2010), ఫ్రాన్స్‌ (2012), జపాన్‌ (2014) ఒక్కోసారి కప్పు సొంతం చేసుకున్నాయి.

సమష్టిగా సత్తాచాటితేనే..ఈ ప్రపంచకప్‌లో భారత్‌ ఛాంపియన్‌గా నిలుస్తుందనే అంచనాలు లేవు. కానీ స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఆ దిశగా సాగాలనే ఆశలు మాత్రం ఉన్నాయి. కరోనా కారణంగా 2020లో ఈ ప్రపంచకప్‌ జరగకపోవడం భారత్‌కు చేటు చేసిందనే చెప్పాలి. అప్పుడు ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన జట్టు రొమేనియాతో మ్యాచ్‌ల్లో ఓ విజయం, డ్రా నమోదు చేసింది. అప్పుడు గోల్స్‌ చేసిన క్రీడాకారిణులు ప్రియాంక, మరియమ్మల్‌, సుమతి వయస్సు ఇప్పుడు 17 ఏళ్లు దాటిపోయింది. దీంతో వీళ్లు ఈ ప్రపంచకప్‌లో ఆడడం లేదు. మళ్లీ కొత్తగా జట్టును ఎంపిక చేయాల్సి వచ్చింది. ఇందులోని ప్రధాన క్రీడాకారిణులతో కూడిన జట్టు ఈ ఏడాది అండర్‌-18 శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడం కలిసొచ్చే అంశం. ఆ టోర్నీలో అత్యధిక గోల్స్‌ చేసిన లిండా కోమ్‌ సెర్టోపై ఈ ప్రపంచకప్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. వైవిధ్యమైన ఆటతీరుతో ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించుకుని గోల్స్‌ కొట్టడంలో పట్టు సాధించిన ఈ ఫార్వర్డ్‌ ప్లేయర్‌ జట్టుకు కీలకం కానుంది. అనిత కుమారి, నీతు లిండా, షిల్కీ దేవి పైనా అందరి కళ్లు ఉండబోతున్నాయి. అటాకింగ్‌లో బలంగా ఉన్న జట్టు డిఫెన్స్‌లో మాత్రం కలవరపెడుతోంది. కెప్టెన్‌ అస్తం ఒరాన్‌ సారథ్యంలోని డిఫెన్స్‌ విభాగం పటిష్ఠంగా నిలబడాల్సిన అవసరం ఉంది. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చి ప్రపంచకప్‌ కోసం కలిసిన అమ్మాయిలు సమష్టిగా సత్తాచాటాలి. ఇటలీ, నార్వే, స్పెయిన్‌ పర్యటనలతో ప్రపంచకప్‌కు భారత్‌ మెరుగ్గానే సన్నద్ధమైంది.

దారి చూపిన కోచ్‌..ఝార్ఖండ్‌లోని రాంచికి సమీపంలోని కర్మ గ్రామానికి చెందిన అనిత కుమారి, నీతు లిండా ప్రపంచకప్‌ ఆడబోతున్నారు. వీళ్లు ఈ స్థాయికి రావడం వెనక కోచ్‌ ఆనంద్‌ కష్టం ఉంది. ఎన్నో అవమానాలు, అడ్డంకులు దాటి ఈ ప్లేయర్లను తీర్చిదిద్దిన అతని శ్రమ ఉంది. ఈ గిరిజన గ్రామానికి ఫుట్‌బాల్‌ను పరిచయం చేసిన ఘనత అతనిదే. 2013లో అతను తొలిసారిగా అనిత, నీతూలను కలిశాడు. ఈ గిరిజన అమ్మాయిలకు ప్రపంచాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఫుట్‌బాల్‌ నేర్పించడం మొదలెట్టాడు. బాల్య వివాహాల నుంచి అమ్మాయిలను రక్షించాలనే లక్ష్యం కూడా ఉంది. అప్పుడే అతనికి సవాళ్లు ఎదురయ్యాయి. షార్ట్స్‌ వేసుకుని ఆడేందుకు వీళ్లు ఏమైనా అబ్బాయిలా? అంటూ తల్లిదండ్రులు ప్రశ్నించారు. అందులో కొంతమందిని అతను ఒప్పించగలిగాడు. కానీ మిగిలిన వాళ్లు ఈ శిక్షణను ఎలాగైనా అడ్డుకోవాలని మైదానంలో గాజు పెంకులు పోసేవాళ్లు. సాధన చేసే అవకాశం లేకుండా ఆ ప్రాంతాన్ని ఆక్రమించేవాళ్లు. కానీ అతను ఆగిపోలేదు. సమస్యలను దాటి ముందుకు సాగాడు. ప్రస్తుతం అతని దగ్గర 250 మంది శిక్షణ పొందుతున్నారు. అందులో కనీసం 20 మంది జాతీయ స్థాయిలో ఆడారు. ఇప్పుడు అనిత, నీతు ప్రపంచకప్‌లో ప్రాతినిథ్యం వహించనున్నారు. మరోవైపు ప్రపంచకప్‌లో జట్టుకు సారథ్యం వహించనున్న అస్తం కారణంగా ఆమె గ్రామానికి కొత్త రోడ్డు వేస్తున్నారు.

మాతో మ్యాచ్‌లో అమెరికా ఫేవరేట్‌ అనడంలో సందేహం లేదు. కానీ అది కాగితంపై. ఫుట్‌బాల్‌ మైదానంలో ఆడాలి. ఆ జట్టుపై గెలిచేందుకు మాకూ అవకాశాలున్నాయని అనుకుంటున్నా. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మెరుగ్గా సన్నద్ధమయ్యాం. మా ప్లేయర్లందరూ ప్రపంచకప్‌ కోసం సిద్ధంగా ఉన్నారు. టోర్నీలో క్వార్టర్స్‌ చేరడం మాకో గొప్ప ఘనతగా నిలిచిపోతుంది. కానీ ముందు అమెరికాతో మ్యాచ్‌పై దృష్టి పెట్టాలి’’

- భారత కోచ్‌ థామస్‌ డెనెర్బీ

ఇదీ చూడండి:ఆఖరి వన్డే కోసం భారత్​-దక్షిణాఫ్రికా సై.. సిరీస్​ ఎవరిదో?

ABOUT THE AUTHOR

...view details