తెలంగాణ

telangana

ETV Bharat / sports

Olympics 2021: పతకాల వేటలో 'భారత' ఆశాకిరణాలు వీరే.. - vinesh phogat olympics

ఒలింపిక్స్​లో భారత అథ్లెట్లు పలువురు పతకాలపై ఆశలు రేపుతున్నారు. వారిలో రెజ్లింగ్, హాకీ, ఆర్చరీ, బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఉన్నారు. ఇంతకీ వాళ్లెవరు? ఏయే విభాగాల్లో పోటీపడుతున్నారు?

Tokyo Olympics Overall review
ఒలింపిక్స్ 2021

By

Published : Jul 23, 2021, 4:30 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియా.. ఆర్చరీలో దీపిక కుమారి, వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాభాయ్‌ ఛాను, జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రాపై భారీ అంచనాలు ఉన్నాయి. వీరంతా మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాలని అభిమానులు కోరుకుంటున్నారు. గత కొన్ని ఒలింపిక్స్‌లతో పోలిస్తే ఈ విశ్వ క్రీడలకు ముందు భారత పురుషుల హాకీ జట్టు కూడా అత్యుత్తమ ఫామ్‌లో ఉండటం కలిసివచ్చే అంశం.

రెజ్లింగ్​లో పక్కా..

స్వతంత్ర భారతావనికి ఒలింపిక్స్‌లో తొలి వ్యక్తిగత పతకం దక్కింది రెజ్లింగ్‌లోనే. ఆ తర్వాత అర్ధశతాబ్దం పాటు ఆ ఆటలో మరో పతకం సొంతం కాలేదు. కానీ 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ నుంచి ప్రతిసారి విశ్వక్రీడల్లో రెజ్లింగ్‌లో కనీసం ఒక్క పతకమైనా భారత ఖాతాలో చేరుతోంది. ఈ సారి కూడా టోక్యోలో ఒకటి కంటే ఎక్కువ పతకాలు కచ్చితంగా వస్తాయనే అంచనాలున్నాయి. ఈసారి మొత్తం ఏడుగురు రెజ్లర్లు పతకం కోసం బరిలో దిగనున్నారు. 2016 ఒలింపిక్స్‌ క్వార్టర్‌ఫైనల్లో గాయంతో విలవిలలాడుతూ దేశానికి పతకం అందించే అవకాశం కోల్పోయానని కన్నీళ్లు పెడుతూ మ్యాట్‌ నుంచి నిష్క్రమించిన వినేశ్‌ ఫొగాట్‌.. టోక్యోలో మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోకూడదని పట్టుదలతో ఉంది.

వినేశ్ ఫొగాట్

53 కిలోల విభాగంలో టాప్‌సీడ్‌గా బరిలో దిగుతున్న ఆమె.. ఈ ఏడాది పోటీపడ్డ ఒక్క టోర్నీలోనూ ఓడిపోలేదు. స్వర్ణంతోనే తిరిగి వస్తుందని వినేశ్‌పై ప్రజల్లో నమ్మకం ఉంది. ఇక టీనేజీ సంచలనాలు అన్షు మాలిక్‌, సోనమ్‌ మాలిక్‌ ఆసక్తి రేకెత్తిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌ పురుషుల రెజ్లింగ్‌లో బజ్‌రంగ్‌ పునియా ప్రధాన ఆకర్షణ. కొన్నేళ్ల నుంచి ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శనతో తనపై అంచనాలను అతను పెంచేశాడు. కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు, ఆసియా, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల్లో పతకాలతో అతను ప్రపంచ అగ్రశ్రేణి రెజ్లర్లలో ఒకడిగా ఎదిగాడు. 65 కేజీల విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్‌గా టోక్యోలో అడుగుపెట్టబోతున్న ఈ రెజ్లర్‌కు ఈ విభాగంలో కఠినమైన పోటీ ఎదురు కానుంది. 2018లో ప్రపంచ క్యాడెట్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన 22 ఏళ్ల దీపక్‌ పునియాపైనా మంచి అంచనాలే ఉన్నాయి.

ఆర్చర్లు..

గత కొంత కాలంగా ప్రపంచకప్‌ టోర్నీలతో పాటు వివిధ అంతర్జాతీయ పోటీల్లో గొప్ప ప్రదర్శన చేసిన ఆర్చర్లు టోక్యో ఒలింపిక్స్‌లో తమపై ఆశలు పెట్టుకునేలా చేశారు. టోక్యోలో నలుగురు ఆర్చర్లు మొత్తం నాలుగు విభాగాల్లో పతకాల కోసం బరిలో దిగనున్నారు. రికర్వ్‌ ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి, పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను దాసు, ప్రవీణ్‌ జాదవ్‌, తరుణ్‌దీప్‌ తలపడనుండగా పురుషుల జట్టుతో పాటు మిక్స్‌డ్‌ టీమ్‌లోనూ మన ఆర్చర్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

దీపికా కుమారి

ముఖ్యంగా ప్రపంచ నంబర్‌-1 దీపిక కుమారిపైనే ఎక్కువ ఆశలు ఉన్నాయి. ముచ్చటగా మూడోసారి ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించబోతున్న 27 ఏళ్ల దీపిక.. గత వైఫల్యాలను పక్కనపెట్టి ఈ సారి విశ్వ క్రీడల్లో పతకంతో తిరిగి రావాలనే దృఢ నిశ్చయంతో ఉంది. ఒలింపిక్స్‌కు ముందు ఆమె అద్భుత ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. ఇటీవల పారిస్‌లో జరిగిన ప్రపంచకప్‌ మూడో అంచె పోటీల్లో తిరుగులేని ప్రదర్శన చేసిన తను మూడు స్వర్ణాలను ఖాతాలో వేసుకుంది. ఈ ప్రదర్శనతో తిరిగి నంబర్‌వన్‌ ర్యాంకును సాధించింది. ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలోనూ భారత్‌కు పతక అవకాశాలున్నాయి. ఈ విభాగంలో ప్రవీణ్​ జాదవ్​తో కలిసి దీపిక పోటీపడనుంది.

మీరాభాయ్​పైనే ..

టోక్యోలో భారత్‌ నుంచి ఆడుతున్న ఏకైక లిఫ్టర్‌ అయిన మీరాభాయ్‌ ఛాను 49 కిలోల విభాగంలో పతక ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. 2018 కామన్వెల్త్‌ క్రీడలతో పాటు ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచింది. స్నాచ్‌లో తడబడే అలవాటున్న మీరా.. అరోన్‌ హర్స్‌చిగ్‌ శిక్షణలో ఆ లోపాన్ని సరిదిద్దుకుంది.

మీరాభాయ్ ఛాను

టెన్నిస్‌లో ఈసారి రెండు విభాగాల్లోనే భారత్‌ తలపడనుంది. మహిళల డబుల్స్‌ జోడీ సానియా మీర్జా-అంకిత రైనా, పురుషుల సింగిల్స్‌లో సుమిత్‌ నగాల్‌ బెర్తు దక్కించుకున్నారు. ఏమైనా అదృష్టం కలిసొస్తే తప్ప టెన్నిస్‌లో పతకం కష్టమే.

సానియా మీర్జా

గత కొన్ని ఒలింపిక్స్‌ నుంచి టేబుల్‌టెన్నిస్‌లో భారత్‌ క్రీడాకారులు అర్హత సాధిస్తున్నారు. కానీ ఈసారి మాత్రం టీటీపై కొంచెం ఆశలు ఉన్నాయి. దీనికి కారణం మనిక బాత్రా. కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడల్లో సత్తా చాటిన మనిక.. ఈసారి మహిళల సింగిల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ బరిలో దిగుతోంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో వెటరన్‌ స్టార్‌ ఆచంట శరత్‌ కమల్‌-మనిక జోడీకి పతకం అవకాశాలు కనిపిస్తున్నాయి.

మనిక బాత్రా
బజరంగ్ పూనియా

ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ ఇప్పటివరకు 28 పతకాలు గెలిస్తే అందులో ఒక్క హాకీలోనే 11 పతకాలు వచ్చాయి. మొత్తం 9 స్వర్ణాల్లో ఎనిమిది ఈ ఆటలో దక్కినవే. గతమెంతో ఘనం అన్నట్లు ఒలింపిక్స్‌ హాకీలో మన చరిత్ర చిరస్మరణీయం. గత కొన్నేళ్లుగా మెరుగవుతున్న భారత హాకీ ఈసారి పతకంపై ఆశలు పుట్టిస్తోంది. గత కొన్ని ఒలింపిక్స్‌లతో పోలిస్తే ఈ విశ్వ క్రీడలకు ముందు భారత పురుషుల హాకీ జట్టు 4వ ర్యాంకులో ఉండి అత్యుత్తమ ఫామ్‌లో కనిపిస్తోంది. మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని జట్టు విజయాల వైపు ఉరకలేసే ఉత్సాహంతో ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details