తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tokyo Olympics: ఈ ఐదుగురికి పతకాలు పక్కా! - Tokyo Olympics news

జులై 23 నుంచి ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics 2021) కోసం మన దేశ క్రీడాకారులందరూ సిద్ధమవుతున్నారు. అయితే అందులో ఐదుగురు మాత్రం పతకాలు సాధించడం పక్కాగా కనిపిస్తోంది. ప్రస్తుతం వాళ్లు ఎలాంటి ఫామ్​లో ఉన్నారు? వాళ్ల సత్తా ఎంత? అనేది చూద్దాం.

Tokyo Olympics: India's five top medal contenders
టోక్యో ఒలింపిక్స్

By

Published : May 27, 2021, 2:07 PM IST

మరికొద్ది రోజుల్లో టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. అయితే కరోనా కారణంగా పోటీలు జరుగుతాయా? లేదా? అనే సందేహాలు వస్తున్నాయి. కాగా, భారత క్రీడాకారులు మాత్రం ఎక్కడా తగ్గకుండా ప్రాక్టీసు చేస్తున్నారు. పతకమే లక్ష్యంగా చెమట చిందిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనదేశం తరఫున కచ్చితంగా పతకం సాధిస్తారు అని అనుకుంటున్న కొంతమంది ప్లేయర్ల గురించే ఈ కథనం.

పీవీ సింధు- బ్యాడ్మింటన్

రియో ఒలింపిక్స్​లో వెండి పతకంతో సరిపెట్టుకున్న సింధు (PV Sindhu).. 2019లో ప్రపంచ ఛాంపియన్​షిప్​లో విజేతగా నిలిచి అదరగొట్టింది. అదే ఊపులో టోక్యో మెగాక్రీడలకు సిద్ధమైంది. కానీ కరోనా కారణంగా అవి కాస్త వాయిదా పడ్డాయి.

పీవీ సింధు

ప్రస్తుతం ఏడో ర్యాంక్​లో ఉన్న సింధు.. టోక్యోలో స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఇప్పటికే మూడు ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఫైనల్స్ ఆడిన అనుభవం, ఆసియన్ గేమ్స్ రజతం, కాంస్య పతకాలు గెలవడం.. కామన్వెల్త్ క్రీడల్లో వెండి పతకం.. ఈమెకు కలిసొచ్చే అంశం.

అమిత్ పంగల్ - బాక్సర్

2018 ఆసియా గేమ్స్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ విజేతను ఓడించిన తర్వాత నుంచి బాక్సింగ్​లో హవా చూపిస్తున్నాడు అమిత్ (Amit Panghal). ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈసారి ఒలింపిక్స్​లో 49 కిలోల విభాగం తీసేయడం వల్ల 52 కిలోల విభాగం నుంచి పోటీచేయనున్నాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్​లో రజతం, 2018 ఆసియా క్రీడల్లో స్వర్ణం.. ఇతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. దీంతో ఒలింపిక్స్​లో పతకం సాధిస్తాననే నమ్మకంతో అమిత్ ఉన్నాడు.

అమిత్ పంగల్

వినేశ్ ఫొగాట్ - రెజ్లింగ్

రియో పోటీల్లో పాల్గొని, గాయం కారణంగా మధ్యలోనే నిష్క్రమించింది ప్రముఖ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat). ఆ తర్వత మూడేళ్లకు భారత్​ తరఫున టోక్యో ఒలింపిక్స్ కోసం అర్హత సాధించిన తొలి ప్లేయర్​గా నిలిచింది. 2018లో ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకాలు గెలుచుకుంది. ప్రస్తుతం టోక్యోలో పతకం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

వినేశ్ ఫొగాట్

మేరీ కోమ్ - బాక్సింగ్

38 ఏళ్ల మేరీకోమ్ (mary Kom) వయసుతో సంబంధం లేకుండా బాక్సింగ్​లో దూసుకెళ్తోంది. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్​, లండన్​ ఒలింపిక్స్​లో కాంస్యం ఈమె ఘనతలు. అయితే మెగాక్రీడల్లో స్వర్ణం ఒక్కటే మేరీ సాధించలేకపోయింది. ఈసారి దానిని ఎలాగైనా సరే ఒడిసిపట్టేయాలని కృత నిశ్చయంతో ఉంది.

మేరీ కోమ్

ఎలవెనిల్ వలరివాన్‌- షూటింగ్

లండన్ ఒలింపిక్స్ పతక విజేత గగన్ నారంగ్ ఆధ్వర్యంలో రాణిస్తున్న యువ షూటర్ వలరివాన్ (Elavenil Valarivan).. నిలకడైన ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్​లో పతకంపై ఆశలు పెంచుతోంది. 2019లో జరిగిన రెండు ప్రపంచకప్​ల్లో తానేంటో నిరూపించిన ఈ షూటర్.. టోక్యోలో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

ఎలవెనిల్ వలరివాన్‌

ABOUT THE AUTHOR

...view details