తమకు నచ్చని ఆటగాళ్ల విషయంలో అభిమానులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటం చూస్తూనే ఉంటాం. అలా కొన్ని సందర్భాల్లో కొంతమంది హద్దులు మీరి దాడికి కూడా పాల్పడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఈ సారి ఏకంగా ఓ ప్రేక్షకుడు హద్దులు మీరి.. ఓ ప్లేయర్‌పై దూసుకెళ్లి కర్రతో దాడి చేశాడు. ఎక్కడంటే..
తాజాగా టర్కీలో అల్టే-గొజ్టేపె మధ్య మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ వ్యక్తి హద్దులు మీరాడు. అల్టేకు చెందిన గోల్ కీపర్ వొజన్ ఎవ్రిమ్ ఓజెన్ పై దాడికి పాల్పడ్డాడు. దీంతో సహచర ఆటగాళ్లు, సెక్యూరిటీ సిబ్బంది గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. వెంటనే అంబులెన్స్ వచ్చి వొజన్కు తాకిన చిన్న గాయాలకు చికిత్స అందిస్తుండగా.. మరో సారి ఆ దుండగుడు ఏకంగా కర్రతో అతడి మీద దాడి చేశాడు. వెనకాల నుంచి వచ్చి వొజన్ నెత్తిమీద రెండు సార్లు బాదాడు. దీంతో అక్కడున్న ఇద్దరు ఆటగాళ్లు కూడా భయంతో పరుగులు తీశారు. అయితే వెంటనే స్పందించిన సిబ్బంది, ఇతర ఆటగాళ్లు దుండగుడిని పట్టుకున్నారు. వెంటనే వొజన్ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనతో మ్యాచ్‌ను అర్థాంతరంగా నిలిపేశారు. అయితే నిందితుడు.. వొజన్ పై ఎందుకు దాడి చేశాడు..? అనేది మాత్రం తేలియాల్సి ఉంది. ప్రస్తుతం వొజన్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.