ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంటే సమస్త క్రీడా లోకాన్ని ఒక్క చోటికి తెచ్చే పండగలాంటిది. పెద్ద ఎత్తున పాల్గొనే క్రీడాకారులతో ఆ ప్రాంతమంతా అంగరంగ వైభవంగా కనిపిస్తుంది. వివిధ దేశాధినేతలు, ఆయా దేశాల జాతీయ పతకాల రెపరెపలు, నృత్య ప్రదర్శనలు.. ఇలా అట్టహాసంగా ప్రారంభమవుతుంది. కానీ, ఈసారి ఒలింపిక్స్‌కు ఇవేమీ ఉండవు. కరోనా కారణంగా ఈసారి టోక్యో వేదికగా జరగనున్న విశ్వక్రీడల ప్రారంభ వేడుక చాలా నిరాడంబరంగా జరగనుంది.
ఈ సారి ఇలా..
టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics Opening Ceremony) ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేవలం 15 దేశాల నాయకులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వెయ్యి మంది లోపు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు సమాచారం.
కొవిడ్ మహమ్మారి నియంత్రణలో భాగంగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారని జపాన్ చీఫ్ కేబినేట్ కార్యదర్శి కట్సునోబు కటో తెలిపారు. మొత్తం 70 మంది కేబినేట్ స్థాయి నాయకులు జపాన్ను సందర్శించనున్నారని పేర్కొన్నారు. ఆయనలా చెప్తున్నప్పటికీ ఆ సంఖ్యపై స్పష్టత లేదు. మహమ్మారి కారణంగా చాలా మంది తమ పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. దీంతో ఎంత మంది వీఐపీలు వస్తారనేదానిపై అనిశ్చితి నెలకొంది.
ఇప్పటికే ఒలింపిక్ గ్రామంతో పాటు క్రీడల్లో పాల్గొనే అథ్లెట్లలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ సజావుగా జరిగేది చివరి వరకు అనుమానంగానే మారింది. కొవిడ్ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు అర్ధంతరంగా తప్పుకుంటున్నారు.
పాల్గొననున్న ప్రథమ మహిళ..
అయితే ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, మంగోలియన్ ప్రధాని ఓయున్-ఎర్డెనే, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌తో పాటు మరికొంత మంది విశ్వక్రీడల ఆరంభ వేడుకకు వస్తామని మాట ఇచ్చారు. జపాన్‌లో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వీరు హాజరవుతారా లేదా అనేది స్పష్టత లేదు.
ఇదిలా ఉండగా, ఒలింపిక్స్ నేపథ్యంలో.. కరోనా కారణంగా దెబ్బతిన్న వివిధ దేశాధినేతలతో వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరుచుకోవాలని జపాన్ ప్రధాని భావిస్తున్నట్లు కటో తెలిపారు.
ఇదీ చదవండి:Olympics: వీళ్లు తక్కువేం కాదు.. అద్భుతాలు చేయగలరు!