Two Grand Masters In One Family R Praggnanandhaa : చెస్- ఈ క్రీడ భారతదేశంలో పురుడుపోసుకుంది. దీని అసలు పేరు చతురంగ (చదరంగం). ప్రస్తుతం ఈ క్రీడలో భారత్ అగ్ర శక్తిగా ఎదుగుతోంది. అయితే మేధో శక్తితో ఆడే ఆ ఆటలో తమిళనాడుకు చెందిన అక్కాతమ్ముళ్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వారే ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను మట్టికరిపించిన తమ్ముడు రమేశ్‌బాబు ప్రజ్ఞానంద. ప్రస్తుతం భారత చెస్ పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగురవేస్తున్న క్రీడాకారుడు. కేవలం 12 ఏళ్ల 10 నెలల వయసులోనే గ్రాండ్‌మాస్టర్ అయి చరిత్ర సృష్టించాడు. మరోవైపు భారత 84వ, భారతీయ మూడో మహిళా గ్రాండ్ మాస్టర్‌గా నిలిచిన అక్క రమేశ్‌బాబు వైశాలి. అయితే వీరి విజయం వెనుక ఒక సాధారణ భారతీయ గృహిణి అవిశ్రాంత కష్టం ఉంది. ప్రజ్ఞానంద, వైశాలి తాము చెస్ బోర్డుపై వేసే ప్రతి ఎత్తు వెనుక వారి తల్లి నాగలక్ష్మి అపారమైన ప్రేమ ఉంది.
కార్టూన్ల నుంచి దృష్టి మళ్లించడానికి..!
అయితే పిల్లలను చెస్ ప్లేయర్లుగా చేద్దామనే ఆలోచన ఆ మొదటి నుంచీ తల్లికి లేదు. ప్రజ్ఞానంద, వైశాలి తండ్రి రమేశ్ బాబు బ్యాంకు ఉద్యోగి కాగా.. తల్లి గృహిణి. అయితే చిన్నతనంలో వైశాలి కార్టూన్లు ఎక్కువగా చూసేది. అయితే టీవీపైనే ఎక్కువ సమయం కాలక్షేపం చేస్తోందని.. దాని నుంచి దృష్టి మళ్లించడానికి నాగలక్ష్మి చెస్ బోర్డు కొనిచ్చింది. దీంతో చిన్నారి వైశాలి మెల్లిగా చదరంగంపై పట్టు సాధించింది. ఐదేళ్లు రాగానే బ్లూమ్ చెస్ అకాడమీలో ఆ చిన్నారిని చేర్పించారు. అద్భుతంగా రాణించిన వైశాలి.. అండర్-11,13,15ల విభాగంలో దేశస్థాయిలో బంగారు పతకాలు సాధించింది. 2015లో నేషనల్ ఛైల్డ్ అవార్డును నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అందుకొంది. అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (ఫిడే) తాజాగా వెల్లడించిన ర్యాంకుల ప్రకారం వైశాలి 2500+ రేటింగ్ పాయింట్లను సాధించి గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించింది. ఈ ఘనత సాధించిన మూడో భారతీయ మహిళగా, తొలి తమిళనాడుకు చెందిన మహిళగా నిలిచింది.
నిజానికి చెస్‌లో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకోవడం ఆషామాషీ విషయం కాదు. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ఫిడే) పేర్కొన్న పలు రకాల కఠిన కొలమానాల్లో ఇమడాలి. విశ్వనాథన్ ఆనంద్ వంటి దిగ్గజానికి కూడా 18 ఏళ్ల వయసులో 1988లో గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కిందంటే ఆ నియమాలు ఎంత కఠినంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
అక్కను చూస్తూ.. అందనంత ఎత్తుకు ప్రజ్ఞానంద!
మరోవైపు అక్క చెస్ ఆడటం చూసి దానిపై ప్రజ్ఞానందకు ఆసక్తి పెరిగింది. అలా ప్రజ్ఞానంద చెస్‌పై పట్టు సాధించాడు. అక్కతో కలిసి ఆడుతూ ఆటపై కాస్త పట్టు సాధించాక.. త్యాగరాజన్ అనే కోచ్ దగ్గర అతడు శిక్షణకు చేరాడు. స్వీయ ప్రతిభకు శిక్షణ తోడవడం వల్ల పిన్న వయసులోనే పెద్ద వాళ్ల మీద గెలుస్తూ 10 ఏళ్ల 10 నెలలకే ఇంటర్నేషనల్ మాస్టర్ అయి ప్రపంచ చెస్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడయ్యాడు. ఆ తర్వాత రెండేళ్లకే జీఎమ్ అయ్యాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే మహామహులను మట్టికరిపిస్తున్నాడు.