రియో ఒలింపిక్స్‌లో భారీ అంచనాలతో బరిలో దిగి.. మూడు ప్రయత్నాల్లో విఫలమై ఒత్తి చేతులతో వెనుదిరిగింది వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను. కానీ మళ్లీ ఒలింపిక్స్‌కు వచ్చేసరికి ఈ మణిపురి లిఫ్టర్ బాగా మెరుగైంది. ఈసారి పతకం తెస్తానని బలంగా నమ్ముతోంది. టోక్యోలో భారత్ నుంచి ఆడుతున్న ఏకైక లిఫ్టర్ అయిన మీరా.. 49 కిలోల విభాగంలో పతక ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. 2018 కామన్వెల్త్ క్రీడలతో పాటు ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచింది. స్నాచ్‌లో తడబడే అలవాటున్న మీరా.. అరోన్ హర్స్‌చిగ్ శిక్షణలో ఆ లోపాన్ని సరిదిద్దుకుంది. తాజాగా అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో 50 రోజుల పాటు తీసుకున్న శిక్షణ.. టోక్యోలో సత్తా చాటేందుకు ఉపయోగపడుతుందని ఆమె నమ్ముతోంది.
అదృష్టం కలిసొస్తే..
టెన్నిస్‌లో ఈసారి రెండు విభాగాల్లోనే భారత్ తలపడనుంది. మహిళల డబుల్స్ జోడీ (సానియా మీర్జా-అంకిత రైనా), పురుషుల సింగిల్స్‌లో సుమిత్ నగాల్ బెర్తు దక్కించుకున్నారు. నాలుగో ఒలింపిక్స్ ఆడబోతున్న సానియామీర్జా వీరిలో సీనియర్. గత క్రీడల్లో బోపన్న జోడీగా మిక్స్‌డ్ డబుల్స్‌లో కొద్దిలో పతకం చేజార్చుకున్న సానియాకు ఈసారి పరిస్థితులు అంత సానుకూలంగా లేవు. అనుభవం లేని అంకిత రైనాతో ఆమె డబుల్స్‌లో బరిలో దిగనుంది. తల్లి అయిన తర్వాత చాలా కాలం టెన్నిస్‌కు దూరమైన ఆమె.. ర్యాంకుల్లో వెనకబడింది. కానీ రక్షిత ర్యాంకింగ్ విధానం (ఆటకు విరామం ఇచ్చినప్పుడు ఉన్న ర్యాంకు) ద్వారా టోక్యో బెర్తు సాధించగలిగింది. బోపన్న అర్హత సాధించకపోవడం వల్ల మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆడే అవకాశాలు లేవు. ఇక సింగిల్స్ ఆడబోతున్న సుమిత్ నుంచి అద్భుతాలు ఆశించలేం. మొత్తంగా ఏమైనా అదృష్టం కలిసొస్తే తప్ప టెన్నిస్‌లో పతకం కష్టమే.
అటు భవాని.. ఇటు సుశీల
ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) భారత్ ఎప్పుడూ అడుగుపెట్టని వేదిక ఫెన్సింగ్. చరిత్రలో తొలిసారి మన దేశం తరఫున ఈ విభాగంలో ప్రాతినిధ్యం వహించబోతోంది భవాని దేవి. పతకం విషయం పక్కనపెడితే హంగేరి, ఫ్రాన్స్, ఇటలీ లాంటి టాప్ ఫెన్సర్లను ఈ చెన్నై అమ్మాయి ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరం. క్వాలిఫయింగ్ దాటాలన్నా ఆమె శక్తికి మించి రాణించాల్సి ఉంటుంది. కోచ్ నికోలా జొనాటి శిక్షణలో రాటుదేలిన భవాని.. టోక్యోలో సత్తా చాటుతాననే విశ్వాసంతో ఉంది. మరోవైపు జూడోలో భారత్ నుంచి సుశీల దేవి మాత్రమే బరిలో ఉంది. 2019 కామన్వెల్త్ జూడోలో పసిడి గెలిచిన సుశీల.. అదే ఏడాది ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించి సత్తా చాటింది. కాంటినెంటల్ కోటా ద్వారా టోక్యో బెర్తు దక్కించుకున్న 26 ఏళ్ల ఈ జూడోకాకు ఒలింపిక్స్‌లో పతకం అవకాశాలు స్వల్పమే.
మనికపై ఆశలు
గత కొన్ని ఒలింపిక్స్ నుంచి టేబుల్‌టెన్నిస్‌లో(Tokyo olympics Table Tennis) భారత్ క్రీడాకారులు అర్హత సాధిస్తున్నారు. కానీ ఈసారి మాత్రం టీటీపై కొంచెం ఆశలు ఉన్నాయి. దీనికి కారణం మనిక బాత్రా. కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడల్లో సత్తా చాటిన మనిక.. ఈసారి మహిళల సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ బరిలో దిగుతోంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో వెటరన్ స్టార్ ఆచంట శరత్ కమల్-మనిక జోడీకి పతకం అవకాశాలు కనిపిస్తున్నాయి. పురుషుల సింగిల్స్‌లో శరత్ కమల్‌తో పాటు సత్యన్ బరిలో ఉన్నాడు. మహిళల సింగిల్స్‌లో మనిక కాకుండా సుతీర్థ ముఖర్జీ పోటీలో ఉంది.
వీళ్లు కూడా..: ఈక్వెస్ట్రియన్‌లో ఫవాద్ మీర్జా, జిమ్నాస్టిక్స్‌లో ప్రణతి నాయక్, రోయింగ్‌లో అరుణ్ లాల్, అరవింద్ సింగ్, సెయిలింగ్‌లో విష్ణు, గణపతి, వరుణ్, నేత్ర.. గోల్ఫ్‌లో అనిర్బన్ లాహిరి, ఉదయన్ మానె, అదితి అశోక్, స్విమ్మింగ్‌లో శ్రీహరి, సాజన్, మనా పటేల్ పోటీలో ఉన్నా.. పతకం సాధించే అవకాశాలు తక్కువ. వీళ్లందరిలో జిమ్నాస్టిక్స్‌లో ప్రణతి, ఈక్వెస్ట్రియన్‌లో ఫవాద్ ఎలా రాణిస్తారనే ఆసక్తి ఉంది. గత ఒలింపిక్స్‌లో దీపా కర్మాకర్ ఫైనల్‌కు వెళ్లి సంచలనం సృష్టించింది. ఈసారి ప్రణతి ఆమెలానే అద్భుతం చేస్తుందేమో చూడాలి.
ఇదీ చూడండి:చివరి నిమిషంలోనైనా ఒలింపిక్స్ రద్దు అవ్వొచ్చు!