ఒలింపిక్స్‌కు సమయం దగ్గర పడిపోతోంది. ఇంకో రెండు వారాల్లోనే విశ్వక్రీడలు మొదలు కాబోతున్నాయి. కానీ ఆతిథ్య నగరంలో కరోనా మహమ్మారి అదుపులోకి రావట్లేదు. ఒలింపిక్స్ కోసం టోక్యోలో అడుగు పెడుతున్న క్రీడాకారుల బృందంలో కేసులు బయటపడుతున్నాయి. మరోవైపు టోక్యో నగరంలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. క్రీడా గ్రామంలో సైతం కొత్తగా రెండు కేసులు వెలుగు చూడటం నిర్వాహకుల్లో ఆందోళన పెంచుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే విశ్వ క్రీడలు అర్ధంతరంగా ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందేమో అన్న భయాలు కలుగుతున్నాయి.
ప్రపంచం నలుమూలల నుంచి క్రీడాకారులను రప్పించి.. మధ్యలో ఒలింపిక్స్ ఆపేయాల్సి వస్తే జపాన్‌కు, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అంతకంటే ఇబ్బందికర పరిస్థితి మరొకటి ఉండదు. దీని వల్ల కలిగే నష్టం కూడా లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుంది. అందుకే ఒలింపిక్స్ సమయంలో నిబంధనలు కఠినతరం చేయడానికి నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. టోక్యోలో వెంటనే కరోనా అత్యయిక స్థితిని విధించి, ఒలింపిక్స్ పూర్తయ్యేవరకు దాన్ని కొనసాగించడానికి జపాన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మంత్రులు నిపుణులతో చర్చించి గురువారం ఈ మేరకు అధికారిక నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.