తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tokyo Olympics: ఈసారి పతకం 'గురి' తప్పదు! - తొలి గోల్డ్​ మెడల్​ షూటర్

విశ్వక్రీడల్లో భారత్‌కు తొలిసారి వ్యక్తిగత పసిడి పతకం దక్కింది షూటింగ్‌లోనే. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో స్వర్ణం గెలిచి అభినవ్‌ బింద్రా చరిత్ర సృష్టించాడు. ఈసారి అదే షూటింగ్‌పై భారత్‌ భారీగా ఆశలు పెట్టుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15 మంది షూటర్లతో బలమైన భారత షూటింగ్‌ బృందం విశ్వక్రీడల్లో బరిలో దిగనుంది. మొత్తం 10 విభాగాల్లో మన షూటర్లు పతకాల కోసం పోటీపడుతున్నారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ టోర్నీల్లో వీరు పతకాల పంట పండించడం వల్ల టోక్యో ఒలింపిక్స్‌లోనూ(Tokyo Olympics) భారత షూటర్లపై భారీ అంచనాలు ఉన్నాయి.

Tokyo Olympics: How Many Medals Can India Win in Shooting?
Tokyo Olympics: ఈ సారి పతకం గురి తప్పదు!

By

Published : Jul 22, 2021, 3:36 PM IST

ఈసారి ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) మిగతా క్రీడల్లో కంటే షూటింగ్‌లోనే భారత్‌కు ఎక్కువ పతకాలు వచ్చే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీల్లో నిలకడగా పతకాలు కొల్లగొడుతోన్న మన షూటర్ల ప్రదర్శనే అందుకు కారణం. విశ్వక్రీడల్లో భారత్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణం వచ్చింది షూటింగ్‌లోనే. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో స్వర్ణం గెలిచిన అభినవ్‌ బింద్రా చరిత్ర సృష్టించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకూ విశ్వ క్రీడల్లో దేశానికి మరో బంగారు పతకం రాలేదు. టోక్యోలో మాత్రం మళ్లీ షూటింగ్‌లోనే పసిడి దరి చేరే అవకాశం ఉంది. ఎన్నడూ లేని విధంగా 15 మంది షూటర్లతో బలమైన భారత షూటింగ్‌ బృందం విశ్వక్రీడల్లో బరిలో దిగనుంది. వీరిలో ఎక్కువ మంది యువ షూటర్లే. మొత్తం 10 విభాగాల్లో మన షూటర్లు పతకాల కోసం పోటీపడనున్నారు.

టాప్​ షూటర్లతో..

పిస్టల్‌ విభాగంలో భారత్‌ అయిదుగురు ప్రపంచ టాప్‌ షూటర్లను టోక్యోకు పంపింది. 10మీ. ఎయిర్‌ పిస్టల్‌లో సౌరభ్‌ చౌదరి, అభిషేక్‌ వర్మ, మను బాకర్‌, యశస్విని తమ నైపుణ్యాలు ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచకప్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ షూటర్లు ఒలింపిక్స్‌లోనూ అదే ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా సౌరభ్‌, మనులపై భారీ అంచనాలున్నాయి. 10మీ. ఎయిర్‌ రైఫిల్‌లో మహిళల్లో 21 ఏళ్ల ఎలవెనిల్‌ వలరివన్‌, పురుషుల్లో 18 ఏళ్ల దివ్యాన్ష్‌ సింగ్‌ ప్రపంచ నంబర్‌వన్‌లుగా ఒలింపిక్స్‌లో అడుగు పెట్టబోతున్నారు. పతకం సాధిస్తారని వీళ్లపై నమ్మకం ఉంది.

మిక్స్​డ్​ టీమ్​ విభాగంలోనూ..

ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెడుతున్న మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు మంచి పతక అవకాశాలున్నాయి. 10మీ. ఎయిర్‌ పిస్టోల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో సౌరభ్‌- మను జోడీ కచ్చితంగా పోడియంపై నిలబడుతుందనే అంచనాలున్నాయి. బరిలో దిగిన గత ఆరు ప్రపంచకప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఈ జంట అయిదు స్వర్ణాలు, ఓ రజతం గెలిచింది. అదే విభాగంలో అభిషేక్‌- యశస్విని కూడా పతకం గెలిచే సామర్థ్యం ఉన్న జోడీనే. తమ తమ వ్యక్తిగత విభాగాల్లో ప్రపంచ నంబర్‌వన్‌లుగా ఉన్న ఈ ఇద్దరూ.. జంటగా పతకం కొల్లగొట్టడం ఖాయమనే అభిప్రాయాలున్నాయి. 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో దివ్యాన్ష్‌- ఎలవెనిల్‌ జోడీ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది.

ఎయిర్​ పిస్టోల్​లో ఫేవరేట్​

మరోవైపు ఇప్పటికే ఒలింపిక్స్‌లో ఆడిన అనుభవం ఉన్న సీనియర్‌ షూటర్లు రహి సర్నోబత్‌, అపూర్వీ చండేలా, సంజీవ్‌ రాజ్‌పుత్‌, అహ్మద్‌ ఖాన్‌ కూడా ఈ క్రీడల్లో సత్తాచాటాలనే లక్ష్యంతో ఉన్నారు. 25మీ. పిస్టోల్‌లో 30 ఏళ్ల సర్నోబత్‌ నిలకడగా రాణిస్తోంది. ఈ ఏడాది రెండు ప్రపంచకప్‌ల్లోనూ పోటీపడ్డ ఆమె ఓ స్వర్ణంతో పాటు మరో రజతాన్ని ఖాతాలో వేసుకుంది. 10మీ. ఎయిర్‌ పిస్టోల్‌లో అపూర్వీ ఫేవరేట్‌ అనడంలో సందేహం లేదు.

ఇదీ చూడండి..ఆరంభ వేడుకలకు వాళ్లు దూరం.. కారణం ఇదే!

ABOUT THE AUTHOR

...view details